Share News

అందరికీ ఉపాధి కల్పించడమే ధ్యేయం

ABN , Publish Date - Oct 19 , 2025 | 12:27 AM

చదువుకున్న వారందరికీ స్థానికంగా ఉపాధి కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయంగా పని చేస్తున్నట్లు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు.

అందరికీ ఉపాధి కల్పించడమే ధ్యేయం
సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు

జలుమూరు, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): చదువుకున్న వారందరికీ స్థానికంగా ఉపాధి కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయంగా పని చేస్తున్నట్లు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు. అల్లాడ ఎల్‌.కె.రోడ్డు నుంచి పారశెల్లి మీదుగా రెల్లివలస వరకు రూ.3.20 కోట్ల ఉపాధి నిధులతో నిర్మించిన బీటీరోడ్డును శనివారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంజనీరింగ్‌ చేసిన వారికి ఉపాధి కల్పించడానికి పలాసలో ఎయిర్‌పోర్ట్‌, మూలపేటలో పోర్టు నిర్మాణాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఉన్నత చదువులు పూర్తి చేసిన వారికి స్థానికంగా ఉద్యోగావకాశాలు కల్పించడానికి జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌ చొరవతో విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టడానికి అనేక కంపెనీలు ముందుకు వస్తున్నాయన్నారు. గూగుల్‌ కంపెనీ విశాఖలో రూ.1.35 వేల కోట్లు పెట్టుబడులు పెట్టడానికి రావడం ఉత్తరాంధ్ర ప్రజల అదృష్టమన్నారు. అభివృద్ధి పనులు చూసి ఓర్వలేని వైసీపీ రెడ్‌ బుక్‌ కథలు చెబుతోందని అన్నారు. వాటిని ప్రజలు నమ్మవద్దని కోరారు. అల్లాడ శ్రీవేంకటేశ్వరాలయం వద్ద కల్యాణ మండపం నిర్మాణానికి నిధులు మంజూరుకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, టీడీపీ నియోజకవర్గం సమన్వయకర్త బగ్గు అర్చన, శ్రీకాకుళం ఆర్డీవో కె.సాయిప్రత్యూష, తహసీల్దారు జె.రామారావు, ఇన్‌చార్జి ఎంపీడీవో ఉమామహేశ్వరరావు, టీడీపి నాయకులు దాసునాయుడు, కింజరాపు సత్యం, వెలమల రాజేంద్రనాయుడు, బగ్గు గోవిందరావు, సనపల రమణ, జెడ్పిటీసీ ప్రతినిధి మెండ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

పార్కు ప్రారంభం..

నరసన్నపేట, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): నరసన్నపేట మండలం పారసెల్లి గ్రామంలో సీసీ రోడ్డు, చిల్డ్రన్‌ పార్కును కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ప్రజలకు అండగా ఉంటుందని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పాల్గొన్నారు.

కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రాభివృద్ధి

జలుమూరు (సారవకోట), అక్టోబరు 18: కూటమి ప్రభుత్వంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని కేంద్రమంత్రివర్యులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. సవర మాళువ నుంచి మాళువ వరకు నిర్మించిన సిమెంటు రోడ్డును శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని సంక్షేమంతో పాటు అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. ప్రధానమంత్రి మోదీ సహాయ సహకారాలు అందిస్తుండడంతో రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు తీస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, తహసీల్దారు విజయలక్ష్మి, ఎంపీడీవో మోహన్‌కుమార్‌, నియోజవవర్గ ఇన్‌చార్జి బగ్గు అర్చన, ఎంపీపీ చిన్నాల కూర్మినాయుడు, టీడీపి రాష్ట్ర బీసీ సెల్‌ ప్రతినిధి ధర్మాన తేజకుమార్‌, సారవకోట సొసైటీ అధ్యక్షులు సురవరపు తిరుపతిరావు, మండల టీడీపీ అధ్యక్షులు కత్తిరి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.

ఇరువర్గాల ఘర్షణ

సిమ్మెంటు రోడ్డు ప్రారంభానికి మాళువ వెళ్లిన కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు... ఎంపీపీ చిన్నాల కూర్మినాయుడు వర్గం ఆహ్వానం మేరకు సర్పంచ్‌ నక్క రాజు ఇంటికి వెళ్లారు. దీంతో టీడీపీ రాష్ట్ర బీసీ సెల్‌ ప్రతినిధి వర్గం అభ్యంతరం తెలిపారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో కేంద్ర మంత్రి జోక్యం చేసుకొని...వివాదం సద్దుమణిగేలా చేశారు.

Updated Date - Oct 19 , 2025 | 12:28 AM