గంజాయి నిర్మూలనే లక్ష్యం
ABN , Publish Date - Nov 29 , 2025 | 11:51 PM
CCTV cameras in 65 hotspots జిల్లాలో గంజాయి రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలిసి జిల్లా నార్కోటిక్స్ సమావేశం నిర్వహించారు.
65 హాట్‌స్పాట్లలో సీసీ కెమెరాల ఏర్పాటు
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం కలెక్టరేట్, నవంబరు 29(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గంజాయి రవాణా, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌తో కలిసి జిల్లా నార్కోటిక్స్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ‘గంజాయిని సమూలంగా అరికట్టేందుకు జిల్లావ్యాప్తంగా గుర్తించిన 65 హాట్‌స్పాట్‌ల వద్ద సీసీ కెమెరాలను స్థానిక సంస్థలు ఏర్పాటు చేయాలి. శ్రీకాకుళంలోని పాతవంతెన వద్ద, రివర్ బెడ్, దమ్మల వీధి, వాటర్ ట్యాంకు, ఏపీహె చ్‌బీ కోలనీ పార్కు వెనుక భాగం, ఆర్టీసీ కాంప్లెక్స్ పాత భవనాల వెనుక భాగం వంటి ప్రదేశాల్లో తప్పనిసరిగా పూర్తి నిఘా ఉంచాలి. ఇప్పటివరకు 32 ప్రాంతాల నుంచి సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రతిపాదనలు రాగా, కేవలం 3 కెమెరాలు మాత్రమే ఏర్పాటు చేశారు. రానున్న రెండు రోజుల్లో మిగిలిన వాటికి ప్రతిపాదనలు పంపి, సత్వరం పూర్తిచేయాల’ని ఆదేశించారు.
ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ ‘గంజాయి నిర్మూలనకు ప్రజల సహకారం అవసరం. మాదకద్రవ్యాల సమాచారం తెలిసిన వెంటనే 112 ద్వారా, లేదా ప్రత్యేక హెల్స్‌లైన్ల ద్వారా పోలీసులకు సమాచారం అందజేయాలి. చీకటిగా ఉన్న ప్రాంతాల్లో దీపాలను ఏర్పాటు చేయాల’ని మునిసిపల్ కమిషనర్లు, డీపీఓలను కోరారు. అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులను పటిష్టంగా నిర్వహించాలన్నారు. ‘జిల్లాలో 38 ప్రభుత్వ, 67ప్రైవేటు జూనియర్ కళాశాలతోసహా అన్ని కళాశాలల్లో గంజాయి నివారణ కోసం ఈగల్ టీమ్‌లను ఏర్పాటు చేయాలి. మత్తు పదార్థాలతో అనర్థాలపై అవగాహన కల్పించాలి. గంజాయి నిర్మూలనపై హోంమంత్రి ప్రారంభించిన ‘‘అభ్యుదయం’’ సైకిల్ యాత్రలో జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాల’ని ఎస్పీ కోరారు. రహదారుల భద్రతపై జరిగిన సమీక్షలో ఎస్పీ మాట్లాడుతూ ‘శ్రీకాకుళం నవభారత్ జంక్షన్ వద్ద పాదచారుల భద్రత కోసం ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టాలి. ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ప్రైవేటు బస్సులు ఆపకుండా కేసులు నమోదు చేయాలి. రోడ్లపై ఇష్టానుసారంగా వాహనాలు పార్కింగ్ చేసినా కఠిన చర్యలు తీసుకోవాల’ని ఆదేశించారు. సమావేశంలో పోలీసు, విద్య, వైద్యారోగ్యశాఖ, ఇంజినీరింగ్, రవాణా శాఖల అధికారులు పాల్గొన్నారు.