Share News

మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యం

ABN , Publish Date - Dec 21 , 2025 | 12:26 AM

‘Abhyudayam Cycle Tour’ అందరి సహకారంతోనే డ్రగ్స్‌, గంజాయి నిర్మూలన సాధ్యమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం కోటబొమ్మాళిలో కొత్తమ్మతల్లి ఆలయం నుంచి కొత్తపేట జంక్షన్‌ వరకు ‘అభ్యుదయం సైకిల్‌యాత్ర’ నిర్వహించారు.

మాదకద్రవ్యాల నిర్మూలనే లక్ష్యం
అభ్యుదయం సైకి ల్‌ యాత్రలో పాల్గొన్న మంత్రి అచ్చెన్న, ఎస్పీ మహేశ్వరరెడ్డి తదితరులు

మంత్రి అచ్చెన్నాయుడు

కోటబొమ్మాళిలో ‘అభ్యుదయం సైకిల్‌యాత్ర’

కోటబొమ్మాళి, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): అందరి సహకారంతోనే డ్రగ్స్‌, గంజాయి నిర్మూలన సాధ్యమని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం కోటబొమ్మాళిలో కొత్తమ్మతల్లి ఆలయం నుంచి కొత్తపేట జంక్షన్‌ వరకు ‘అభ్యుదయం సైకిల్‌యాత్ర’ నిర్వహించారు. ఈ యాత్రలో ఎస్పీ మహేశ్వరరెడ్డి, విద్యార్థులతో కలిసి మంత్రి అచ్చెన్న పాల్గొన్నారు. అనంతరం కొత్తపేట జంక్షన్‌లో నిర్వహించిన సభలో మంత్రి అచ్చెన్న మాట్లాడుతూ ‘మత్తుపదార్థాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 25మంది పోలీసులు సుమారు 1,200 కిలోమీటర్లు సైకిల్‌యాత్ర నిర్వహించడం అభినందనీయం. మాదకద్రవ్యాల నిర్మూలనే కూటమి ప్రభుత్వ లక్ష్యం. గంజాయి, డ్రగ్స్‌ మత్తులోనే రాష్ట్రంలో నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ఎవరైనా గంజాయి, డ్రగ్స్‌ విక్రయిస్తే దుకాణాలను సీజ్‌ చేయడంతోపాటు వారి అస్తిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంద’ని తెలిపారు.

ఎస్పీ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ ‘ఎవరైనా డ్రగ్స్‌, గంజాయి, మత్తుపదార్థాలు వాడినట్లు తెలిస్తే టోల్‌ఫ్రీ నెంబర్‌ 1972కు ఫోన్‌చేసి సమాచారం ఇవ్వాలి. అలాంటి వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం. రాష్ట్రంలో మన జిల్లా పోలీసులే ఎక్కువ గంజాయి కేసులు పట్టుకున్నారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రజలు, విద్యార్థులు, యువత భాగస్వామ్యం కావాలి. గ్రామస్థాయి నుంచి మత్తు వ్యతిరేక ఉద్యమం విస్తరించాల’ని తెలిపారు.

ఆకట్టుకున్న ప్రదర్శనలు

అభ్యుదయ సైకిల్‌యాత్రలో భాగంగా కొత్తపల్లి జిల్లాపరిషత్‌ పాఠశాలకు చెందిన విద్యార్థులు జ్ఞానశ్రీ, ప్రియాంక ప్రదర్శించిన ‘‘మత్తులో పడకురా ఓ నరుడా’’ అంటూ చెప్పిన ఒగ్గు కఽథ ఆకట్టుకుంది. ‘‘డ్రగ్స్‌ వద్దురా’’ అంటూ టెక్కలి ఐతం కళాశాల విద్యార్థుల నృత్యప్రదర్శన, పలు పాఠశాలల విద్యార్థుల కోలాటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు, ఆర్డీవో కృష్ణమూర్తి, సీఐ కె.శ్రీనివాసరావు, రాష్ట్ర కళింగ కోమటి కార్పొరేషన్‌ చైర్మన్‌ బోయిన గోవిందరాజులు, పీఏసీఎస్‌ మాజీ అధ్యక్షుడు కింజరాపు హరివరప్రసాద్‌, ఎస్‌ఐలు సత్యనారాయణ, సింహాచలం, నారాయణస్వామి, షేక్‌మహ్మద్‌అలీ, ఐసీడీఎస్‌ పీవో హైమావతి, టీడీపీ మండల అధ్యక్షుడు బోయిన రమేష్‌, టీడీపీ నాయకులు ఎల్‌.ఎల్‌.నాయుడు, కల్లి నాగయ్యరెడ్డి, లక్ష్మణరెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Dec 21 , 2025 | 12:26 AM