Share News

అభివృద్ధే లక్ష్యంగా..

ABN , Publish Date - Oct 08 , 2025 | 12:38 AM

అభివృద్ధే లక్ష్యంగా పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ రాజమహేంద్రవరం కార్పొరేషన్‌తో ఎంవోయూ కుదుర్చుకుంది.

అభివృద్ధే లక్ష్యంగా..
పలాస మునిసిపల్‌ కార్యాలయం

- రాజమహేంద్రవరం కార్పొరేషన్‌తో పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ ఎంవోయూ

- ‘స్వచ్ఛసహర్‌ జోడి’ కింద కలసి పనిచేసేందుకు ఒప్పందం

పలాస, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): అభివృద్ధే లక్ష్యంగా పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ రాజమహేంద్రవరం కార్పొరేషన్‌తో ఎంవోయూ కుదుర్చుకుంది. స్వచ్ఛసహర్‌జోడి కార్యక్రమం కింద కలసి పనిచేసేందుకు ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు గత నెల 29న మునిపాలిటీ చైర్మన్‌ బళ్ల గిరిబాబు, కమిషనర్‌ ఎన్‌.రామారావు సంతకాలు చేశారు. జిల్లాలో ఈ విధంగా ఒప్పందం కుదుర్చుకున్న మొదటి మునిసిపాలిటీగా పలాస-కాశీబుగ్గ నిలిచింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో పలాస-కాశీబుగ్గ, పాలకొండ, ఏలేశ్వరం, పిఠాపురం, ముమ్ముడివరం మునిసిపాలిటీలు రాజమహేంద్రవరం కార్పొరేషన్‌తో టైఅప్‌ అయ్యాయి. అభివృద్ధిపై డీపీఆర్‌ తయారు చేయడం, టెండర్ల ప్రక్రియను పరిశీలించడం, సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాలపై సలహాలు, సూచనలు చేసి మునిసిపాలిటీని అధికారులు ప్రగతిపథంలో నడిపించనున్నారు.

అనేక సవాళ్లు

ప్రస్తుతం పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ అనేక సవాళ్లను ఎదుర్కొంటుంది. ముఖ్యంగా పారిశుధ్య సమస్య తీవ్రరూపం దాల్చింది. 31 వార్డులు ఉన్న మునిసిపాలిటీలో కనీసం 200 మందికి పైగా పారిశుధ్య కార్మికులు పనిచేయాల్సి ఉంది. కానీ, 75 మంది మాత్రమే ఉన్నారు. వీరిలో పారిశుధ్య పనులు కేవలం 30 మంది మాత్రమే చేస్తున్నారు. వీరితో పనులు చేయించడం అధికారులకు తలనొప్పిగా మారింది. ప్రతిరోజూ 50 టన్నులకు పైగా చెత్త పోగవుతుంటుంది. 9 ఎకరాల ఉండే డంపింగ్‌ యార్డు సైతం నిండుకుండగా మారింది. 16 వార్డు సచివాలయాలకు 8 మంది శానటరీ సెక్రటరీలు మాత్రమే ఉన్నారు. స్వచ్ఛభారత్‌ కార్యక్రమాల్లో భాగంగా పారిశుధ్యం మెరుగుపరుద్దామన్నా నిధులు, సిబ్బంది లేకపోవడంతో అధికారులు సైతం చేతులు ఎత్తేసే పరిస్థితి ఏర్పడింది. శ్రీకాకుళం, విజయనగరం కార్పొరేషన్లు, విశాఖ నగరపాలకసంస్థ ఉన్నా వాటి నిధులు వాటికే సరిపడుతున్నాయి. దీంతో రాజమహేంద్రవరం కార్పొరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దీనివల్ల ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ముఖ్యంగా పారిశుధ్య పరిస్థితి మెరుగుపడనుంది. పారిశుధ్య సిబ్బందిని కూడా అదనంగా నియమించుకునేందుకు వీలుంటుంది. ఈ విషయమై కమిషనర్‌ ఎన్‌.రామారావును వివరణ కోరగా ‘రాజమహేంద్రవరం కార్పొరేషన్‌తో ఎంవోయూ కుదుర్చుకున్నాం. ఇది అమలు జరిగితే ముఖ్యంగా పారిశుధ్యంపై దృష్టి పెట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. నిత్యం చెత్త సమస్యలతో ఇబ్బందులు పడుతున్న పలాస-కాశీబుగ్గకు ఉపసమనం కలుగుతుంది.’ అని అన్నారు.

Updated Date - Oct 08 , 2025 | 12:38 AM