Share News

అర్జీదారుల సంతృప్తే లక్ష్యం

ABN , Publish Date - May 27 , 2025 | 12:13 AM

అర్జీ దారులు సంతృప్తి చెందేలా ప్రజా ఫిర్యాదులను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు.

అర్జీదారుల సంతృప్తే లక్ష్యం
అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తున్న ఎస్పీ మహేశ్వరరెడ్డి

  • ఫిర్యాదుల పరిష్కారంపై దృష్టి

  • ఎస్పీ మహేశ్వరరెడ్డి

శ్రీకాకుళం క్రైం, మే 26 (ఆంధ్రజ్యోతి): అర్జీ దారులు సంతృప్తి చెందేలా ప్రజా ఫిర్యాదులను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కార కార్యక్రమంలో ఆయన జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారి నుంచి 62 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా అర్జీదారుల సమస్యలను స్వయంగా తెలుసుకుని... పూర్తి స్థాయిలో పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ఫిర్యాదుదారుల అర్జీలు, వాటి వివరాలను సంబంధిత పోలీసు అధికారులకు జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా తెలియపరచి... చట్ట ప్రకారం పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించి, బాధితులకు న్యాయం చేయాలన్నారు. వృద్ధులు, వికలాంగుల వద్దకు ఎస్పీ స్వయంగా వెళ్లి.. అర్జీలను స్వీకరించి, వారి సమస్యలను ఓపికగా తెలుసుకున్నారు.

నడిరోడ్డుపై భర్త వదిలేశాడని..

ఇద్దరు పిల్లలతో సహా తనను భర్త ఎర్ర శంకరరావు వదిలేశాడని ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డికి మంగమ్మ అనే మహిళ సోమవారం గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ లావేరు మండలం సిగురుకొత్తపల్లి గ్రామానికి చెందిన ఎర్ర శంకరరావు అనే వ్యక్తితో 2019లో తనకు వివాహమైందని తెలిపారు. ఇటీవల కాలంలో కులం పేరుతో గొడవల కారణంగా ఏప్రిల్‌ 28న సిగురు కొత్తపల్లిలో గల ఇంటికి వెళ్దామని చెప్పి, తీసుకువెళ్లిన భర్త శంకర రావు... తనను, ఇద్దరు పిల్లలను సుభద్రాపురం జంక్షన్‌లో రాత్రి 8.30 గంటల సమయంలో నడిరోడ్డుపై వదిలేసి వెళ్లిపోయాడని ఎస్పీకి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఎంతసేపటికీ తన భర్త రాకపోవడంతో తాను లావేరు పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశానన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు, ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆమె వాపోయారు. తనకు న్యాయం చేసి ఆదుకోవాలని ఆమె ఎస్పీని కోరారు.

Updated Date - May 27 , 2025 | 12:13 AM