నిరాశ పరిచిన ‘నైరుతి’
ABN , Publish Date - Oct 08 , 2025 | 12:37 AM
జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. అక్టోబరు వచ్చేసినా మోస్తరు వర్షాలు తప్ప భారీ వానలు పడడం లేదు.
- జిల్లాలో ఇంకా లోటు వర్షపాతమే
- 52.1 మిల్లీమీటర్లు తక్కువ
- ఈశాన్య రుతుపవనాలపైనే ఆశలు
శ్రీకాకుళం, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. అక్టోబరు వచ్చేసినా మోస్తరు వర్షాలు తప్ప భారీ వానలు పడడం లేదు. దీంతో ఇంకా లోటు వర్షపాతమే నెలకొంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో నైరుతి రుతుపవనాలు తీవ్రంగా నిరాశ మిగిల్చాయి. జూన్ నుంచి సెప్టెంబరు వరకు నాలుగు మాసాల్లో కేవలం ఆగస్టు మినహా మిగిలిన మూడు మాసాల్లో లోటు వర్షపాతమే నమోదైంది. వాతావరణశాఖ గణాంకాల ప్రకారం జూన్ నుంచి సెప్టెంబరు వరకు 679.17 మిల్లీమీటర్ల వర్షం జిల్లాలో కురవాల్సి ఉంది. కానీ, 627.07 మి.మీ మాత్రమే పడింది. దీంతో 52.1 మి.మీ లోటు వర్షపాతం నెలకొంది. ఆగస్టులో మాత్రం కురవాల్సిన దానికంటే 47.62 మిల్లీమీటర్ల వర్షం అధికంగా కురవడంతో కాస్త ఉపశమనం లభించింది. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు నిష్క్రమించి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాయి. దీంతో భారీ వర్షాలపై రైతులు ఆశలు పెట్టుకున్నారు.
తొలివారంలో భారీ వర్షాలు..
ఈశాన్య రుతుపవనాలు, మరోపక్క వాయుగుండం కారణంగా అక్టోబరు తొలివారంలో జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల కుండపోతగా వానలు పడ్డాయి. ఫలితంగా 72.79 శాతం వర్షపాతం నమోదైంది. కురవాల్సిన 66.08 మి.మీ కంటే అధికంగా 6.71మి.మీ వర్షం పడింది. ప్రతిఏటా అక్టోబరు, నవంబరులో సంభవించే తుఫాన్ల కారణంగా జిల్లాలో భారీ వర్షాలు కురుస్తుంటాయి. ఈదఫా తుఫాన్లు ఏర్పడితే లోటు వర్షపాతం కచ్చితంగా అధిగమించే అవకాశముంది. అయితే, తుఫాన్ల తీవ్రత ఎలా ఉంటుందోనని ప్రజలు భయాందోళన చెందుతుంటారు.