Share News

Engineers' Day : వంశధార ప్రాజెక్టు రూపకర్త జిల్లావాసే

ABN , Publish Date - Sep 14 , 2025 | 11:48 PM

CRM Patnaik recognized as a sikkol cotton సముద్రంలో వృథాగా కలిసిపోతున్న వంశధార నదీ జలాలను సాంకేతిక నైపుణ్యంతో అడ్డుకట్ట వేసి.. జిల్లాను సస్యశ్యామలం చేసి సిక్కోలు కాటన్‌గా సీఆర్‌ఎం(చిక్కాలవలస రాధామోహన్‌) పట్నాయక్‌ గుర్తింపు పొందారు. జిల్లాలో 2.50లక్షల ఎకరాలకు సాగునీటితోపాటు ప్రజలకు తాగునీటిని అందిస్తున్న వంశధార ప్రాజెక్టు(గొట్టాబ్యారేజీ) రూపకర్త అయిన సీఆర్‌ఎం పట్నాయక్‌ మన జిల్లాకు చెందిన ఇంజనీరే కావడం గర్వించదగ్గ విషయం.

Engineers' Day : వంశధార ప్రాజెక్టు రూపకర్త జిల్లావాసే
హిరమండలంలోని గొట్టాబ్యారేజీ... సీఆర్‌ఎం పట్నాయక్‌ (ఫైల్‌)

  • సిక్కోలు కాటన్‌గా సీఆర్‌ఎం పట్నాయక్‌కు గుర్తింపు

  • మోక్షగుండం స్ఫూర్తితో ఎంతోమందికి ఆదర్శంగా నిలిచి..

  • నేడు ఇంజనీర్ల దినోత్సవం

  • హిరమండలం/ ఎచ్చెర్ల, సెప్టెంబరు 14(ఆంధ్రజ్యోతి): సముద్రంలో వృథాగా కలిసిపోతున్న వంశధార నదీ జలాలను సాంకేతిక నైపుణ్యంతో అడ్డుకట్ట వేసి.. జిల్లాను సస్యశ్యామలం చేసి సిక్కోలు కాటన్‌గా సీఆర్‌ఎం(చిక్కాలవలస రాధామోహన్‌) పట్నాయక్‌ గుర్తింపు పొందారు. జిల్లాలో 2.50లక్షల ఎకరాలకు సాగునీటితోపాటు ప్రజలకు తాగునీటిని అందిస్తున్న వంశధార ప్రాజెక్టు(గొట్టాబ్యారేజీ) రూపకర్త అయిన సీఆర్‌ఎం పట్నాయక్‌ మన జిల్లాకు చెందిన ఇంజనీరే కావడం గర్వించదగ్గ విషయం. ఇంజనీరింగ్‌ దిగ్గజం.. మోక్షగుండం విశ్వేశ్వరయ్య స్ఫూర్తితో ప్రాజెక్టు రూపకల్పనలో ఆయన కీలకపాత్ర పోషించారు. అలాగే వివిధ ప్రాంతాల్లో ప్రాజెక్టులు, బ్యారేజీల నిర్మాణాలకు సూచనలు అందిస్తూ.. ఎంతోమంది ఇంజనీర్లకు ఆదర్శంగా నిలిచారు. సోమవారం ఇంజనీర్ల దినోత్సవం సందర్భంగా వంశధార ప్రాజెక్టు ప్రత్యేకతలో ఆయన కృషిని గుర్తుచేసుకుందాం.

  • నరసన్నపేట మండలం చిక్కాలవలసకు చెందిన సీఆర్‌ఎం పట్నాయక్‌ వంశధార నదిపై ప్రాజెక్ట్‌ను రూపకల్పన చేసి ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. 1924 అక్టోబరు 2న పర్లాకిమిడిలో జన్మించారు. విజయనగరంలో విద్యాభ్యాసం చేసి, మద్రాసు గిండీ ఇంజనీరింగ్‌ కళాశాలలో పట్టభద్రులయ్యారు. కొద్దికాలం తాను చదువుకున్న గిండీ ఇంజనీరింగ్‌ కళాశాలలో లెక్చరర్‌గా పాఠాలు చెప్పారు. తర్వాత ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఇంజనీర్‌ ఉద్యోగాన్ని పొంది మాంచ్‌ఖండ్‌లో పనిచేశారు. 1953లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడిన సమయంలో ఆంధ్ర ఇంజనీరింగ్‌శాఖకు బదిలీపై వచ్చారు. మాంచ్‌ఖండ్‌ ప్రాజెక్ట్‌లో పట్నాయక్‌ పనిచేస్తున్న సమయంలో.. ప్రాజెక్ట్‌ ఎత్తును 50 నుంచి 25అడుగులకు దించడం అతని సూచన మేరకే జరిగింది. ఆ తర్వాత ఈయన ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌గా నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌లో 1960-66 వరకు పనిచేశారు. నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌ స్థల సేకరణ సమయంలో కీలకపాత్ర పోషించారు. ఇతని ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం జిల్లాలో నీటి పారుదలకు అభివృద్ధికి 1966 జూన్‌లో శ్రీకాకుళం బదిలీ చేసింది. 1970లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు చేతుల మీదుగా వంశధార ప్రాజెక్ట్‌(గొట్టాబ్యారేజీ)కి శంకుస్థాపన చేయించారు. అలాగే ఓనిగడ్డ ఆనకట్ట, నాగావళి కుడి కాలువ పథకం, నారాయణపురం ఆనకట్ట కుడి కాలువ పనులను స్వల్పవ్యవధిలో పూర్తిచేసి ప్రభుత్వ ప్రశంసలు అందుకున్నారు.

  • జిల్లాలో వంశధార ప్రాజెక్ట్‌ జఠిల సమస్యను పరిష్కరించి ప్రాజెక్ట్‌కు వెలుగు చూపించారు. అందుకు అనుగుణంగా నూతన విధానాలతో జలాశయాల ఏర్పాటును రూపొందించి, సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ నుంచి అనుమతి సాధించి వంశధార ప్రాజెక్ట్‌కు ప్రభుత్వంతో మంజూరు చేయించారు. అప్పటినుంచి వంశధార ప్రాజెక్ట్‌ రూపశిల్పిగా పేరొందారు. అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు సూచనల మేరకు విశాఖపట్నం సర్కిల్‌లో సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న పట్నాయక్‌ నాగావళి, వంశధార నదుల అనుసంధానానికి ఒక పథకం తయారుచేసి ప్రభుత్వానికి అందజేశారు. దీని ఆధారంగానే నాగావళి నదిపై పలు ప్రాజెక్ట్‌ల రూపకల్పనకు అవకాశం ఏర్పడింది. అప్పటి రాష్ట్ర నీటిపారుదల శాఖామంత్రి వాసిరెడ్డి కృష్ణమూర్తినాయుడు సహకారంతో వివిధ సాగునీటి ప్రాజెక్ట్‌లను మంజూరు చేయించారు. నెల్లూరు సర్కిల్‌లో ఎస్‌ఈగా పనిచేస్తూ పట్నాయక్‌ ఉద్యోగ విరమణ చేశారు. భారత స్వర్ణోత్సవాల్లో భాగంగా 1997లో ప్రభుత్వం స్వర్ణభారతి పురస్కారాన్ని ఈయనకు అందజేసింది. వంశధార సర్కిల్‌ కార్యాలయంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్యతోపాటు సీఆర్‌ఎం పట్నాయక్‌ విగ్రహాలను గతేడాది ఆవిష్కరించారు. 93ఏళ్ల వయసులో ఈయన 2017లో శ్రీకాకుళంలోని స్వగృహంలో మృతిచెందారు.

  • ఆ రోజుల్లో...

  • ప్రస్తుతం బ్యారేజీ కట్టాలంటే.. ఆధునిక యంత్రాలను ఉపయోగించి సుమారు నాలుగైదేళ్లలో పూర్తిచేస్తున్నారు. కానీ మూడున్నర దశాబ్దాల కిందట చిన్నచిన్న యంత్రాలు, కూలీలు, గాడిదల సహాయంతో కేవలం ఏడేళ్లలో వంశధార నదిపై గొట్టాబ్యారేజీ నిర్మించారు. తొలుత 1954లో హిరమండలంలోని గొట్ట దగ్గర 16 టీఎంసీలు నిల్వ ఉంచేలా రిజర్వాయర్‌ నిర్మించాలని ఇంజనీరింగ్‌ అధికారులు ప్రణాళికలు తయారు చేశారు. దీని ప్రకారం 32వేల ఎకరాల వ్యవసాయ భూమి, 30గ్రామాలు పూర్తిగా, 32గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురికానున్నట్టు గుర్తించారు. ఈ నేపథ్యంలో తుంగతంపర శాస్త్రి తన 400 ఎకరాల భూమి మునిగిపోతుందనే తలంపుతో రాష్ట్రపతి వి.వి.గిరి అండతో రిజర్వాయర్‌ నిర్మాణానికి అడ్డంకులు వేశారు. దీంతో ప్రభుత్వం 1966లో సీఆర్‌ఎం పట్నాయక్‌కు వంశధార ప్రాజెక్టుకు నమూనాలు తయారు చేయాలని సూచించింది. రాజకీయంగా, సాంకేతిక అడ్డంకులు తొలగించేలా ఆయన రిజర్వాయర్‌ నిర్మాణానికి రూపకల్పన చేశారు. రిజర్వాయర్‌లో 19టీఎంసీలు నిల్వ చేయడమే కాకుండా కేవలం 10వేల ఎకరాలు మాత్రమే ముంపునకు గురయ్యాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా నది పక్కన రిజర్వాయర్‌ నిర్మాణానికి నాంది పలికారు. 1970లో గొట్టాబ్యారేజీకి పునాది వేసి.. 1977లో పూర్తిచేశారు. 2.90 లక్షల క్యూసెక్కుల నీటిప్రవాహం వచ్చినా తట్టుకునేలా బ్యారేజీ నిర్మించారు. అయితే 1980లో భారీ వర్షాలకు 6లక్షల క్యూసెక్కులకుపైగా వరద నీరు వచ్చినా బ్యారేజీ నిర్మాణం చెక్కుచెదరలేదంటే నిర్మాణంలో ఎలాంటి నాణ్యత పాటించారో అర్ధమవుతోంది. అప్పట్లో ఆయన గొట్టాబ్యారేజీ వద్దకు వచ్చి వరద పరిస్థితిని పరిశీలించారు. తిరిగి వెళ్లేందుకు దారిలేక పక్కనే కొండలపై నుంచి నడుచుకుని నరసన్నపేట చేరుకున్నారు. ఈ సంఘటన ఆయన కార్యదీక్షకు అద్దం పడుతోంది.

  • ప్రస్తుతం నిర్మిస్తున్న వంశధార ఫేజ్‌-2, స్టేజ్‌-2 ఆలోచన ఆయనదే. 15ఏళ్ల క్రితం ప్రకాశం బ్యారేజీలో క్లిష్టమైన సాంకేతిక సమస్యను ఈయన పరిశీలించారు. ప్రకాశం బ్యారేజీ భద్రతకు పలు సూచనలిచ్చారు. అనకాపల్లి వద్ద తాండవ ప్రాజెక్టులో సాంకేతిక సమస్యలకు ఈయన సూచనలు పరిష్కారాన్ని చూపాయి. ఇలా ఎంతోమంది యువ ఇంజనీర్లకు మెలకువలు నేర్పి ఆదర్శంగా నిలిచారు. నీటిపారుదల విభాగంలో అనేక ప్రాజెక్టులను సమగ్రంగా పరిశీలించి, వాటి లోపాలను సరిదిద్దేందుకు సాంకేతిక అంశాలపై పుస్తకాలు రచించారు. ఆయన కుమారుడు కూడా ఒడిశా ఇరిగేషన్‌ చీఫ్‌ ఇంజనీరుగా పనిచేస్తున్నారు. ఆంధ్రా-ఒడిశాకు సంబంధించి వంశధార జలవివాదంలో కొడుకు వాదనను కూడా కాదని, జిల్లా ప్రగతికి ఎనలేని కృషి చేశారు. పదవీ విరమణ చేసి ఏళ్లు గడిచినా.. ప్రభుత్వం వివిధ ప్రాజెక్టుల మరమ్మతుల విషయంలో ఈయన సూచనలు, సలహాలు తీసుకోవడం గర్వించదగ్గ విషయం.

  • చూడాలని కోరికతో ..

  • సీఆర్‌ఎం పట్నాయక్‌ 2016 ఆగస్టు 30న గొట్టాబ్యారేజీని చూడాలని.. అక్కడకు తనను తీసుకెళ్లాలని వంశధార అధికారులను కోరారు. 31న అప్పటి ఎస్‌ఈ బి.అప్పలనాయుడు ఆయనను బ్యారేజీ వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా వంశధార రిజర్వాయర్‌ మధ్యలో శివాలయం నిర్మించాలని అధికారులకు సూచించారు. నీటిలో మునగనంత ఎత్తులో దీనిని నిర్మించి రాకపోకలకు మార్గం ఏర్పాటు చేయాలన్నారు. ముంపు గ్రామాల్లో పురాతన శివాలయాన్ని గుర్తించి రిజర్వాయర్‌ నీటి మధ్యలో ఏర్పాటు చేస్తే గొప్ప పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. 93 ఏళ్ల వయసులో కూడా గొట్టాబ్యారేజీ అభివృద్ధికి పాటు పడటం ఆయనలో నిబద్ధతకు నిదర్శనం.

Updated Date - Sep 14 , 2025 | 11:48 PM