ఉద్యమాలను అణచివేసేందుకు కేంద్రం కుట్ర
ABN , Publish Date - Dec 29 , 2025 | 11:56 PM
దేశంలో ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ ఉద్యమాలను అణచివేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు.
శ్రీకాకుళం, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): దేశంలో ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ ఉద్యమాలను అణచివేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు. గతంలో నమోదైన ఓ కేసు నిమిత్తం శ్రీకాకుళం జిల్లా కోర్టుకు సోమవారం హాజరయ్యారు.అనంతరం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. 50 ఏళ్లుగా సాగుతున్న ఉద్యమాలు, వాటి ఫలితాలు, ఆయా పోరాటాలకు నాయకత్వం వహించిన వ్యక్తుల వివరాలు కావాలని డీజీపీలకు లేఖలు రాయడం ఉద్య మాలను అణచివేసే వ్యూహంలో భాగమేనని దుయ్యబట్టారు. కమ్యూనిస్టుల ఒత్తిడితో గతంలో అమల్లోకి వచ్చిన ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేం దుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పథకం నుంచి మహాత్మాగాంధీ పేరును తొలగించడమే కాకుండా నిధుల కేటాయింపులో కేంద్రం తన వాటాను 90నుంచి 60 శాతానికితగ్గించి రాష్ట్రాలపై భారం మోపిందని, దీనివల్ల గ్రామీణ ఉపాధి దెబ్బతింటుందని ఆందోళనవ్యక్తంచేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కూడా మోదీ బాటలోనే నడుస్తోందని విమర్శించారు. రాష్ట్రంలోని వైద్య కళా శాలలను పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. కార్పొరేట్‌శక్తుల నుంచి దేశాన్ని రక్షించుకోవాలంటే కమ్యూనిస్టు ఉద్యమ పునరేకీకరణ జరగాలని రామకృష్ణ పిలుపునిచ్చారు. జనవరి 15న ఖమ్మంలో జరగనున్న సీపీఐ శతవార్షికోత్సవ ముగింపు సభను విజయవంతం చేయాలని కోరారు.సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సత్యనా రా యణ మూర్తి మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో ఉత్తరాంధ్రను పాలకులు కాలుష్య కోరల్లోకి నెట్టేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ పాల్గొన్నారు.