సంక్షోభంలో జీడి పరిశ్రమ
ABN , Publish Date - Dec 23 , 2025 | 12:20 AM
ఒకప్పుడు పలాస జీడి పరిశ్రమకు అంతర్జాతీయంగా మంచి పేరుండేది. జీడిపప్పు ఎగుమతులు, దిగుమతుల్లో రాష్ట్రంలోనే పలాస నెంబర్ వన్ స్థానంలో ఉండేది.
ప్రాసెసింగ్‌కు అధిక ఖర్చు
ధర ఎక్కువ కారణంగా అమ్ముడుపోని పప్పు
ఒడిశా మార్కెట్‌ను ఆశ్రయిస్తున్న డీలర్లు
వ్యాపారులకు రూ.120 కోట్లకు పైగా నష్టం
పలాస, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు పలాస జీడి పరిశ్రమకు అంతర్జాతీయంగా మంచి పేరుండేది. జీడిపప్పు ఎగుమతులు, దిగుమతుల్లో రాష్ట్రంలోనే పలాస నెంబర్ వన్ స్థానంలో ఉండేది. అలాంటి జీడి పరిశ్రమ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయింది. జీడి పిక్కల ప్రాసెసింగ్‌కు అధిక ఖర్చు కావడం, పప్పు అమ్మకాలు సాగకపోవడం, దీనికోసం దళారులను ఆశ్రయించడం, ఒడిశా మార్కెట్‌కు డీలర్లు వెళ్లిపోవడం తదితర కారణాలతో పలాస జీడి వ్యాపారులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. రూ.120కోట్లకు పైగా వారికి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. దీంతో జీడి వ్యాపారాన్ని పూర్తిగా బంద్ చేస్తామని వ్యాపారులు చెబుతుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.
ఇదీ పరిస్థితి..
జిల్లా వ్యాప్తంగా 400 జీడి పరిశ్రమలు ఉండగా ఇందులో ఒక్క పలాసలోనే 240 పైగా ఉన్నాయి. ఇక్కడ 16వేల మందికి పైగా జీడి కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో 90శాతం మహిళలే. వ్యాపారులు 500 మంది వరకూ ఉంటారు. వీరిలో కొందరు సొంతంగా, మరికొందరు అద్దె విధానంలో పరిశ్రమలను నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. దేశీయంగా ఈ ప్రాంతంలో 35 వేల హెక్టార్లలో జీడిపంట సాగవుతుంది. దీంతో ఇక్కడ ఉత్పత్తి జరిగే జీడి పిక్కలు కేవలం మూడు నెలలకు మాత్రమే పరిశ్రమల నిర్వహణకు సరిపోతాయి. ఏడాది పొడవునా జీడి పరిశ్రమలు నిర్వహించాలన్నా, కార్మికులకు ఉపాధి కల్పించాలన్నా విదేశీ జీడి పిక్కలు తీసుకురావడం తప్పనిసరిగా మారింది. ఈ పరిస్థితుల్లో విదేశీ జీడిపిక్కలు ఇచ్చేందుకు మన రాష్ట్రంతో పాటు కేరళ రాష్ట్రానికి చెందిన వ్యాపారులు ట్రేడింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం జీడి పరిశ్రమల నిర్వహణ సులభతరంగా మారింది. ఆధునిక యంత్రాలు రావడంతో పనిసులభమై పప్పు ఉత్పత్తి శాతం పెరిగింది. అయితే కరోనా వచ్చిన నుంచి జీడిపప్పు వ్యాపారానికి గ్రహణం పట్టింది. ఎగుమతులు జరుగుతున్నా అందుకు తగ్గ ఆదాయం వ్యాపారులకు అందడం లేదు. కొనుగోలుదారుల సంఖ్య గణనీయంగా పడిపోయింది. జీడిపిక్కల రేట్లు భారీగా పెరిగినా పప్పురేట్లు తగ్గుదల కావడంతో వ్యాపారులు ఎటూపాలుపోలేని స్థితికి చేరుకున్నారు. వ్యాపారులు నేరుగా జీడిపప్పు అమ్మకాలు చేయడానికి అవకాశం లేకపోవడంతో బ్రోకర్లను ఆశ్రయించాల్సి వస్తోంది. వారు చెబుతున్న ధరలకు సరుకును అందిస్తున్నారు. ఇదే అదునుగా వారు జీడిపప్పు సేకరించిన తరువాత విడతలవారిగా నగదును వ్యాపారులకు ఇస్తుండడంతో వ్యయభారం పెరిగిపోతోంది. ప్రస్తుతం జీడి పిక్కలను ప్రాసెసింగ్ చేసి పప్పును మార్కెట్‌లో తరలించే సమయానికి బస్తాకు రూ.1800 ఖర్చవుతోంది. దీంతో పప్పు ధరలు పెంచక తప్పడం లేదు. హోల్‌సేల్ మార్కెట్‌కు వచ్చేసరికి పొరుగు రాష్ట్రాల్లో పప్పు రేట్ల తగ్గుదల కారణంగా ఆ ప్రాంతానికే డీలర్లు వెళ్లిపోతున్నారు. దీనివల్ల ఒక్కో వ్యాపారి ప్రస్తుతం రూ.30 నుంచి రూ.40 లక్షల వరకూ నష్టపోయినట్లు ప్రచారం జరుగుతోంది. చిన్నవ్యాపారుల పరిస్థితి మరీదారుణంగా మారింది. ఒక్కో వ్యాపారికి ఈ ఏడాది కనీసం రూ.10 లక్షల వరకూ నష్టం వచ్చినట్లు అంచనా. అదే ఒడిశా రాష్ట్రంలో బస్తాకు రూ.1200 మాత్రమే ఖర్చవుతోంది. దీనికి తోడు స్కిల్డ్ కార్మికులు ఉన్న కారణంగా పప్పు నాణ్యతగా ఉండడంతో పాటు ధరలు కూడా తగ్గుముఖం పట్టడంతో అన్ని రాష్ట్రాల వ్యాపారులు ఒడిశా వైపే చూస్తున్నారు. ప్రస్తుతం ఒడిశా జీడి మార్కెట్ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది.
ఒడిశావైపు చూపు..
ఒడిశా రాష్ట్రం ప్రస్తుతం దేశంలోనే జీడి వ్యాపారంలో నెంబర్ 1 స్థానానికి ఎగబాకింది. ఎందుకంటే అక్కడ జీడి పిక్కల నిర్వహణ ఖర్చు మిగిలిన రాష్ట్రాల కంటే 40 శాతం తక్కువకు ఉంది. దీంతో అక్కడి వ్యాపారులు లాభాలు అర్జిస్తున్నారు. పప్పు ధరలు కూడా తక్కువగా ఉండడంతో జీడి డీలర్లు కూడా ఆ రాష్ట్రంవైపే చూస్తున్నారు.
ప్రభుత్వంపైనే ఆశలు..
పలాస మార్కెట్ అంతర్జాతీయంగా నాలుగైదేళ్లు శాసించింది. అయితే ఒక్కడ జరుగుతున్న పరిణామాలతో ఆ ఖ్యాతి కోల్పోయే దిశకు చేరుకోవడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. మొక్క జీడిపప్పుగా ఖ్యాతి గాంచిన పలాస జీడి మార్కెట్ గతంలో ఎన్నడూ లేని విధంగా సంక్షోభంలోకి కూరుకుపోవడం చర్చనీయాంశంగా మారింది. పలాస జీడికి జాతీయస్థాయిలో మంచి గుర్తింపును తీసుకురావడానికి, బ్రాండ్ సంపాదించడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తున్న తరుణంలోనే ఈ పరిస్థితి ఏర్పడడం సర్వత్రా విచారం వ్యక్తమవుతోంది. అయితే, తమకు ఈ పని తప్పా వేరే గత్యంతరం లేదని, కష్టమైనా, నష్టమైనా దీన్నే కొనసాగిస్తామని కొంతమంది వ్యాపారులు చెబుతుంటే, మరికొందరు మాత్రం ఇదేవిధానం కొనసాగితే జీడి వ్యాపారాన్ని పూర్తిగా బంద్ చేసి కొత్త వ్యాపారానికి వెళ్లిపోతామని అంటున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వం కలుగజేసుకొని పలాస జీడి పరిశ్రమను గాడిలో పెట్టాల్సిన అవసరం ఉంది.
అలుసుగా తీసుకుంటున్నారు
ప్రస్తుతం వ్యాపారాలు ముందుకు సాగడం లేదు. ధరలు పతనం కారణంగా ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీన్ని అలుసుగా తీసుకొని కొంతమంది బ్రోకర్లు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దేనికైనా భరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. సంక్రాంతికి మార్కెట్ గాడిలో పడుతుందనే విశ్వాసం మాకు ఉంది.
- టంకాల రవిశంకర్‌గుప్తా, జిల్లా వాణిజ్యవిభాగం అధ్యక్షుడు, జీడి వ్యాపారసంఘం ప్రధాన కార్యదర్శి
అమ్మకాలు లేవు..
జీడిపప్పు ఉత్పత్తికి తగిన విధంగా మార్కెట్‌లో అమ్మకాలు లేవు. దీంతో వ్యాపారులమంతా తీవ్ర నష్టాల్లో ఉన్నాం. ప్రత్యామ్నాయ మార్కెట్‌కు వెళ్లలేక దీన్ని నమ్ముకొని వ్యాపారం చేస్తున్నాం. 70 ఏళ్ల జీడి చరిత్రలో ఇటువంటి పరిస్థితి రాలేదు. తొందరలోనే కుదుటపడుతుందని ఆశిస్తున్నాం.
- కేవీ శివకృష్ణ, వ్యాపార సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి
ప్రభుత్వం ఆదుకోవాలి
గతంలో ఎన్నడూ ఇటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొనలేదు. కరోనానే జయించాం. తితలీ తుఫాన్ నుంచి ఒడ్డెక్కాం అనుకున్న సమయంలో ఒక్కసారిగా మార్కెట్ పతనమైంది. దీనిపై ప్రభుత్వం స్పందించాలి. వ్యాపారులకు ప్రోత్సాహకాలు అందించాలి. కనీసం చిన్నపరిశ్రమలైనా సంక్షోభం నుంచి గట్టెక్కగలవు.
- మల్లా రామేశ్వరరావు, అధ్యక్షుడు, పారిశ్రామికవాడ యజమానుల సంఘం..