పడవ బోల్తా
ABN , Publish Date - Dec 01 , 2025 | 12:28 AM
Fisherman's death పడవ బోల్తా పడి మత్స్యకారుడు మృతి చెందిన సంఘటన శ్రీకాకుళం మండలం పెద్ద గనగళ్లవానిపేట తీరంలో ఆదివారం చోటుచేసుకుంది.
మత్స్యకారుడి మృతి
శ్రీకాకుళం రూరల్, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): పడవ బోల్తా పడి మత్స్యకారుడు మృతి చెందిన సంఘటన శ్రీకాకుళం మండలం పెద్ద గనగళ్లవానిపేట తీరంలో ఆదివారం చోటుచేసుకుంది. పెద్ద గనగళ్లవానిపేట పంచాయతీ పుక్కళ్లపేటకు చెందిన తోటయ్య(55).. మరో ముగ్గురు మత్స్యకారులతో కలిసి ఆదివారం ఉదయం సముద్రంలో చేపలవేటకు వెళ్లారు. అలల ఉధృతి పడవ బోల్తా పడగా వారంతా గల్లంతయ్యారు. ముగ్గురు ఒడ్డుకు చేరుకోగా, గనగళ్ల తోటయ్య(55) నముద్రంలో మునిగి మృతి చెందాడు. మృతదేహాన్ని తోటి మత్స్యకారులు ఒడ్డుకు చేర్చారు. దీంతో కుటుంబ సభ్యులు విలపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. మృతుని భార్య గనగళ్ల నీలవేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాము తెలిపారు.
మత్స్యకారుడు తోటయ్య మృతిపై మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విచారం వ్యక్తం చేశారు. మత్స్యకారుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు. భవిష్యత్‌లో మత్స్యకారులు ఇటువంటి ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు.