ఉత్తమ గురువులు
ABN , Publish Date - Sep 04 , 2025 | 12:16 AM
రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు జిల్లాకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు.
- రాష్ట్రస్థాయి అవార్డుకు జిల్లానుంచి ముగ్గురు మహిళా టీచర్ల ఎంపిక
శ్రీకాకుళం/జి.సిగడాం/మెళియాపుట్టి, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు జిల్లాకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. శ్రీకాకుళం నగరంలోని అంధవరపు వరం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో హిందీ పండితురాలుగా పనిచేస్తున్న తిమ్మరాజు నీరజ, జి.సిగడాం మండలం పున్నాం పంచాయతీ బూటుపేట ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కురమాన అరుణకుమారి, మెళియాపుట్టి మండలం నేలబొంతు గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బూరవల్లి విజయభారతి ఎంపికయ్యారు. ఈ నెల 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విజయవాడలో నిర్వహించనున్న కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చేతుల మీదుగా వీరు అవార్డులను అందుకోనున్నారు.
-తిమ్మరాజు నీరజ 2002-డీఎస్సీకి ఎంపికై ప్రియాగ్రహారం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయినిగా చేరారు. 2007లో టీపీఎం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో తన పోస్టును మెర్జింగ్ చేసుకొని హిందీ పండిట్‌గా విధులు నిర్వహించారు. ఈ ఏడాది జూన్‌లో జరిగిన బదిలీల్లో భాగంగా అంధవరపు వరం ఉన్నత పాఠశాలకు వచ్చారు.
-బూరవల్లి విజయభారతి 2021లో సైన్స్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరారు. 9వ తరగతి భౌతిక శాస్త్రం టెస్ట్ బుక్‌లో ఎన్నో పాఠ్యాంశాలు రాశారు. ఉపాధ్యాయుల శిక్షణకు అవసరమైన పాఠ్యాంశాలు సైతం తయారీ చేసి అందించారు. నేషనల్ డిజార్టీబుల్ మేనేజ్‌మెంట్ శిక్షణ తీసుకున్నారు. ఈమె తండ్రి బూరవల్లి త్రినాథరావు డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. భర్త వెంకటేశ్వరరావు విశాఖలోని ఓ ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్నారు.
- రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక కావడం ఆనందంగా ఉందని బూటుపేట పాఠశాల హెచ్‌ఎం కురమాన అరుణకుమారి తెలిపారు. ఆమెకు ఎంఈవోలు అరసాడ రవి, మొండి శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.