వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతి చెందిందని..
ABN , Publish Date - Sep 26 , 2025 | 12:08 AM
మండలంలోని స్కాట్‌పేట గ్రామానికి చెందిన తొగరాపు లోచన(21) అనే బాలింత శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది.
- అలికాం-బత్తిలి రోడ్డుపై గ్రామస్థుల బైఠాయింపు
- ట్రాఫిక్‌కు అంతరాయం
ఎల్.ఎన్.పేట, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): మండలంలోని స్కాట్‌పేట గ్రామానికి చెందిన తొగరాపు లోచన(21) అనే బాలింత శ్రీకాకుళం రిమ్స్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం... లోచనను రెండో కాన్పు కోసం ఈ నెల 22న శ్రీకాకుళం రిమ్స్‌లో చేర్పించారు. ఆమె పరిస్థితి అప్పటికే ఇబ్బందికరంగా ఉంది. సాధారణ కాన్పు అవుతుందని చెబుతూ వైద్యులు, సిబ్బంది మంగళవారం వరకు నిరీక్షించారని కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం లోచన పరిస్థితి మరింత విషమించడంతో వైద్యాధికారులు వెంటనే ఆపరేషన్ చేసి ప్రసవం చేయించారు. ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చింది. బుధవారం నాటికి లోచన పరిస్థితి తీవ్రంగా విషమించటంతో రిమ్స్ వైద్యులు చేతులెత్తేశారు. అప్పటికప్పుడు విశాఖపట్నం కేజీహెచ్‌కు రిఫర్ చేశారని కుటుంబసభ్యులు తెలిపారు. దీంతో కేజీహెచ్‌కు తరలించి.. పరీక్షలు చేసేటప్పటికే లోచన మృతిచెందిందని అక్కడి వైద్యులు నిర్ధారించారు. దీంతో బుధవారం రాత్రి మృతదేహాన్ని స్వగ్రామం స్కాట్‌పేటకు తీసుకు వచ్చారు. రిమ్స్ వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే బాలింత లోచన మృతి చెందిందని కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్థులు ఆరోపిస్తూ గురువారం ఉదయం అలికాం-బత్తిలి ప్రధాన రోడ్డుపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. విషయం తెలుసుకున్న సుబుజ్జిలి ఎస్‌ఐ బి.హైమావతి సిబ్బందితో కలసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించవద్దని మృతురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్థులను కోరారు. లోచన మృతికి వైద్యుల నిర్లక్ష్యం కారణమైతే పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో వారు ఆందోళనను విరమించారు. మృతురాలికి భర్త ఉదయ్‌కుమార్, రెండేళ్ల కుమారుడు ఉన్నారు.