Share News

Ration rice : ఆ బియ్యం.. హాంఫట్‌!

ABN , Publish Date - Jul 19 , 2025 | 11:26 PM

Rice not reaching depots properly from warehouses గోదాముల నుంచి డిపోలకు సరఫరా చేసే రేషన్‌ బియ్యం బస్తాల్లో తరుగు వస్తోందని డీలర్లు ఆరోపిస్తున్నారు. గోనెసంచె బరువు సుమారు 580 గ్రాములు ఉంటుంది. దీనికి సంబంధించి అదనంగా బియ్యం రావాల్సింది పోయి.. 50 కిలోల బస్తాకు సుమారు రెండు నుంచి మూడు కేజీల బియ్యం తరుగు వస్తోందని, ఆ భారం తమపై పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Ration rice : ఆ బియ్యం.. హాంఫట్‌!
మెళియాపుట్టిలో ఎంఎల్‌సీ పాయింట్‌లో బియ్యం నిల్వలు, 50 కిలోల బస్తాకు 47.420 కిలోలు వచ్చిన బియ్యం

  • గోదాముల నుంచి డిపోలకు సక్రమంగా చేరని వైనం

  • 50 కేజీల బస్తాకు సుమారు 3 కిలోల తరుగు

  • ఆ భారం తమపై పడుతోందని డీలర్ల ఆవేదన

  • సరిహద్దు మిల్లులో నిల్వ చేస్తున్నారని ఆరోపణ

  • మెళియాపుట్టి పౌరసరఫరాల గోదాము నుంచి మెళియాపుట్టి, పాతపట్నం మండలాల్లో 94 రేషన్‌ డిపోలకు ప్రతీ నెల 6వేల క్వింటాళ్ల బియ్యాన్ని తరలిస్తారు. కాగా క్వింటాకు నాలుగు కిలోల బియ్యం తరుగు వస్తున్నాయని డీలర్లు ఆందోళన చెందుతున్నారు. 50 కిలోల బస్తాకు 47 నుంచి 48 కిలోల మధ్య మాత్రమే బియ్యం ఉంటున్నాయని వాపోతున్నారు. గత నెలలో మెళియాపుట్టి మండలానికి చెందిన కొంతమంది డీలర్లు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ వద్ద ఆందోళన చేశారు. డీటీ ప్రసాదరావు వారికి సర్దిచెప్పారు. కానీ ఆ తరుగు సంగతి మాత్రం తేలలేదు.

    .....................

  • మెళియాపుట్టి, జూలై 19(ఆంధ్రజ్యోతి): గోదాముల నుంచి డిపోలకు సరఫరా చేసే రేషన్‌ బియ్యం బస్తాల్లో తరుగు వస్తోందని డీలర్లు ఆరోపిస్తున్నారు. రాష్ట్రప్రభుత్వం ఈ నెల నుంచి రేషన్‌ దుకాణాల ద్వారా లబ్ధిదారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తోంది. ప్రతీ నెల పౌరసరఫరాల గోదాముల నుంచి ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌కు బియ్యం తరలిస్తారు. అక్కడి నుంచి రేషన్‌ డిపోలకు బియ్యం రవాణా చేస్తారు. వాటిని డీలర్లు కార్డుదారులకు పంపిణీ చేస్తారు. కాగా.. ఎక్కడ ఏమి జరుగుతుందో తెలియదు కానీ, ప్రతీ నెలా రేషన్‌ డీలర్లు వద్దకు వచ్చేసరికి 50 కిలోల బస్తాకు సుమారు రెండు నుంచి మూడు కేజీల బియ్యం తరుగువస్తోంది. గోనెసంచె బరువు సుమారు 580 గ్రాములు ఉంటుంది. దీనికి సంబంధించి అదనంగా బియ్యం రావాల్సింది పోయి తరుగు వస్తోందని, ఆ భారం తమపై పడుతోందని రేషన్‌ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా, తమ సమస్యకు పరిష్కారం చూపడం లేదని వాపోతున్నారు.

  • ఇదీ పరిస్థితి

  • జిల్లాలో 1,625 రేషన్‌ డిపోల పరిధిలో 6,35,471 రేషన్‌కార్డులు ఉన్నాయి. 18,80,952 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ప్రభుత్వం డిపోల ద్వారా ప్రతీ నెలా 5 కిలోల బియ్యం చొప్పున 94,04,760 కిలోలు పంపిణీ చేస్తోంది. కాగా, క్వింటాకు 5 నుంచి 8 కిలోల బియ్యం తగ్గుతున్నాయని, అవి ఎక్కడికి వెళ్తున్నాయో అర్థంకాని పరిస్థితి నెలకొంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో రేషన్‌ బియ్యం పక్కదారి పట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం పౌరసరఫరాలశాఖ ప్రక్షాళనకు చర్యలు చేపట్టింది. గతంలో ఉన్న ఎండీయూ వాహనాల ద్వారా రేషన్‌ పంపిణీ నిలిపివేసింది. ఈ నెల నుంచి డిపోల్లో డీలర్ల ద్వారా రేషన్‌ బియ్యం పంపిణీ చేస్తోంది. అయినప్పటికీ కొంతమంది అధికారుల తీరు మారడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

  • తూకం వేయకుండానే..

  • ప్రతీ మండలస్థాయిలోని ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లో ఎలకా్ట్రనిక్‌ వేయింగ్‌ యంత్రాలున్నాయి. వేబ్రిడ్జిలు ఏర్పాటు చేశారు. ఎలకా్ట్రనిక్‌ వేయింగ్‌ యంత్రాల్లో తూకం వేసి రేషన్‌ డిపోలకు వెళ్లే ట్రాక్టర్లలో లోడింగ్‌ చేయాలి. కానీ కొన్నిచోట్ల తూకం వేయకుండానే బస్తాలు లోడింగ్‌ చేసి డిపోలకు తరలిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ బియ్యం డిపోలకు చేరి తూకం వేయగా తరుగు కనిపిస్తోందని డీలర్లు పేర్కొంటున్నారు. దీనిపై అడిగితే.. రేషన్‌ కోటా మేరకే వేబ్రిడ్జిపై తూకం చూపి రశీదు ఇస్తామని సిబ్బంది చెబుతున్నట్టు సమాచారం.

  • తనిఖీలు లేకనే..

  • కూటమి అధికారంలోకి వచ్చిన కొత్త పౌరసరఫరాల గోదములును విజిలెన్స్‌ అధికారులు తనిఖీ చేశారు. కాటాలు, స్టాక్‌ను పరిశీలించారు. గత ఆరు నెలల నుంచి పెద్దగా తనిఖీలు లేకపోవడంతో మళ్లీ గోదాముల్లో అవినీతి జరుగుతోందన్న విమర్శలు ఉన్నాయి. సీఎస్‌డీటీలు, ఆర్‌ఐ స్థాయి అధికారులు ఇన్‌చార్జిలుగా గోదాములను సక్రమంగా పర్యవేక్షించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కొంతమంది కళాసీలకు ఆ బాధ్యత అప్పగించడంతో అక్కడ ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. తరుగు వస్తున్న బియ్యం పక్కదారి పడుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు మిల్లుల్లో నిల్వ చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల కొత్తూరు మండలం కడుమ రైస్‌మిల్లు నుంచి 700 బస్తాల బియ్యం ఒడిశా తరలిస్తుండగా పార్వతీపురం మన్యం జిల్లాలో విజిలెన్స్‌ అధికారులకు పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది.

  • చర్యలు తీసుకుంటాం

    ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ను తనిఖీ చేసి వచ్చే నెల నుంచి జాగ్రత్తలు తీసుకుంటాం. డిపోల డీలర్లు దగ్గర ఉండి బియ్యం తూకం వేయించి తీసుకోవాలి. తూకం లేకుండా బియ్యం ఇస్తే గోదాం ఇన్‌చార్జిపై చర్యలు తీసుకుంటాం.

    - బి.పాపారావు, తహసీల్దార్‌, మెళియాపుట్టి

Updated Date - Jul 19 , 2025 | 11:26 PM