Share News

ఆ కష్టమూ మహిళలకే...

ABN , Publish Date - Nov 15 , 2025 | 11:58 PM

Men shy away from family planning surgeries జిల్లాలో పురుషులు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయించుకునేందుకు ముందుకు రావడం లేదని అర్థమవుతోంది. పురుషులకు చేసే కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సను వాసెక్టమీగా... స్త్రీలకు చేసే కు.ని.శస్త్ర చికిత్సను ట్యూబెక్టమీగా పిలుస్తారు. కు.ని.శస్త్ర చికిత్సను భార్యాభర్తల్లో ఒకరు చేయించుకుంటే సరిపోతుంది. వైద్యశాఖ గణాంకాలను బట్టి చూస్తే ఈ శస్త్ర చికిత్సలను మహిళలు మాత్రమే చేసుకోవాలన్న విధంగా పురుషుల తీరు ఉంటోంది.

ఆ కష్టమూ మహిళలకే...

  • కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలకు పురుషులు దూరం

  • నేడు ప్రపంచ వాసెక్టమీ దినం

  • శ్రీకాకుళం, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి):

  • శ్రీకాకుళం జిల్లాలో 2023-24 సంవత్సరంలో 11 మంది పురుషులు మాత్రమే వాసెక్టమీ చేయించుకున్నారు.

  • 2024-25లో ఒక్కరు మాత్రమే వాసెక్టమీ చేయించుకున్నారు.

  • ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు ఒక్కరూ వాసెక్టమీ చేయించుకోలేదు.

  • ...ఇదీ జిల్లాలో పురుషులకు సంబంధించి కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సల లెక్క. దీనికి భిన్నంగా ట్యూబెక్టమీ శస్త్ర చికిత్సలు చేయించుకుంటున్న మహిళల సంఖ్య ఏటా వేలల్లో ఉంటోంది. ఈ గణాంకాలను బట్టి చూస్తే పురుషులు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయించుకునేందుకు ముందుకు రావడం లేదని అర్థమవుతోంది. పురుషులకు చేసే కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సను వాసెక్టమీగా... స్త్రీలకు చేసే కు.ని.శస్త్ర చికిత్సను ట్యూబెక్టమీగా పిలుస్తారు. కు.ని.శస్త్ర చికిత్సను భార్యాభర్తల్లో ఒకరు చేయించుకుంటే సరిపోతుంది. వైద్యశాఖ గణాంకాలను బట్టి చూస్తే ఈ శస్త్ర చికిత్సలను మహిళలు మాత్రమే చేసుకోవాలన్న విధంగా పురుషుల తీరు ఉంటోంది. ప్రస్తుతం అత్యధిక శాతం మహిళలకు శస్త్ర చికిత్సల ద్వారా ప్రసవాలు చేయిస్తున్నారు. ఇది దీర్ఘకాలంలో వారి ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందని వైద్యులు చెబుతున్నారు. దీనికి తోడు కు.ని.శస్త్ర చికిత్సలనూ మహిళలే చేయించుకోవాల్సి వస్తోంది.

  • చిన్న శస్త్ర చికిత్స...

  • సంతానోత్పత్తిని నివారించడానికి పురుషులకు చేసే గర్భ నిరోధక శస్త్ర చికిత్స వాసెక్టమీ. ఇది చిన్న శస్త్ర చికిత్స. పురుషులు మేల్కొని ఉన్నపుడే ఈ ప్రక్రియ జరుగుతుంది. కేవలం శస్త్ర చికిత్స చేసే ప్రాంతంలో మాత్రమే మత్తు ఇస్తారు. పావు గంట వ్యవధిలో వైద్యులు దీన్ని పూర్తి చేసేస్తారు. పిల్లలు కావాలనుకునేవారు దీన్ని మరలా తెరవవచ్చు. కొన్నిసార్లు సాధ్యం కాకపోవచ్చు. అందుకే పిల్లలు వద్దనుకున్నప్పుడే దీన్ని పాటిస్తే మంచిది. చాలా సులువుగా చేసే ఈ చిన్నపాటి శస్త్ర చికిత్సను వద్దనుకునే పురుషులే ఎక్కువ. వివిధ రకాల అనుమానాలు, అపోహలు, భయాలే ఈ శస్త్ర చికిత్సలకు పురుషులు దూరంగా ఉండడానికి కారణం. వైద్యులు ఎంతగా అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నా...పురుషుల్లో అనుమానాలు తొలగిపోవడం లేదు. వాసెక్టమీ చేసుకున్న పురుషులు ఒక రోజులో కొలుకుంటారు. వెంటనే పనులకు వెళ్లవచ్చు. అదే ట్యూబెక్టమీ అయితే మహిళల పొట్ట కోసి...శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుంది. దీని వల్ల వారు కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. కొన్ని రోజుల వరకు పనులు చేసేందుకు అవకాశం ఉండదు. ఒక్కోసారి పొట్టలో ఇన్‌ఫెక్షన్‌ సోకే ప్రమాదమూ ఉంది. వాసెక్టమీకి ఇతర ఇబ్బందులు ఉండవు. కానీ ఈ శస్త్ర చికిత్స చేసుకున్న పురుషుల శరీరంలో శక్తి ఉండదని... బరువు పనులు చేయలేరని... లైంగిక సామర్థ్యం తగ్గుతుందనే అపోహలు ఉన్నాయి. అత్యధిక కుటుంబాలు పురుషుల సంపాదనపై ఆధారపడినవే. ఇది కూడా వాసెక్టమీల సంఖ్య తగ్గడానికి ఓ కారణంగా చెబుతున్నారు.

  • పట్టు సడలించిన వైద్యశాఖ

  • గత నాలుగైదు సంవత్సరాలుగా వైద్య ఆరోగ్య శాఖ కుటుంబ నియంత్రణను పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ ఆలోచన తీరు మారడమే దీనికి కారణం. ప్రస్తుత ప్రభుత్వం జనాభా పెరుగుదలపై దృష్టి సారించింది. దేశ ప్రయోజనాల దృష్ట్యా అధిక జనాభా అవసరాన్ని గుర్తించిన పాలకులు... ఎక్కువ మంది పిల్లలకు జన్మనివ్వాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు. కానీ పరిమిత కుటుంబ ప్రయోజనాలను ప్రజలు గుర్తించారు. దీంతో ఒకరు లేక ఇద్దరు పిల్లలతో సరిపెడుతున్నారు. ఒకప్పుడు కు.ని. శస్త్ర చికిత్సలకు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ క్షేత్ర స్థాయిలో పని చేసే సిబ్బందికి లక్ష్యాలు విధించేది. ప్రస్తుతం ప్రజలే ఎవరికి వారుగా ఈ శస్త్ర చికిత్సలకు ముందుకు వస్తున్నారు. అందులోనూ మహిళలే ముందుంటున్నారు. అనేక మంది ప్రైవేటు ఆసుపత్రుల్లో డబ్బులు ఇచ్చి చికిత్సలు చేయించుకుంటున్నారు. పురుషులు కుటుంబ నియంత్రణ చికిత్సలపై అపోహలు వీడాలని వైద్యులు సూచిస్తున్నారు. వాసెక్టమీ శస్త్ర చికిత్స చాలా సులభమైనది. ఎటువంటి కుట్టు, కోత ఉండదు. సైకిల్‌ తొక్కడం, బండ్లు లాగడం, వాహనాలను నడపడం, బరువులు ఎత్తడం వంటి పనులన్నీ చేయొచ్చని వైద్యులు చెబుతున్నారు.

Updated Date - Nov 15 , 2025 | 11:58 PM