ఆ విలయం.. ప్రళయం
ABN , Publish Date - Oct 10 , 2025 | 11:39 PM
Seven years since the destruction of 'Tithali' ‘తితలీ’ పేరు చెబితే చాలు.. ఉద్దానం ప్రజల్లో అలజడి రేగుతోంది. 2018 అక్టోబరు 11న ఉద్దానం ప్రాంతంలో తితలీ తుఫాన్ విధ్వంసం సృష్టించింది. ఈ ప్రళయం వచ్చి నేటికి ఏడేళ్లు పూర్తవుతున్నా.. ఇంకా తితలీ నష్టం ప్రజల కళ్లముందే కనిపిస్తోంది.
‘తితలీ’ విధ్వంసానికి ఏడేళ్లు
అప్పట్లో ఉద్దానం ప్రాంతానికి తీరని నష్టం
నేటికీ పూర్తిస్థాయిలో కోలుకోని వైనం
పలాస, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): ‘తితలీ’ పేరు చెబితే చాలు.. ఉద్దానం ప్రజల్లో అలజడి రేగుతోంది. 2018 అక్టోబరు 11న ఉద్దానం ప్రాంతంలో తితలీ తుఫాన్ విధ్వంసం సృష్టించింది. ఈ ప్రళయం వచ్చి నేటికి ఏడేళ్లు పూర్తవుతున్నా.. ఇంకా తితలీ నష్టం ప్రజల కళ్లముందే కనిపిస్తోంది. ఆ రోజు నిశిరాత్రి వేళ.. అంతా గాఢ నిద్రలో ఉండగా రాత్రి 2గంటల తరువాత విలయం.. ప్రళయమైంది. ఒకటి కాదు, రెండు కాదు ఏడుగంటల పాటు పెనుగాలులు, భారీ వర్షంతో ధ్వంసం చేసింది. వజ్రపుకొత్తూరు మండలంలో పల్లిసారథి వద్ద తుఫాన్ తీరం దాటగా.. 70-160 కిలోమీటర్ల వాయువేగంతో ఈదురుగాలులు వీచాయి. దీంతో తీరప్రాంతం అతలాకుతలమైంది. ఉద్దానంలో పచ్చని జీడి, మామిడి చెట్లన్నీ నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. పలాస మండలం శాసనంలో గోడ కూలి పది గేదెలు, 20మేకలు, గొర్రెలు మృతి చెందాయి. గ్రామీణ రహదారులతో పాటు జాతీయరహదారిపై కూడా నీరు వరదలై పారింది. మొగిలిపాడు, కాశీబుగ్గ, చినబాడం, అంతరకుడ్డ, పెసరపాడు, పారసాంబ వెళ్లే దారుల్లో రెండు అడుగుల లోతులో నీరు పొంగి ప్రవహించింది. ఈదురుగాలుల ప్రభావానికి మొగిలిపాడు వద్ద ఇనుపలోడుతో వెళ్తున్న మూడు లారీలు.. ఎగిరి బోల్తాపడ్డాయి. కాశీబుగ్గ-పలాసలో ఉన్న ఆరుపెట్రోల్ బంకుల్లో పైకప్పులు గాలికి 500మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి. జంటపట్టణాల్లో హోర్డింగ్‌లన్నీ నామరూపాల్లేకుండా నేలరాలాయి. రోడ్డుపైన భారీ చెట్లు నేలకొరగడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. మరో పక్క విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో ప్రజలు మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పల్లిసారథిలో తుఫాన్ తీరం దాటిన సమయంలో వీచిన గాలులకు వర్షానికి ప్రజలు అల్లాడిపోయారు.
తితలీ తుఫాన్ కారణంగా 16వేల ఎకరాల్లో వరి పంట దెబ్బతింది. 45వేల హెక్టార్లల్లో జీడి, కొబ్బరి పంట నేలకొరిగింది. 7వేల విద్యుత్ స్తంభాలు కూలిపోగా, 200కు పైగా విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. ఒక్క విద్యుత్ శాఖకు రూ.50కోట్ల మేరకు నష్టం వాటిల్లినట్లు అంచనా. మొత్తంగా తితలీ తుఫాన్ వల్ల రూ.1500 కోట్ల వరకూ నష్టం వచ్చినట్లు విపత్తుల నివారణ సంస్థ అంచనా వేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. తుఫాను విలయం ముందుగానే గుర్తించిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా పలాస చేరుకొని ఐదు రోజుల్లో విద్యుత్ ఇప్పించారు. తాగునీరు తక్షణమే పునరుద్ధరించారు. బాధితులకు నష్టపరిహారం అందించారు.
ధ్వంసమైన రైల్వే వ్యవస్థ:
సముద్రతీరానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న పలాస-కాశీబుగ్గ జంట పట్టణాలకు అప్పట్లో తీవ్ర నష్టం వాటిల్లింది. తితలీ తుఫాన్ ప్రభావంతో పలాస రైల్వేస్టేషన్ అంతా సర్వనాశనమైంది. మొత్తం 4 ప్లాట్‌ఫారాల్లో ఉన్న రూఫ్‌లన్నీ గాలికి ఎగిరిపోయాయి. స్టేషన్ మేనేజర్ రైళ్లను కంట్రోల్ చేసే ప్యానల్ సెక్షన్ మొత్తం ధ్వంసమైపోయింది. నిత్యం ప్రయాణికులతో కళకళలాడే ఈ స్టేషన్‌లో సుమారు 15 రోజులపాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. పచ్చతోరణంగా ఉండే పలాస రైల్వేకాలనీలో ఐదువేలకు పైగా చెట్లు ధ్వంసమయ్యాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. రేకు గృహాలన్నీ నేలమట్టమయ్యాయి. దీంతో రైల్వే ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ గడిపారు.
జీడిపరిశ్రమలకు అపార నష్టం
తితిలీ విలయతాండంతో పలాస-కాశీబుగ్గలో జీడిపరిశ్రమలు రూ.150కోట్లకు పైగా నష్టానికి గురైనట్లు అంచనా. వందకుపైగా పరిశ్రమల రేకు షెడ్లు ఎగిరి ముడిసరుకంతా తడిసిపోయింది. మొగిలిపాడు ప్రాంతంలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఒక్కో జీడిపరిశ్రమకు రూ.50లక్షల నుంచి రూ.కోటి వరకూ నష్టం వచ్చినట్లు వ్యాపారుల అంచనా. ఇప్పటికీ తితలీ తుఫాన్ నష్టం నుంచి కోలుకోలేని వ్యాపారులు అనేకమంది ఉన్నారు. జీడి, కొబ్బరి చెట్లు అనేకం నేలమట్టం కావడంతో 20ఏళ్ల అభివృద్ధి వెనక్కి మరలిపోయామని రైతులు ఆవేదన చెందుతున్నారు. నేటికీ కోలుకోలేకపోతున్నామని వాపోతున్నారు.