10 నుంచి టెట్
ABN , Publish Date - Dec 06 , 2025 | 12:00 AM
Arrangements for TET at three centers ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఈ నెల 10 నుంచి 21 వరకు నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాలో 12,185 మంది అభ్యర్థులు టెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల నిర్వహణ కోసం విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
జిల్లాలో మూడు కేంద్రాల్లో నిర్వహణకు ఏర్పాట్లు
12,185 మంది అభ్యర్థుల దరఖాస్తులు
స్కోర్ కోసం సర్వీసు ఉపాధ్యాయులు కూడా పరీక్షకు సన్నద్ధం
నరసన్నపేట, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఈ నెల 10 నుంచి 21 వరకు నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాలో 12,185 మంది అభ్యర్థులు టెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల నిర్వహణ కోసం విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నరసన్నపేటలోని కోర్ టెక్నాలజీ, ఎచ్చెర్లలోని శ్రీ శివానీ, శ్రీవెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలను పరీక్ష కేంద్రాలుగా కేటాయించారు. పరీక్ష కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతను నరసన్నపేట, ఎచ్చెర్ల, లావేరు విద్యాశాఖ అధికారులకు అప్పగించారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇన్ సర్వీసు ఉపాధ్యాయులు కూడా టెట్‌కు తప్పనిసరిగా మూడేళ్లలో ఉత్తీర్ణత సాధించాల్సిందేనని ప్రభుత్వం మార్గదర్శికాలు జారీ చేసింది. 2009 డీఎస్సీ ముందు ఉపాధ్యాయులుగా విధుల్లో చేరిన వారు సుమారు 9వేలమందికిపైగా ఉన్నారు. వీరిలో కేవలం 10శాతం మేరకు ఉపాధ్యాయులు టెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి కొంతమంది ఉపాధ్యాయులు విజ్ఞప్తి చేశారు. కొన్ని రాష్ట్రాల్లో సర్వీసు ఉపాధ్యాయులు కూడా టెట్ నుంచి మినహాయింపు కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేంద్ర ప్రభుత్వం, న్యాయస్థానం అనుకూలంగా స్పందిస్తుందనే ఆశతో ఇన్‌సర్వీసు ఉపాధ్యాయులు తక్కువ మంది మాత్రమే టెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీలో టెట్‌లో తక్కువ మార్కులు వచ్చి ఎందరో అభ్యర్థులు ఉపాధ్యాయ పోస్టులకు దూరమయ్యారు. అటువంటివారు మళ్లీ టెట్ రాసి ఎక్కువ మార్కులు సాధించేందుకు కృషి చేస్తున్నారు. వారితోపాటు ఇటీవల రిలీవైన బీఈడీ, డైట్ విద్యార్థులు కూడా టెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు.