Share News

సర్వీసు ఉపాధ్యాయులకు టెట్‌

ABN , Publish Date - Oct 25 , 2025 | 12:13 AM

December 10th TET సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్‌ నిర్వహణకు విద్యాశాఖ శుక్రవారం షెడ్యూల్‌ జారీ చేసింది. నవంబరు 23 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. డిసెంబరు 10 నుంచి ఉపాధ్యాయ అర్హత పరీక్షలు(టెట్‌) నిర్వహించనుంది.

సర్వీసు ఉపాధ్యాయులకు టెట్‌

నోటిఫికేషన్‌ జారీ చేసిన విద్యాశాఖ

డిసెంబరు 10 నుంచి పరీక్షలు

సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయాలని ఉపాధ్యాయుల డిమాండ్‌

నరసన్నపేట, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్‌ నిర్వహణకు విద్యాశాఖ శుక్రవారం షెడ్యూల్‌ జారీ చేసింది. నవంబరు 23 వరకు దరఖాస్తులు స్వీకరించనుంది. డిసెంబరు 10 నుంచి ఉపాధ్యాయ అర్హత పరీక్షలు(టెట్‌) నిర్వహించనుంది. 2011 నుంచి టెట్‌ అమల్లోకి వచ్చింది. అంతకుముందు ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు కచ్చితంగా టెట్‌ ఉత్తీర్ణత సాధించాలని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ టెట్‌ నిర్వహణకు షెడ్యూల్‌ జారీ చేసింది. అయితే ఆర్‌టీఈ 2009 చట్టం.. 2010 ఏప్రిల్‌ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వచ్చిందని, 2010 ఏడాది ముందు నియామకపు ఉత్తర్వులు పొందిన ఉపాధ్యాయలకు ఈ చట్టం వర్తింపజేయడం సబబు కాదని ఉపాధ్యాయవర్గాలు గగ్గోలు చెందుతున్నాయి.

మార్గదర్శకాలు ఇలా..

టెట్‌ నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ అధికారులు మార్గదర్శకాలు జారీచేశారు. టెట్‌ రాసేందుకు సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు 2011కు ముందు ఇంటర్‌, డిగ్రీ పూర్తిచేసిన వారికి ఓసీలైతే 45శాతం, ఎస్సీ,ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 40శాతం మార్కులు ఉండాలి. బీఈడీ, డీఈడీలో అయితే టెట్‌ రాసేందుకు ఎటువంటి అర్హత మార్కులు లేవని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. ఫీజు చెల్లింపు, దరఖాస్తుకు నవంబరు 23 వరకు అవకాశం ఇచ్చారు. జిల్లాలో వివిధ మేనేజ్‌మెంట్‌ పాఠశాలలో 14,300 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వీరిలో సుమారు 9,800 మంది ఉపాధ్యాయులు 2011 ముందే నియమాకమయ్యారు. ప్రభుత్వ మార్గదర్శికాలు అనుగుణంగా వీరంతా టెట్‌ రాయాల్సి ఉంది.

150 మార్కులకు రెండున్నర గంటల వ్యవధితో ఉండే ఈ పరీక్షలో అర్హత పొందాలంటే ఓసీ కేటగిరీ వారు 90మార్కులు (60శాతం) బీసీలు 75మార్కులు(50శాతం) ఎస్సీ/ఎస్టీ/ దివ్యాంగులు 60మార్కులు (40శాతం) సాధించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఇంత తక్కువ సమయంలో నోటిఫికేషన్‌ జారీ చేయడంపై కొందరు ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు పాఠాలు బోధించి.. టెట్‌కు ఎలా సిద్ధమయ్యేదని తలలు పట్టుకుంటున్నారు. దీనిపై విద్యాశాఖ అధికారులు పునరాలోచించాలని కోరుతున్నారు.

నిర్ణయం సరికాదు..

సర్వీస్‌లో ఉన్న సీనియర్‌ ఉపాధ్యాయులకు టెట్‌ తప్పనిసరి అనే విషయాన్ని యూటీఎఫ్‌ నాయకులు ఖండించారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యాయులు ఉద్యోగంలో రావడానికి అవసరమైన విద్యార్హతలు కలిగి, పోటీపరీక్షల్లో విజయంసాధించి నియామకం పొందారని యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.శ్రీరామమూర్తి అన్నారు. పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ,కేరళ ప్రభుత్వాలు ఇప్పటికే సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్‌ దాఖలు చేశాయని, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ దిశగా చొరవ చూపాలని డిమాండ్‌ చేశారు. ‘సీనియర్‌ ఉపాధ్యాయులకు మళ్లీ పరీక్షల పేరుతో మానసిక ఆందోళనకు గురిచేయడం తగదు. సమయాన్ని వృఽథా చేయడం.. బోధనా సమయాన్ని తగ్గించడం తప్ప మరే ప్రయోజనం ఉండద’ని యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షులు లండ బాబురావు, ప్రధాన కార్యదర్శి బి.శ్రీరామమూర్తి పేర్కొన్నారు.

Updated Date - Oct 25 , 2025 | 12:13 AM