Share News

ఎందుకో.. ఆ మౌనం?

ABN , Publish Date - Jul 01 , 2025 | 12:28 AM

కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం (కేజీబీవీ), ఆదర్శ పాఠశాలల్లోని వసతిగృహాలకు కూరగాయలు, నిత్యావసర సరుకుల పంపిణీకి సంబంధించి టెండర్ల ఖరారు జాప్యమవుతోంది.

ఎందుకో.. ఆ మౌనం?

  • కేజీబీవీ, ఆదర్శ పాఠశాలల్లో సరుకుల పంపిణీకి ఖరారుకాని టెండర్లు

  • గతేడాది కిలో కూరగాయలు రూపాయికే ఆమోదం

  • ఈ ఏడాది మాత్రం రెండు నెలలుగా జాప్యం

  • స్థానిక కాంట్రాక్టర్లకు లబ్ధి కల్పిస్తున్న అధికారులు

శ్రీకాకుళం, జూన్‌ 30(ఆంధ్రజ్యోతి): కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయం (కేజీబీవీ), ఆదర్శ పాఠశాలల్లోని వసతిగృహాలకు కూరగాయలు, నిత్యావసర సరుకుల పంపిణీకి సంబంధించి టెండర్ల ఖరారు జాప్యమవుతోంది. గతేడాది ప్రత్యేక శ్రద్ధ చూపిన అధికారులు, ఈ ఏడాది మాత్రం టెండర్లు పిలిచి సుమారు రెండు నెలలు కావస్తున్నా, ఖరారు చేయకుండా మౌనం వహించడం అనుమానాలకు తావిస్తోంది. ఉద్దేశపూర్వకంగానే కొంతమంది అధికారులు తాత్కాలికంగా సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో కొంతమంది అధికారులు కూడా సొంతలాభం చూసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

అప్పుడు అలా... ఇప్పుడు ఇలా..

జిల్లాలోని 25 కేజీబీవీ హాస్టళ్లు, 13 మోడల్‌ స్కూళ్లు ఉన్నాయి. వీటిలో సుమారు 8వేల మంది విద్యార్థులు ఉన్నారు. వీరందరికీ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో భోజనం కల్పించాలి. ఈ మేరకు అవసరమైన కూరగాయలు, నిత్యావసరాలు పంపిణీకి గతేడాది టెండర్లు పిలిచారు. ధరల్లో ప్రజలు నివ్వెరపోయేలా సుమారు 22 రకాల కూరగాయలను.. ఒక్కో కిలో రూపాయికి చొప్పున సరఫరా చేస్తామని ఓ వెండర్‌.. టెండర్‌ వేశారు. అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపి ఖరారు చేసేశారు. రూపాయికి కిలో కూరగాయలను నాణ్యమైనవి ఏవిధంగా సరఫరా చేస్తారన్న ఆలోచన కూడా లేకపోయింది అధికారులకు. దీనిపై విమర్శలు రావడంతో 2024-2025 విద్యా సంవత్సరం ముగిసే కొద్దిరోజుల ముందు ఆ వెండర్‌ను రద్దు చేశారు. టెండరుదారున్ని మార్పించారు.

ఈ ఏడాది (2025-2026 విద్యా సంవత్సరానికి సంబంధించి) ఏప్రిల్‌ 30న కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలలకు నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ కోసం టెండర్లు ఆహ్వానించారు. మే 5 వరకు టెండర్లను స్వీకరించారు. జూన్‌ 12న ప్రభుత్వ పాఠశాలలు తెరుచుకున్నాయి. వసతిగృహాల్లో కూడా విద్యార్థులు చేరిపోయారు. కానీ టెండర్లను స్వీకరించినా.. ఇంతవరకు ఖరారు కాలేదు. దీంతో స్థానికంగా కూరగాయలు, నిత్యావసరాలను సరఫరా చేస్తున్న కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరుతోంది. కేజీబీవీలు, మోడల్‌ స్కూళ్లకు ఎక్కడికక్కడే వ్యాపారులను తాత్కాలికంగా నియమించుకుని.. వారి ద్వారా కొన్ని రకాల కూరగాయలనే మాత్రమే తెప్పించుకుని.. విద్యార్థులకు సమృద్ధిగా పెడుతున్నట్లు అధికారులు లెక్కల్లో చూపిస్తున్నారు. వాస్తవ పరిస్థితి మరోలా ఉంది. ప్రస్తుతం కూరగాయలు ఏ విధంగా సరఫరా జరుగుతోంది. ఇతర నిత్యావసరాలు.. సరిగ్గా సరఫరా అవుతున్నాయా అన్నదీ పర్యవేక్షణ లేదు. టెండర్లు ఖరారు కాకపోయినా విద్యార్థులకు తాత్కాలికంగా ఇబ్బందులు లేకుండా ప్రిన్సిపాల్స్‌ నెట్టుకొస్తున్నారన్నది ఉన్నతాధికారుల అభిప్రాయం. కానీ, ఇక్కడే పెద్దతిరకాసు జరుగుతోంది. ధరల నియంత్రణ లేదు. కాంట్రాక్టర్‌ ఇచ్చిన ధరలనే తప్పనిసరిగా ఆమోదిస్తున్నారు. దీనివల్ల కాంట్రాక్టర్లు, అధికారులు పరస్పర లాభపడినవారూ ఉన్నారు. సుమారు 100 మంది టెండర్లు వేశారు. వీళ్లందరూ టెండర్లు ఏరోజున ఖరారు చేస్తారా? అని ఎదురుచూస్తున్నారు.

డీసీఎంఎస్‌కు ఇచ్చేందుకు ప్రణాళిక..

టెండర్ల ద్వారా నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ చేసే బందులు.. ప్రభుత్వ అనుబంధ రంగాలను బలోపేతం చేయాలని సర్కారు భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో వీటి సరఫరా కాంట్రాక్ట్‌ బాధ్యతను డీసీఎంఎస్‌కు అప్పగించే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా జరిగితే కొంత పారదర్శకంగా ఉండే అవకాశముంది. కాగా ఇంతవరకు టెండర్లకు దరఖాస్తులను స్వీకరించి.. అధికారులు ఉద్దేశపూర్వకంగా మౌనం దాల్చడం.. హాస్టళ్లలో భోజనంలో పర్యవేక్షణ లేకపోవడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. సకాలంలో డీసీఎంఎస్‌కు లేదా టెండర్ల ద్వారా వ్యాపారులకు కట్టజెప్పి.. నిధులు గోల్‌మాల్‌ జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. దీనిపై జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు కూడా ప్రత్యేక దృష్టి సారించాలి.

Updated Date - Jul 01 , 2025 | 12:28 AM