Share News

former suside: కౌలు రైతు ఆత్మహత్య

ABN , Publish Date - Apr 10 , 2025 | 11:54 PM

Agricultural crisis కంచిలి మండలం పెద్దకొజ్జిరీయ గ్రామానికి చెందిన కౌలురైతు బల్లెడ నర్సింహమూర్తి(58) బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పులబాధ తాళలేక గ్రామ సమీపంలోని జీడితోటలో పురుగుల మందు తాగి ప్రాణాలు కోల్పోయాడు.

former suside: కౌలు రైతు ఆత్మహత్య
నర్సింహమూర్తి(ఫైల్‌)

  • అప్పులు అధికమై.. బతుకు భారమై..

  • పురుగుల మందు తాగి బలవన్మరణం

  • కంచిలి, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): కంచిలి మండలం పెద్దకొజ్జిరీయ గ్రామానికి చెందిన కౌలురైతు బల్లెడ నర్సింహమూర్తి(58) బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పులబాధ తాళలేక గ్రామ సమీపంలోని జీడితోటలో పురుగుల మందు తాగి ప్రాణాలు కోల్పోయాడు. ఇందుకు సంబంధించి పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెద్దకొజ్జిరీయకు చెందిన నర్సింహమూర్తి తనకు ఉన్న ఎకరా పొలంతోపాటు ఏడు ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. జీడి, మామిడి, కొబ్బరి, వరి పండిస్తున్నారు. నాలుగేళ్లుగా సరైన దిగుబడులు లేక తీవ్ర నష్టాలు వచ్చాయి. ఏటా సాగు పెట్టుబడి కోసం రూ.లక్షల్లో అప్పు చేసిన నర్సింహమూర్తి.. సరైన దిగుబడి లేక వాటిని తీర్చలేకపోయారు. ఈ క్రమంలో వడ్డీలు అధికమై సుమారు రూ.15 లక్షల మేర అప్పు పెరిగిపోయింది. దీంతో అధిక ఒత్తిడికి లోనై.. అప్పుల బాధ తాళలేక తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. బుధవారం ఉదయం 10గంటల సమయంలో తోటకు వెళ్లి వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పిన నర్సింహమూర్తి రాత్రి 6గంటలైనా ఇంటికి రాలేదు. దీంతో భార్య నీలవేణి, కుమారులు శ్రీను, ప్రవీణ్‌ ఆందోళన చెందారు. స్థానికులతో కలిసి నర్సింహమూర్తి ఆచూకీ కోసం వెతికారు. రాత్రి 10.30 గంటల సమయంలో గ్రామసమీపంలోని జీడితోటలో నర్సింహమూర్తి విగతజీవిగా కనిపించడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మృతదేహం పక్కనే పురుగుల మందు డబ్బా కనిపించడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్‌ఐ పి.పారినాయుడు ఘటన స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సోంపేట ఆస్పత్రికి తరలించారు. మృతుడి భార్య నీలవేణి ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తెలిపారు. ఇదిలా ఉండగా నర్సింహమూరి కుమారులిద్దరికీ వివాహమై.. పిల్లలు ఉన్నారు. స్థానికంగా ఉపాధి లేక వీరిద్దరూ మహారాష్ట్ర, గుజరాత్‌ తదితర ప్రాంతాలకు వలస పోయేవారు. ఇటీవల వారు కూడా స్వగ్రామానికి చేరుకుని తండ్రికి వ్యవసాయ పనుల్లో సాయం చేసేవారు. ఇంతలోనే తమ తండ్రి ఆత్మహత్య చేసుకోవడంతో విషాదంలో మునిగిపోయారు. నర్సింహమూర్తి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Updated Date - Apr 10 , 2025 | 11:54 PM