ఆలయాలు మూత
ABN , Publish Date - Sep 08 , 2025 | 12:01 AM
Total lunar eclipse గ్రహణం కారణంగా జిల్లాలోని వివిధ ఆలయాలను ఆదివారం మధ్యాహ్నం నుంచి మూసివేశారు. ఆదివారం రాత్రి 9.56 గంటల నుంచి అర్ధరాత్రి 1.26 గంటల వరకు సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించింది.
సంపూర్ణ చంద్ర గ్రహణం ఎఫెక్ట్
శ్రీకాకుళం కల్చరల్/ అరసవల్లి/ గార/ జలుమూరు, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): గ్రహణం కారణంగా జిల్లాలోని వివిధ ఆలయాలను ఆదివారం మధ్యాహ్నం నుంచి మూసివేశారు. ఆదివారం రాత్రి 9.56 గంటల నుంచి అర్ధరాత్రి 1.26 గంటల వరకు సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించింది. ఈ నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం 2గంటలకు అరసవల్లిలోని శ్రీసూర్యనారాయణస్వామి దేవాలయాన్ని మూసివేశారు. ఆదివారం ఉదయం కాస్త భక్తుల తాకిడి కనిపించింది. మధ్యాహ్నం నుంచి ఆలయ ప్రాంగణం అంతా బోసిపోయింది. ఆలయ సంప్రోక్షణ, శుద్ధి, పుణ్యాహవచనం అనంతరం సోమవారం ఉదయం 7.30 గంటల నుంచి స్వామి దర్శనానికి భక్తులను అనుమతిస్తామని ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ, ఈవో కేఎన్‌వీడీవీ ప్రసాద్ తెలిపారు. గ్రహణానంతరం స్వామిని దర్శించుకుని శుభాలను పొందాలని ఆకాంక్షించారు. అలాగే శ్రీకాకుళంలోని శ్రీ ఉమారుద్రకోటేశ్వర స్వామి దేవాలయాన్ని ఆదివారం మధ్యాహ్నం 12గంటలకు మహాభోగ నివేదన అనంతరం మూసివేశారు. సోమవారం వేకువజామున నాలుగు గంటల నుంచి స్వామి దర్శనం ప్రారంభమవుతుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. కోదండరామాలయం, నారాయణ తిరుమల ఆలయం, భీమేశ్వరాలయం, ఉమాజఠళేశ్వరాలయం, సంతోషిమాత ఆలయం, కళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయాలు కూడా మూసివేశారు. గార మండలం శ్రీకూర్మంలోని శ్రీకూర్మనాథ ఆలయాన్ని మధ్యాహ్నం 3.30 గంటలకు మూసివేశారు. జలుమూరు మండలం శ్రీముఖలింగంలోని మధుకేశ్వరస్వామి ఆలయంతోపాటు భీమేశ్వర, సోమేశ్వరాలయాలు కూడా మూతపడ్డాయి. సంప్రోక్షణ అనంతరం సోమవారం ఉదయం నుంచి ఆలయాల్లోకి భక్తులను అనుమతించనున్నారు.