tekkali : మునిసిపాలిటీగా టెక్కలి!
ABN , Publish Date - May 02 , 2025 | 11:36 PM
Municipality status డివిజన్ కేంద్రమైన టెక్కలి మేజర్ పంచాయతీ మునిసిపాలిటీగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు టెక్కలిని జిల్లాకేంద్రానికి ధీటుగా అభివృద్ధి చేస్తానని పలుమార్లు ప్రకటించారు.
తెరపైకి మళ్లీ ప్రతిపాదనలు
టెక్కలి, మే 2(ఆంధ్రజ్యోతి): డివిజన్ కేంద్రమైన టెక్కలి మేజర్ పంచాయతీ మునిసిపాలిటీగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు టెక్కలిని జిల్లాకేంద్రానికి ధీటుగా అభివృద్ధి చేస్తానని పలుమార్లు ప్రకటించారు. టెక్కలిని మునిసిపాలిటీగా చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఇటీవల మరోసారి స్పష్టం చేశారు. దీంతో టెక్కలివాసులు మునిసిపాలిటీపై ఆశలు పెట్టుకున్నారు. దశాబ్దాల కల నెరవేరనుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 2010లో టెక్కలికి చెందిన డాక్టర్ కిల్లి కృపారాణి కేంద్రమంత్రిగా ఉన్నప్పుడే మునిసిపాలిటీగా అవకాశం లభించింది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు మునిసిపాలిటీ కాకుండా అడ్డుకున్నారు. 2016లో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హయాంలో సైతం టెక్కలి మునిసిపాలిటీగా ఏర్పాటుకు మరో అవకాశం వచ్చినా అప్పట్లో సద్వినియోగం చేసుకోలేదు. దీంతో టెక్కలి మునిసిపాలిటీ వ్యవహారం తెరమరుగైంది. ఈసారి టెక్కలిని మునిసిపాలిటీగా చేస్తానని మంత్రి అచ్చెన్న మరోసారి ప్రకటించడంతో కార్యరూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది. టెక్కలి 38వేల జనాభా ఉన్నారు. అవసరమైతే టెక్కలికి ఆనుకుని ఉన్న తొలుసూరుపల్లి, సీతాపురం, భగవాన్‌పురం, అక్కువరం, అయోధ్యపురం, బన్నువాడ గ్రామపంచాయతీలను అవసరమైతే టెక్కలి మునిసిపాలిటీలో విలీనానికి సైతం మార్గాలు ఉన్నాయి. టెక్కలిలో 20కు పైగా వార్డుల్లో 8,500 కు పైగా కుటుంబాలు నివశిస్తున్నాయి. 4.04 చదరపు మైళ్ల విస్తీర్ణం ఉంది. ఏడాదికి సుమారు కోటి రూపాయలు ఆదాయం సమకూరుతోంది. దీంతో మునిసిపాలిటీ ఏర్పాటుకు అవకాశాలు దగ్గరగా ఉన్నాయి. గ్రామపంచాయతీ యంత్రాంగం పాలన కూడా గడువు దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో టెక్కలి మునిసిపాలిటీగా ఎప్పుడు మారుతుందా? అని స్థానికులు ఎదురుచూస్తున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు ఇచ్చిన వాగ్దానం మేరకు టెక్కలిని మునిసిపాలిటీగా మార్చి.. మరింత అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.