Share News

‘గూగుల్‌’తో టెక్‌ వసంతం

ABN , Publish Date - Oct 18 , 2025 | 12:18 AM

Opportunities for jobs and research ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) రంగంలో కొత్త చరిత్ర సృష్టించేందుకు గూగుల్‌ సిద్ధమైంది. రాష్ట్ర టెక్నాలజీ అభివృద్ధికి కేంద్ర బిందువుగా నిలిచే ఏఐ హబ్‌ను వైజాగ్‌లో ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టుతో ఉత్తరాంధ్ర యువతకు సాంకేతిక రంగంలో అపార అవకాశాలు లభించనున్నాయి.

‘గూగుల్‌’తో టెక్‌ వసంతం

వైజాగ్‌లో ఏర్పాటు చేస్తే.. సిక్కోలుకు నూతన శక్తి

ఉద్యోగాలు, పరిశోధనలకు కొత్త దారులు

విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు.. ట్రైనింగ్‌ ప్రోగ్రాంలకు అవకాశం

పరిశ్రమల విస్తరణకు ఊతం

శ్రీకాకుళం, అక్టోబరు 17(ఆంధ్రజ్యోతి): ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ) రంగంలో కొత్త చరిత్ర సృష్టించేందుకు గూగుల్‌ సిద్ధమైంది. రాష్ట్ర టెక్నాలజీ అభివృద్ధికి కేంద్ర బిందువుగా నిలిచే ఏఐ హబ్‌ను వైజాగ్‌లో ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టుతో ఉత్తరాంధ్ర యువతకు సాంకేతిక రంగంలో అపార అవకాశాలు లభించనున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత సంస్థ గూగుల్‌ ఆధ్వర్యంలో రూపుదిద్దుకునే ఈ హబ్‌లో ఏఐ ఆధారిత పరిశోధన, శిక్షణ, ఆవిష్కరణలు, స్టార్టప్‌ మద్దతు వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా వేలాదిమంది టెక్నికల్‌ విద్యార్థులు, ఇంజనీర్లు, పరిశోధకులు నేరుగా లాభపడతారని నిపుణులు చెబుతున్నారు.

యువతకు అవకాశాలెన్నో..

రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం అన్ని విధాలా సహకరిస్తోంది. విశాఖలోని ఐటీ హిల్స్‌ ప్రాంతంలో ఏఐ హబ్‌ కోసం అవసరమైన భూమి, మౌళిక వసతుల కల్పనకు చర్యలు మొదలయ్యాయి. గూగుల్‌ ప్రతినిధులు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌తో సమావేశమై ప్రాజెక్టు దిశపై చర్చించారు. వైజాగ్‌లో ఏర్పడనున్న ఈ టెక్‌ హబ్‌.. పక్కనే ఉన్న శ్రీకాకుళం జిల్లాకు నూతన శక్తి ఇవ్వనుంది. ఇప్పటివరకు ఐటీ ఉద్యోగాల కోసం హైదరాబాద్‌, బెంగళూరు వంటి నగరాలకు వలస వెళ్లిన ఉత్తరాంధ్ర యువత ఇప్పుడు వైజాగ్‌లోనే టెక్నాలజీ ఆధారిత కెరీర్‌ సాధించే అవకాశం ఉంది. శ్రీకాకుళం, టెక్కలి, ఎచ్చెర్ల, ఆమదాలవలస ప్రాంతాల్లో ఇంజనీరింగ్‌ కళాశాలలు, పాలిటెక్నికల్‌ విద్యార్థులు.. ఇంటర్న్‌షిప్‌లు, ప్రాజెక్టులు, ట్రైనింగ్‌ ప్రోగ్రాంలు చేయడానికి నేరుగా అవకాశం ఉంటుంది. అలాగే విశాఖ-శ్రీకాకుళం-విజయనగరం జిల్లాలు టెక్‌ కారిడార్‌గా మారే అవకాశం ఉంది. కొత్త స్టార్టప్‌లు, డేటా సర్వీసులు, సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు, చిన్న పరిశ్రమలు ఈ ప్రాంతంలో విస్తరించనున్నాయి. ఇది ఉత్తరాంధ్ర ఆర్థికాభివృద్ధికి ప్రధాన బలంగా నిలవనుందని నిపునులు స్పష్టం చేస్తున్నారు.

ఉత్తరాంధ్రకు గేమ్‌చేంజర్‌

గూగుల్‌ ఏఐ హబ్‌ ఉత్తరాంధ్రకు గేమ్‌చేంజర్‌ అవుతుంది. ఇది ఉద్యోగ అవకాశాలు మాత్రమే కాదు. పరిశోధన, ఆవిష్కరణలకు కూడా కొత్త దారులు తెరుస్తుంది. ప్రస్తుతం ఏఐ నిపుణుల కొరత ఉంది. ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెంట్‌ గురించి వివరించే నిపుణులు 35 మంది అవసరం కాగా.. ఉత్తరాంధ్రలో ఒకరు మాత్రమే లభ్యమవుతున్నారు. ఏఐ హబ్‌ వస్తే ప్రత్యక్షంగాను.. పరోక్షంగానూ.. జిల్లా ప్రజలకు, ముఖ్యంగా యువతకు మేలు కలుగుతుంది.

- డా. బుడుమూరు రాజేష్‌, జేఎన్టీయూ పాలకమండలి సభ్యుడు

అభివృద్ధికి ముందంజ :

రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన జిల్లా.. శ్రీకాకుళం. అత్యంత వెనుకబడిన ప్రాంతం పాతపట్నం నియోజకవర్గం. గూగుల్‌ ఏఐ హబ్‌ విశాఖలో ఏర్పాటైతే.. అనుబంధంగా శ్రీకాకుళం జిల్లా యువతకు ఎంతో ప్రయోజనం. కొన్ని సంవత్సరాల వ్యవధిలోనే వెనుకబాటు పోయి.. అభివృద్ధి పథంలోకి అన్ని ప్రాంతాలు పయనిస్తాయి. పక్కనే ఉద్యోగావకాశాలు.. అనుబంధ పరిశ్రమలు ఏర్పాటవుతాయి. ఇది శుభపరిణామం.

- మామిడి గోవిందరావు, ఎమ్మెల్యే, పాతపట్నం

Updated Date - Oct 18 , 2025 | 12:18 AM