Share News

టెక్‌ శంకర్‌ అమర్‌రహే

ABN , Publish Date - Nov 22 , 2025 | 12:14 AM

Maoist leader Jogarao's funeral held in Bathupuram వజ్రపుకొత్తూరు మండలం బాతుపురంలో విప్లవ నినాదాలు హోరెత్తాయి. ‘టెక్‌ శంకర్‌ అమర్‌ రహే’ అంటూ మావోయిస్టు నేత మెట్టూరు జోగారావుకు విప్లవ సంఘాలు, అమరుల బంధుమిత్రుల కమిటీ, ప్రజా కళాకారులు, ఉద్దానం ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. పోలీసుల ఆంక్షల నడుమ అంత్యక్రియలు పూర్తిచేశారు.

టెక్‌ శంకర్‌ అమర్‌రహే
జోగారావు మృతదేహం వద్ద రోదిస్తున్న బంధువులు

  • బాతుపురంలో మావోయిస్టు నేత జోగారావు అంత్యక్రియలు

  • ఉద్దానం ప్రజలు, విప్లవ సంఘాల ఘననివాళి

  • పలాస/ వజ్రపుకొత్తూరు, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): వజ్రపుకొత్తూరు మండలం బాతుపురంలో విప్లవ నినాదాలు హోరెత్తాయి. ‘టెక్‌ శంకర్‌ అమర్‌ రహే’ అంటూ మావోయిస్టు నేత మెట్టూరు జోగారావుకు విప్లవ సంఘాలు, అమరుల బంధుమిత్రుల కమిటీ, ప్రజా కళాకారులు, ఉద్దానం ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. పోలీసుల ఆంక్షల నడుమ అంత్యక్రియలు పూర్తిచేశారు. అల్లూరిసీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో బుధవారం పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు నేత మెట్టూరు జోగారావు అలియాస్‌ టెక్‌ శంకర్‌ మృతి చెందిన విషయం తెలిసిందే. రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం ఆయన మృతదేహాన్ని గురువారం రాత్రి బంధువులకు అప్పగించారు. అంబులెన్స్‌లో జోగారావు మృతదేహాన్ని శుక్రవారం ఉదయం 9 గంటలకు ఆయన స్వగ్రామమైన బాతుపురం తీసుకువచ్చారు. అప్పటికే ఆయన ఇంటివద్ద విప్లవాభిమానులు, స్థానికులు, ఉద్దానం ప్రజలు పెద్దఎత్తున చేరుకున్నారు. పోలీసులు వారిని వారిస్తూ గంట మాత్రమే కార్యక్రమం నిర్వహించాలని, ఊరేగింపులు.. ఎర్రజెండాలు లేకుండా అంత్యక్రియలు చేపట్టాలని సూచించారు. పెద్ద ఎత్తున ప్రజలు రావడంతో రెండు గంటలపాటు మృతదేహాన్ని ఆయన ఇంటి వద్ద ఉంచాల్సి వచ్చింది. జోగారావుకు క్యూ పద్ధతిన ప్రజలు నివాళులర్పించారు. అరుణోదయ కళాకారుల బృందం విప్లవగీతాలు ఆలపిస్తూ జోగారావు విప్లవ ప్రస్థానాన్ని వివరిస్తూ ప్రసంగించారు. అనంతరం అంతియమాత్రకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో జోగారావు మృతదేహం ఊరేగింపునకు అనుమతి లేదని, కేవలం అంత్యక్రియలు నిర్వహించుకోవాలని కాశీబుగ్గ రూరల్‌ సీఐ తిరుపతి.. బంధువులు, అమరుల బంధుమిత్రుల కమిటీకి మరోసారి స్పష్టం చేశారు. దీంతో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బంధుమిత్రుల కమిటీ సభ్యులు పోలీసుల వైఖరికి నిరసనగా రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. అనంతరం కుటుంబ సభ్యుల విన్నపం మేరకు ఊరేగింపును ముందుగానే తీసుకువెళ్లారు. అనంతరం జోగారావు మృతదేహాన్ని ప్రత్యేక రథంపై బాతుపురంలోని శ్మశానవాటికకు తరలించారు. మృతదేహానికి జోగారావు సోదరుడు మధుసూధన్‌ నిప్పంటించి అంత్యక్రియలు పూర్తిచేశారు. ఇదిలా ఉండగా బాతుపురంలో పోలీసులు అడుగడుగునా నిఘా ఏర్పాటు చేశారు. డ్రోన్‌తో కూడా పర్యవేక్షించారు. జోగారావు అంత్యక్రియలు పూర్తయ్యే వరకూ గ్రామంలోనే మకాం వేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకున్నారు.

  • ఇల్లు విడిచిన తర్వాత ఒకసారే చూశాను

  • 1988 సంవత్సరంలో ఇల్లు విడిచి జోగారావు అడవిబాట పట్టాడు. ఒకమారు పోలీసులకు పట్టుబడడంతో జైలుజీవితాన్ని గడిపాడు. ఆ సమయంలో కలిశాను. మళ్లీ ప్రస్తుతం ఆయన మృతదేహం చూస్తున్నాను. ఆయన ఉన్నాడనే ధైర్యం ఉండేది. ప్రస్తుతం అది లేదు.

  • మెట్టూరు మధు, జోగారావు సోదరుడు

  • సంపదను పెత్తందారులకు అప్పగించడానికే ఎన్‌కౌంటర్లు

  • అడవిలో ఉన్న విలువైన ఖనిజ సంపదను పెత్తందారులకు అప్పగించడానికి ప్రభుత్వం చేస్తున్న కుట్రలో భాగమే ఈ ఎన్‌కౌంటర్లు. దీనివల్ల ఎవరికి ప్రయోజనమో ప్రజలే ఆలోచించాలి. హిడ్మా, శంకర్‌ పాశవిక ఎన్‌కౌంటర్లు తీవ్రంగా ఖండిస్తున్నాం. మృతదేహాలు అప్పగించడానికి కొత్తగా డీఎన్‌ఏ పరీక్షల పేరుతో ఇబ్బందులకు గురిచేయడం తగదు.

  • బి.అంజమ్మ, రాష్ట్ర అమరుల బంధుమిత్రుల కమిటీ అధ్యక్షురాలు

  • పోలీసుల అదుపులోఉన్నవారిని కోర్టుకు అప్పగించాలి

  • పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టులను కోర్టుకు అప్పగించి ప్రభుత్వం చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. ప్రస్తుతం జరిగినవి భూటకపు ఎన్‌కౌంటర్లుగానే భావిస్తున్నాం. ప్రజాస్వామికవాదులు, ప్రజలు దీన్ని ఖండించాలి.

  • - జోగి కోదండరావు, అమరుల బంధుమిత్రుల కమిటీ జిల్లా అధ్యక్షుడు

Updated Date - Nov 22 , 2025 | 12:14 AM