టీచర్ ప్రోత్సాహం.. గ్రామస్థుల చొరవ
ABN , Publish Date - Aug 06 , 2025 | 12:27 AM
టీచర్ ప్రోత్సాహానికి గ్రామస్థుల చొరవ తోడవడంతో ఆ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య మూడు రెట్లు పెరిగింది.
- దూగానపుట్టుగ ప్రభుత్వ పాఠశాలలో చేరిన విద్యార్థులు
- 13 నుంచి 55కు పెరిగిన పిల్లల సంఖ్య
కవిటి, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): టీచర్ ప్రోత్సాహానికి గ్రామస్థుల చొరవ తోడవడంతో ఆ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య మూడు రెట్లు పెరిగింది. మండలంలోని దూగానపు ట్టుగ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో 1నుంచి 8వ తరగతి వరకు 47 మంది విద్యార్థులు చదివేవారు. రాష్ట్ర ప్రభు త్వం తెచ్చిన నూతన విద్యా విధానంతో ఈ పాఠశాలలో ఒకటి నుంచి 5 తరగతులు మాత్రమే మిగిలాయి. ఈ తరగతుల్లో కేవలం 13మంది విద్యార్థులే ఉన్నారు. దీంతో గ్రామంలో పాఠశాల మూతపడే పరిస్థితి ఏర్పడుతుందని ఏకోపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న రాజేష్ గ్రామస్థులకు చెప్పారు. దీంతో గ్రామస్థులంతా కలసి ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల వద్దకు వెళ్లారు. పిల్లలను గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. ఈ విద్యాసంవత్సరంలో 42మంది విద్యార్థులను పాఠశాలలో చేర్పించారు. మొత్తంగా ఈ ఏడాది 55మంది విద్యార్థులు అయ్యారు. దీంతో నూతన పాలసీ ప్రకారం మోడల్ ప్రైమరీ పాఠశాల అయ్యేందుకు అవకాశం ఉందని ప్రధానోపాధ్యాయుడు రాజేష్ తెలిపారు. మండల విద్యాశాఖాధికారి ధనుంజయ మజ్జి పాఠశాలను మంగళవారం సందర్శించి గ్రామస్థులు, ఉపాధ్యాయుడిని అభినందించారు.