Share News

నవసమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులే కీలకం

ABN , Publish Date - Sep 06 , 2025 | 12:18 AM

teachers day celebrations నవసమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అన్నారు. డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని పురష్కరించుని విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్‌ ఆడిటోరియంలో శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు.

నవసమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులే కీలకం
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

క్రమశిక్షణతో కూడిన విద్య అందించాలి

కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

ఘనంగా గురుపూజోత్సవం

జిల్లాలో 60 మంది ఉపాధ్యాయులకు అవార్డుల ప్రదానం

గుజరాతీపేట, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): నవసమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అన్నారు. డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని పురష్కరించుని విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్‌ ఆడిటోరియంలో శుక్రవారం ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సర్వేపల్లి చిత్రపటం వద్ద ఎమ్మెల్యే గొండు శంకర్‌, విద్యాశాఖ అధికారులు జ్యోతిప్రజ్వలన చేసి నివాళులర్పించారు. విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను కలెక్టర్‌ చేతులమీదుగా ప్రదానం చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ.. ‘ఉపాధ్యాయ వృత్తి చాలా ప్రాముఖ్యమైనది. విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందించేందుకు నిత్యం కృషి చేయాలి. విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దాలి. విద్యార్థులు ఐఏఎస్‌, ఐపీఎస్‌, ప్రొఫెసర్‌, శాస్రవేత్త తదితర లక్ష్యాలను ఏర్పాటు చేసుకునేలా వారి బంగారు భవిష్యత్‌కు పునాది వేయాలి. ఉపాధ్యాయుల మీద అదనపు భారం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మెగా డీఎస్సీతో ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టామ’ని తెలిపారు. ఎమ్మెల్యే గొండు శంకర్‌ మాట్లాడుతూ ‘డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకం. ప్రతి పాఠశాలలో నాణ్యమైన విద్య అందించాలి. ఉపాధ్యాయ వృత్తి.. ఉద్యోగం కాదు. ఒక బాధ్యత’ అని తెలిపారు. ఇన్‌చార్జి డీఈవో రవిబాబు మాట్లాడుతూ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లాలో 60 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసి సన్మానించామని, వారికి అవార్డులు అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో డైట్‌ ప్రిన్సిపాల్‌ గౌరీశంకర్‌, సమగ్ర శిక్ష పీసీ ఎస్‌.శశిభూషణరావు, సాయిప్రసాద్‌, బెజ్జిపురం యూత్‌ క్లబ్‌ అధ్యక్షుడు ప్రసాదరావు, ఉప విద్యాశాఖాధికారులు, ఎంఈవోలు, ఆమదాలవలస మునిసిపాలిటీ మాజీ వైస్‌ చైర్మన్‌ గోవిందరావు, మాజీ సర్పంచ్‌ అప్పలనాయుడు, ఉపాధ్యాయ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. .

ముగ్గురికి రాష్ట్రస్థాయిలో ఉత్తమ అవార్డుల ప్రదానం

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుక్రవారం విజయవాడలో రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు సీఎం చంద్రబాబునాయుడు చేతులమీదుగా అవార్డులు ప్రదానం చేశారు. జిల్లాకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయినులు రాష్ట్రస్థాయి అవార్డులకు ఎంపికైన విషయం తెలిసిందే. ఈ మేరకు శ్రీకాకుళంలోని అంధవరపు వరం మున్సిపల్‌ ఉన్నత పాఠశాలలో హిందీ పండితురాలు తిమ్మరాజు నీరజ, జి.సిగడాం మండలం పున్నాం పంచాయతీ బూటుపేట ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కూర్మాన అరుణకుమారి, మెళియాపుట్టి మండలం నేలబొంతు గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బూరవల్లి విజయభారతి.. సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ చేతులమీదుగా రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్నారు.

Updated Date - Sep 06 , 2025 | 12:18 AM