Bad teacher: మాస్టారూ.. మీరు మారరా?
ABN , Publish Date - Mar 14 , 2025 | 12:37 AM
Teacher Misconduct ఆయనో తెలుగు ఉపాధ్యాయుడు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఆయన.. వారితో అసభ్యంగా ప్రవర్తించాడు. ద్వంద్వ అర్థాలతో మాట్లాడుతూ.. విద్యార్థినుల భుజాలపై తాకుతూ.. వికృత చేష్ఠలకు పాల్పడేవాడు. ఇలా వ్యవహరించి.. ఇప్పటికే ఓ పాఠశాలలో ఒకసారి సస్పెండ్ అయ్యాడు. మరోసారి అధికారులను బతిమిలాడుకుని వేటు నుంచి తప్పించుకున్నాడు. మరో పాఠశాలకు బదిలీ అయ్యాడు. అయినా ఆయన తీరు మారలేదు.

విద్యార్థినుల పట్ల అసభ్యకర ప్రవర్తన
విద్యాశాఖ అధికారులకు బాధితుల ఫిర్యాదు
డీఈవో విచారణ.. విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు
ఇప్పటికే ఒకసారి సస్పెన్షన్.. తాజాగా మరోసారి వేటు
ఇదీ పెద్దసాన పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడి తీరు
టెక్కలి, మార్చి 13(ఆంధ్రజ్యోతి): ఆయనో తెలుగు ఉపాధ్యాయుడు. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఆయన.. వారితో అసభ్యంగా ప్రవర్తించాడు. ద్వంద్వ అర్థాలతో మాట్లాడుతూ.. విద్యార్థినుల భుజాలపై తాకుతూ.. వికృత చేష్ఠలకు పాల్పడేవాడు. ఇలా వ్యవహరించి.. ఇప్పటికే ఓ పాఠశాలలో ఒకసారి సస్పెండ్ అయ్యాడు. మరోసారి అధికారులను బతిమిలాడుకుని వేటు నుంచి తప్పించుకున్నాడు. మరో పాఠశాలకు బదిలీ అయ్యాడు. అయినా ఆయన తీరు మారలేదు. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న పాఠశాలల్లో కూడా విద్యార్థినులతో అసభ్యకర రీతి వ్యవహరించడంతో వారు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. డీఈవో విచారణ చేపట్టి.. ఆయనను మందలించి మరోసారి సస్పెండ్ చేశారు. వివరాల్లోకి వెళితే..
టెక్కలి మండలం పెద్దసానలోని ప్రాథమికోన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడు ఎలుగు ప్రసాద్ వికృత చేష్టలు అన్నీఇన్నీ కావు. ఈ పాఠశాలలో ఒకటి నుంచి ఎనిమిదో తరగతి వరకూ 85 మంది విద్యార్థులు ఉన్నారు. ఐదు నుంచి ఎనిమిదో తరగతి వరకూ 35 మంది విద్యార్థులు చదువుతున్నారు. విద్యార్థినులతో తెలుగు మాస్టర్ ప్రసాద్ అసభ్యంగా ప్రవర్తించేవారు. దీంతో వారంతా మూకుమ్మడిగా 8 పేజీల లేఖను రాసి ఉపాధ్యాయుడి తీరుపై మండల విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎంఈవో ఈ విషయాన్ని డీఈవో తిరుమల చైతన్య దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు గురువారం డీఈవో తిరుమల చైతన్య, డిప్యూటీ డీఈవో విలియమ్స్, ఇతర అధికారులు విచారణ చేపట్టారు. విద్యార్థినులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడి ఈ ఘటనపై ఆరా తీశారు. ఉపాధ్యాయుడు ప్రసాద్ ద్వంద్వ అర్థాలతో బూతులు మాట్లాడుతున్నారని, బండిపై వస్తావా.. అని పలుసార్లు అడుగుతుంటారని, అసభ్యకరంగా తమను తాకుతున్నారని చెబుతూ విద్యార్థినులు ఏడుస్తూ తమగోడు వెళ్లగక్కారు. అటువంటి ఉపాధ్యాయుడు తమకు వద్దంటూ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అధికారులకు మొర పెట్టుకున్నారు. దీనిపై ఆ ఉపాధ్యాయుడ్ని డీఈవో ప్రశ్నించగా.. తాను ఏ తప్పూ చేయలేదని చెప్పడం గమనార్హం. ఉపాధ్యాయ సంఘాలు కూడా ఆయనను వెనకేసుకు రావడంతో విద్యార్థినుల తల్లిదండ్రులు మండిపడ్డారు. దీంతో వారు అక్కడ నుంచి జారుకున్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి.. ఉపాధ్యాయుడు ప్రసాద్‌ను సస్పెండ్ చేస్తూ డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థినులు రాసిన లేఖ చదివి తాను చలించిపోయి కన్నీళ్లు పెట్టుకున్నానని డీఈవో తెలిపారు. ఇటువంటి ఘటనలు జరిగితే ఉపాధ్యాయులపై చర్యలకు వెనుకాడబోమని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా ప్రసాద్ గతంలో కంచిలి మండలం మఠంసరియాపల్లిలో పనిచేస్తున్నప్పుడు ఇదే తరహా వ్యవహరించగా అప్పట్లో ఆయన్ను సస్పెండ్ చేశారు. ఆ తర్వాత కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడు పాఠశాలలో చేరి అక్కడ కూడా విద్యార్థులపై ఇదే తరహాలో వ్యవహరించారు. ఉపాధ్యాయుడు కుటుంబసభ్యులు బతిమిలాడడంతో ప్రసాద్ సస్పెన్షన్ నుంచి తప్పించుకొని పెద్దసాన పాఠశాలకు ఏడాదిన్నర కిందట చేరాడు. తాజాగా ఈ పాఠశాలలో కూడా ఇదే రీతిన వ్యవహరించి.. సస్పెన్షన్‌కు గురికావడం చర్చనీయాంశంగా మారింది. ఆ మాస్టర్.. తీరు మారదంటూ పలువురు విమర్శించారు.