టీడీపీతోనే ఉత్తరాంధ్ర నేతలకు అత్యున్నత గౌరవం
ABN , Publish Date - Jul 27 , 2025 | 11:57 PM
టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోనే ఉత్తరాంధ్ర నేతలకు అత్యున్నత గౌరవం లభించిందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు.
పాతపట్నం, జూలై 27(ఆంధ్రజ్యోతి): టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోనే ఉత్తరాంధ్ర నేతలకు అత్యున్నత గౌరవం లభించిందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. స్థానిక క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుకు గోవా గవర్నర్‌గా పదవి వరించడం ఉత్తరాంధ్రకే గర్వకారణమన్నారు. అలాగే ఉత్తరాంధ్ర నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడికి కేంద్రమంత్రి పదవి దక్కడం, సాధారణ కార్యకర్త కలిశెట్టి అప్పలనాయుడును ఎంపీగా చేయడం తెలుగుదేశం పార్టీకే సాధ్యమన్నారు. ఉత్తరాంధ్రలో విద్యా సంస్థల స్థాపనకు, ఆలయాలకు వేల ఎకరాల భూమిని ధారాదత్తం చేసిన అశోక్‌గజపతి రాజుకు గత వైసీపీ ప్రభుత్వం మానసిక క్షోభకు గురిచేసిందని ఆరోపించారు. అలాగే మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి పదేపదే తనపై చేసిన ఆరోపణలను ఎమ్మెల్యే ఖండించారు. ఇది ఆమె దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు సైలాడ సతీష్, శివాల చిన్నయ్య, నందిగామ ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.
ఉత్తరాంధ్ర వాసులకు గర్వకారణం
హిరమండలం, జూలై 27(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్రను కొన్ని శతాబ్దాల పాటు పరిపాలించిన ఆశోక గజపతిరాజు కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు గౌరవించడం హర్షనీయమని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు కలమట వెంకటరమణమూర్తి అన్నారు. ఆదివారం గులుమూరు గ్రామంలో ఆ యన విలేకరులతో మాట్లాడారు. అశోకగజపతిరాజుకు గోవా గవర్నర్‌గా నియ మించడం ఉత్తరాంధ్రవాసులకే గర్వకారణమన్నారు. వైసీపీ హయాంలో గజ పతిరాజును అన్ని విధాలుగా ఇబ్బందిపెట్టారన్నారు. జడ్పీటీసీ పి.బుచ్చిబాబు, టీడీపీ నాయకులు కె.అప్పలరాజు, ఎస్.గోవింద, తంగి అప్పన్న ఉన్నారు.
అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవిపై హర్షం
పోలాకి, జూలై 27(ఆంధ్రజ్యోతి): అశోక్ గజపతిరాజుకు గోవా గవర్నర్ పదవి రావడం ఉత్తరాంధ్ర జిల్లాలకు ఎంతో గర్వకారణమని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. ఆదివారం ఆయన తన క్యాంప్ కార్యాలయంలో మాట్లాడుతూ.. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయడమే కాదు.. అక్కడి నాయకులను ప్రోత్సహించడంలో కూటమి ప్రభుత్వం ముందుందని మరోసారి రుజువైందన్నారు. అశోక్ గజపతిరాజు కుటుంబం ఉత్తరాంధ్రలో విద్యాసంస్థల స్థాపనకు, ఆలయాలకు వేలాది ఎకరాల భూమిని వితరణగా ఇచ్చిన తన ఉదారతచాటుకోవడం విశేషమన్నారు. అటువంటి కుటుంబానికి చెందిన వ్యక్తిని గత వైసీపీ ప్రభుత్వం మానసికంగా ఒత్తిడికి గురిచేసిందని, అక్రమ కేసులు బనాయించి వేధించిందని గుర్తుచేశారు. విశాఖలో ఐటీ సెజ్, ఎన్టీపీసీ గ్రీన్, భోగాపురం విమానాశ్రయం, విశాఖ రైల్వేజోన్ ఒక్క ఏడాదిలోని సాధించిన ఘనత సీఎం చంద్రబాబుకు దక్కుతుందనడంలో సందేహంలేదన్నారు. కార్యక్రమంలో జడ్పీపీటీసీ రాంబాబు, పార్టీ ఇన్‌చార్జి బగ్గు అర్చన, తదితరులు ఉన్నారు.