Share News

పన్నుల్లో వెనుకబాటు!

ABN , Publish Date - Dec 17 , 2025 | 11:49 PM

Tax arrears in towns జిల్లాలో ఆస్తిపన్ను వసూలు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ముఖ్యంగా శ్రీకాకుళం నగరపాలక సంస్థతోపాటు మునిసిపాలిటీల్లో వెనుకబాటు కనిపిస్తోంది. ఆస్తి పన్నుల వసూలు ఏటా 10శాతం పురోగతి సాధిస్తేనే ఆర్థిక సంఘం నిధులు విడుదలకు మార్గం ఏర్పడుతుంది. ఆపై స్థానిక సంస్థ అభివృద్ధి సాధ్యమవుతుంది. కానీ జిల్లాలో మాత్రం ఆశించిన స్థాయిలో ఆస్తిపన్ను వసూలు కావడం లేదు.

పన్నుల్లో వెనుకబాటు!
ఇచ్ఛాపురం మునిసిపల్‌ కార్యాలయం

పట్టణాల్లో ఆస్తిపన్ను కట్టేందుకు విముఖత

కోట్లాది రూపాయలు బకాయిలు

ఆర్థిక సంఘం నిధులపై ప్రభావం

ఇచ్ఛాపురం, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆస్తిపన్ను వసూలు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ముఖ్యంగా శ్రీకాకుళం నగరపాలక సంస్థతోపాటు మునిసిపాలిటీల్లో వెనుకబాటు కనిపిస్తోంది. ఆస్తి పన్నుల వసూలు ఏటా 10శాతం పురోగతి సాధిస్తేనే ఆర్థిక సంఘం నిధులు విడుదలకు మార్గం ఏర్పడుతుంది. ఆపై స్థానిక సంస్థ అభివృద్ధి సాధ్యమవుతుంది. కానీ జిల్లాలో మాత్రం ఆశించిన స్థాయిలో ఆస్తిపన్ను వసూలు కావడం లేదు. జిల్లాలో శ్రీకాకుళం నగరపాలక సంస్థ, పలాస-కాశీబుగ్గ, ఆమదాలవలస, ఇచ్ఛాపురం మునిసిపాలిటీలు ఉన్నాయి. వీటి పరిధిలో 80,914 అసెస్‌మెంట్లు ఉన్నాయి. పన్నుల రూపంలో రూ.49.08 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. కానీ ఇప్పటివరకూ కేవలం రూ.20.19 కోట్లు మాత్రమే అధికారులు రాబెట్టగలిగారు. అక్టోబరు నుంచి రెండు విడతలుగా మునిసిపల్‌ అధికారులు ఇంటింటికీ వెళ్లి వసూలు చేపట్టినా ఆశించినస్థాయిలో ఫలితం దక్కలేదు. పన్ను చెల్లించేందుకు ప్రజలు పెద్దగా ఆసక్తిచూపడం లేదు. ఇచ్ఛాపురంలో రూ.2.49 కోట్లు, పలాస-కాశీబుగ్గలో రూ.4.45 కోట్లు, ఆమదాలవలసలో రూ.2.31 కోట్లు, శ్రీకాకుళం నగరపాలక సంస్థలో రూ.19.64 కోట్లు పేరుకుపోయాయి. దీంతో ఆర్థిక సంఘం నిధుల విడుదలపై ప్రభావం చూపే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.

వసూలు అంతంతే..

శ్రీకాకుళం నగరపాలక సంస్థలో 43,605 అసెస్‌మెంట్లు ఉన్నాయి. పన్నుల వసూలు లక్ష్యం రూ.34.07 కోట్లుకాగా.. వసూలైంది రూ.14.43 కోట్లు మాత్రమే. ఇచ్ఛాపురం మునిసిపాల్టీలో 7811 అసెస్‌మెంట్ల నుంచి రూ.3.77 కోట్ల లక్ష్యానికి రూ.1.28 కోట్లు వసూలైంది. పలాస-కాశీబుగ్గలో 17,558 అసెస్‌మెంట్ల నుంచి రూ.7.23 కోట్ల లక్ష్యానికి రూ.2.78 కోట్లు వసూలైంది. ఆమదాలవలసలో 11,940 అసెస్‌మెంట్ల నుంచి రూ.4.01 కోట్లు లక్ష్యానికి వసూలైంది రూ.1.70 కోట్లు మాత్రమే. అయితే గత ఏడాది మాదిరిగా ఈ నెల చివర్లో ఆస్తి పన్ను చెల్లింపుపై రాయితీ కల్పిస్తారనే ప్రచారం సాగుతోంది. అలా అయితే పన్నుల వసూలు ప్రక్రియ వేగవంతమయ్యే అవకాశం ఉంది.

ప్రత్యేక డ్రైవ్‌

ఆస్తి పన్ను వసూలుకు సచివాలయాల వారీగా ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాం. ఇప్పటికే రెండు సార్లు సిబ్బంది ఇంటింటికీ తిరిగారు. ప్రజలు ఆస్తిపన్ను కట్టి మునిసిపాలిటీకి సహకరించాలి. పన్నులు కడితేనే ఆర్థిక సంఘం నిధులు విడుదల అవుతాయన్న విషయాన్ని గుర్తించాలి.

- ఎన్‌.రమేష్‌.. కమిషనర్‌, ఇచ్ఛాపురం మునిసిపాలిటీ

Updated Date - Dec 17 , 2025 | 11:49 PM