Share News

2026 డిసెంబరు నాటికి ప్రతి ఇంటికీ కుళాయినీరు

ABN , Publish Date - Dec 27 , 2025 | 11:15 PM

Tap water for every home జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నాయని కేంద్రపౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు. 2026 డిసెంబరు నాటికి ప్రతి ఇంటికీ కుళాయి నీరు అందిస్తామన్నారు.

2026 డిసెంబరు నాటికి ప్రతి ఇంటికీ కుళాయినీరు
మాట్లాడుతున్న కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు, పక్కన కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎస్పీ మహేశ్వరరెడి

  • ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం

  • పొందూరులో రీసెర్చ్‌ అండ్‌ స్కిల్లింగ్‌ సెంటర్‌

  • కేంద్రమంత్రి కె.రామ్మోహన్‌నాయుడు వెల్లడి

  • శ్రీకాకుళం, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): జిల్లా సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నాయని కేంద్రపౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు తెలిపారు. 2026 డిసెంబరు నాటికి ప్రతి ఇంటికీ కుళాయి నీరు అందిస్తామన్నారు. శ్రీకాకుళం జడ్పీ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ(దిశా) సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయం, పారిశ్రామిక రంగాల మేళవింపుతో జిల్లా ముఖచిత్రాన్ని మారుస్తామన్నారు. ‘వచ్చే ఏడాది డిసెంబరు నాటికి జిల్లాలో ప్రతి ఇంటికీ జల్‌జీవన్‌ మిషన్‌ ద్వారా కుళాయిలు ఏర్పాటు చేసి.. సురక్షితమైన తాగునీటిని అందిస్తాం. జల్‌జీవన్‌ మిషన్‌ ద్వారా కేంద్రం రాష్ట్రానికి రూ.13వేల కోట్లు మంజూరు చేస్తే.. గత ప్రభుత్వం ఆ నిధులను దుర్వినియోగం చేసింది. ఎక్కడా ఇంటిగ్రేటెడ్‌ అప్రోచ్‌ లేకుండా పనులను అస్తవ్యస్తంగా చేశారు. ప్రస్తుత కూటమి పాలనలో ఆ తప్పులన్నింటినీ సరిదిద్దుతున్నాం. మరోసారి అంచనాలు రూపొందించి.. గడువులోగా వంద శాతం ఇళ్లకు నీరందిస్తాం. 15వ ఆర్థిక సంఘం నిధులను నేరుగా పంచాయతీలకు అందిస్తున్నాం. 16వ ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రానికి మరిన్ని నిధులు తెచ్చేలా కృషి చేస్తున్నాం. జనవరి 26 నుంచి రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తాం. ప్రమాదాల నివారణకు జీరో టాలరెన్స్‌తో పనిచేస్తున్నామ’ని కేంద్రమంత్రి తెలిపారు.

  • నేరడి చిక్కుముడిని విప్పుతాం..

  • ‘వంశధార నదిపై ప్రతిష్టాత్మకమైన నేరడి బ్యారేజీ నిర్మాణానికి ఉన్న అడ్డంకులను తొలగిస్తాం. ట్రిబ్యునల్‌ తీర్పు సానుకూలంగా ఉన్నందున.. ఒడిశా ప్రభుత్వంతో చర్చించి ఈ సమస్యను పరిష్కరించేందుకు సీఎం చంద్రబాబు, నేను కేంద్ర జలశక్తి మంత్రిని కలిశాం. ఒడిశాకు కూడా ప్రయోజనం చేకూరేలా ఇక్కడి రైతులకు మేలు జరిగేలా త్వరలోనే నేరడిని సాకారం చేస్తాం. పూర్వోదయ స్కీం ద్వారా వచ్చే బడ్జెట్‌లో ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులకు ప్రత్యేక నిధులు కేటాయించేలా కృషి చేస్తున్నామ’ని కేంద్రమంత్రి వివరించారు.

  • పోర్టు, పరిశ్రమలతో యువతకు ఉపాధి..

  • వచ్చే ఏడాదికి మూలపేట పోర్టు పనులు పూర్తవుతాయి. దీనికి అనుబంధంగా లాజిస్టిక్స్‌ మెరుగుపరుస్తున్నాం. భవిష్యత్తులో కార్గో ఎయిర్‌ పోర్ట్‌ కూడా వచ్చేలా ప్రణాళికలు ఉన్నాయి. జిల్లాలో బీచ్‌ సాండ్‌ మినరల్స్‌ ఆధారంగా టైటానియం కాంప్లెక్స్‌, రేర్‌ ఎర్త్‌ మ్యాగ్నెట్స్‌ వంటి పరిశ్రమలు తెచ్చి స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పిస్తామ’ని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు తెలిపారు.

  • నేతన్నల ఆస్తి.. ‘పొందూరు ఖాదీ’..

  • ‘పొందూరు ఖాదీ మన ప్రాంతానికి ఒక పెద్ద ఆస్తి. ఆ ఖ్యాతికి తగ్గట్టుగా స్థానిక నేతన్నల ఆదాయం మాత్రం పెరగడం లేదు. అందుకే దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టా. గతంలో కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌ పొందూరు వచ్చినప్పుడు చేసిన విజ్ఞప్తి, వరుసగా చేసిన పేపర్‌ వర్క్‌ ఫలితంగా నేడు కామర్స్‌ అండ్‌ ట్రేడ్‌ విభాగం నుంచి ‘జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌’(జీఐ) ట్యాగ్‌ లభించింది. ఈ ట్యాగ్‌ను అస్త్రంగా మార్చుకొని పొందూరు ఖాదీని అంతర్జాతీయ మార్కెట్లలో ప్రచారం చేస్తాం. తద్వారా వచ్చే ఆదాయం నేరుగా నేతన్నలకే చెందేలా చూస్తాం. వారి నైపుణ్యాన్ని పెంచేందుకు త్వరలోనే పొందూరులో ‘రీసెర్చ్‌ అండ్‌ స్కిల్లింగ్‌ సెంటర్‌’ ఏర్పాటు చేస్తామ’ని కేంద్రమంత్రి పేర్కొన్నారు.

  • అధికారులకు ఆదేశాలు

  • ‘దిశా’ సమావేశంలో కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు.. మాట్లాడుతూ.. ‘శ్రీకాకుళం నగరపాలక సంస్థతోపాటు.. అన్ని మునిసిపాలిటీలు ముందుగా పారిశుధ్యాన్ని మెరుగుపరచాలి. స్వచ్ఛభారత్‌లో ర్యాంకులను అందుకే ప్రస్తావించా. విశాఖ ఎంతో మెరుగ్గా చేస్తోంది. శ్రీకాకుళం సింహద్వారాన్ని మరింత విస్తరించాలి. జాతీయ రహదారులను ఆనుకుని బ్లాక్‌ స్పాట్స్‌ను నిర్ధారణ చేసి భవిష్యత్‌లో ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దాల’ని ఆదేశించారు. సమగ్రశిక్ష కార్యక్రమాలు ఆలస్యంపై ఆరా తీశారు. అలాగే జిల్లాలో ప్రసవనంతరం మహిళల మరణాల రేటు పెరుగుదలపై వైద్యఆరోగ్యశాఖ అధికారుల నుంచి వివరణ తీసుకున్నారు. అంతర్జాతీయంగా గ్రానైట్‌ అమ్మకాలు తగ్గుముహం పట్టడానికి గల కారణాలను తెలుసుకున్నారు. అన్ని శాఖలపై సమగ్రంగా సమీక్షించి పలు ఆదేశాలను జారీచేశారు. సమావేశంలో కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, ఎస్పీ మహేశ్వరరెడ్డి, శ్రీకాకుళం, నరసన్నపేట ఎమ్మెల్యేలు గొండు శంకర్‌, బగ్గు రమణమూర్తి, ట్రైనీ కలెక్టర్‌ పృథ్వీరాజ్‌ కుమార్‌, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Dec 27 , 2025 | 11:15 PM