సదరం ధ్రువపత్రాల రీవెరిఫికేషన్‌లో చేతివాటం
ABN , Publish Date - Dec 25 , 2025 | 12:13 AM
సదరం ధ్రువపత్రాల రీవెరిఫికేషన్‌లో నరసన్నపేట సామాజిక ఆసుపత్రికి చెందిన కొంతమంది సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు.
- నరసన్నపేట సీహెచ్‌సీ సిబ్బందిపై వైద్యుడి ఫిర్యాదు
- వైద్యఆరోగ్యశాఖ అధికారుల విచారణ
నరససన్నపేట, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): సదరం ధ్రువపత్రాల రీవెరిఫికేషన్‌లో నరసన్నపేట సామాజిక ఆసుపత్రికి చెందిన కొంతమంది సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. ఈ విషయాన్ని బాధితులు వైద్యుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఓ వైద్యుడి ఫిర్యాదుతో వైద్యఆరోగ్యశాఖ అధికారులు బుధవారం విచారణ చేపట్టారు. ఈ ఏడాది అక్టోబరు, నవంబరులో నరసన్నపేట సీహెచ్‌సీలో సదరం ధ్రువపత్రాల రీ వెరిఫికేషన్ కార్యక్రమం జరిగింది. ఈ సమయంలో 40శాతం అంగవైకల్యం గల అభ్యర్థులను కొందరు వైద్య సిబ్బంది కలిసి రీ వెరిఫికేషన్‌లో ‘మీ వైకల్య శాతం’ తగ్గిపోతుందని భయపెట్టారు. డబ్బులు ఇస్తే అంగవైకల్య శాతం తగ్గకుండా చేస్తామని చెప్పారు. ఈ మేరకు కొందరి నుంచి భారీస్థాయిలో డబ్బులు గుంజారు. ఈ విషయాన్ని ఆసుపత్రిలో సదరం పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యుల దృష్టికి కొందరు బాధితులు తీసుకువచ్చారు. దీంతో ఆర్థోఫెడిక్ వైద్యుడు బలగ రమణరావు జిల్లా ఆసుపత్రుల సమన్వయకర్తకు, రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ అధికారులకు సిబ్బంది చేతివాటంపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాలతో బుధవారం టెక్కలి జిల్లా కేంద్ర ఆసుపత్రి సూపరింటెండెంట్ సూర్యరావు విచారణ చేపట్టారు. నరసన్నపేట సీహెచ్‌సీకి చెందిన రెగ్యులర్ ఉద్యోగితో పాటు ఔట్ సోర్సింగ్‌లో పనిచేస్తున్న మరొక ఉద్యోగి, మాకివలస సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ కలసి బాధితుల నుంచి భారీస్థాయిలో డబ్బులు గుంజినట్లు విచారణలో తేలింది. సమగ్ర నివేదికను డీసీహెచ్‌కు అందజేస్తామని విచారణ అధికారి డాక్టర్ సూర్యరారావు తెలిపారు. ఈ విచారణలో ఆర్థోఫెడిక్ వైద్యుడు రమణరావు తదితరులు పాల్గొన్నారు.