Tamarind : ‘చింత’ తీరింది!
ABN , Publish Date - Apr 12 , 2025 | 12:03 AM
Tamarind Yield Crop Production చింతపండు రైతులకు పంట పండింది. ఈ ఏడాది దిగుబడి తగ్గినా, మార్కెట్‌లో ధర పెరగడంతో రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. జిల్లాలోని సీతంపేట, మెళియాపుట్టి, మందస, నందిగాం, కొత్తూరు, పాతపట్నం, పలాస తదితర మండలాల్లో అధికంగా చింతచెట్లు ఉన్నాయి.

దిగుబడి తగ్గినా.. కలిసివస్తున్న ధర
గ్రామాల్లోకి వెళ్లి కొనుగోలు చేస్తున్న వ్యాపారులు
జీసీసీకి ఇచ్చేందుకు గిరిజనుల విముఖత
మెళియాపుట్టి మండలం అడ్డివాడ గ్రామానికి చెందిన గిరిజన రైతు సవర గణేష్‌కు కొండపైన సుమారు 20 చింత చెట్లు ఉన్నాయి. వీటి ద్వారా ఏటా 20 క్వింటాళ్ల చింతపండు దిగుబడి వస్తుంది. ఈ ఏడాది దిగుబడి తగ్గడంతో 14 క్వింటాళ్ల చింతపండు మాత్రమే పండింది. గత వైసీపీ ప్రభుత్వం జీసీసీ ద్వారా కిలో చింతపండును రూ.32.40 కొనుగోలు చేసింది. ప్రస్తుత ప్రభుత్వం రూ.36కి కొనుగోలు చేస్తోంది. కాగా.. బయట వ్యాపారులు ఇంటి దగ్గరకే వచ్చి కిలో రూ.49చొప్పున చెల్లిస్తున్నారు. మార్కెట్‌లో రూ.50 నుంచి రూ.60 వరకు విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో జీసీసీకి ఇవ్వకుండా వ్యాపారులకే తాను చింతపండు విక్రయించానని గణేష్ తెలిపారు. ఈ ఏడాది దిగుబడి తగ్గినా.. మార్కెట్‌లో ధర అధికంగా ఉండడం సంతోషంగా ఉందన్నారు.
...................
మెళియాపుట్టి మండలం గూడ గ్రామస్థులకు ఉమ్మడి అటవీ ప్రాంతాలో సుమారు 70 చింతచెట్లు ఉన్నాయి. వీటి ద్వారా ఏటా 10క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. ప్రతి ఏడాదీ జీసీసీ అధికారులు చింతపండును కొనుగోలు చేస్తారని గ్రామస్థులు ఎదురుచూసేవారు. ఈ ఏడాది పంట దిగుబడి తగ్గడం.. మార్కెట్‌లో ధర పెరిగింది. దీంతో కొంతమంది వ్యాపారులు గిరిజన గ్రామాలకు వెళ్లి చింతపండును కొనుగోళ్లు చేస్తున్నారు. దీంతో జీసీసీ అధికారులు కొనుగోలు చేస్తామన్నా చింతపండు లేదు.
...................
మెళియాపుట్టి, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): చింతపండు రైతులకు పంట పండింది. ఈ ఏడాది దిగుబడి తగ్గినా, మార్కెట్‌లో ధర పెరగడంతో రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. జిల్లాలోని సీతంపేట, మెళియాపుట్టి, మందస, నందిగాం, కొత్తూరు, పాతపట్నం, పలాస తదితర మండలాల్లో అధికంగా చింతచెట్లు ఉన్నాయి. సీతంపేట ఐటీడీఏ పరిధిలో 52 హెక్టార్లలో చింతచెట్లు ఉండగా.. వీటి ద్వారా ఏటా సుమారు 468 మెట్రిక్ టన్నుల వరకు చింతపండు దిగుమతి అవుతోంది. జిల్లాలో సుమారు 6.81లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఒక్కో కుటుంబానికి ఏడాదికి దాదాపు 25 కిలోల చింతపండు అవసరం ఉంటుంది. దీన్నిబట్టి చూస్తే ఏడాదికి జిల్లాకు 17,025 మెట్రిక్ టన్నుల చింత పండు అవసరం. కాగా జిల్లాలో సరిపడా దిగుబడి లేక బయట జిల్లాల నుంచి చింతపండు దిగుబడి చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. గతంలో హుద్‌హుద్, తితలీ తుఫాన్ల సమయంలో కొండలపై ఉన్న చాలా చింతచెట్లు నేలకొరిగాయి. వాటి స్థానంలో అటవీశాఖ ద్వారా మొక్కలు పెంపకం చేపట్టాలి. కానీ నిధుల కొరత కారణంగా ఆశించినస్థాయిలో మొక్కలు నాటలేదు. దీంతో చింతపండు దిగుబడి తగ్గింది.
జిసీసీ కంటే.. వ్యాపారులు ముందంజ
గిరిజన సహకార సంస్థ(జీసీసీ) ద్వారా గిరిజనులు పండించే పంటలను అధికారులు కొనుగోలు చేసి వారికి గిట్టుబాటు కల్పించేవారు. గత వైసీపీ ప్రభుత్వం కిలో చింతపండుకు రూ.32.40 చొప్పున కొనుగోలు చేసింది. ప్రస్తుత ప్రభుత్వం ఈ ధరను రూ.36కి పెంచింది. కానీ ఈ ఏడాది దిగుబడి తగ్గడంతో మార్కెట్‌లో ధర కిలోరూ.60 వరకు పలుకుతోంది. దీంతో వ్యాపారులు నేరుగా గిరిజనుల వద్దకు వెళ్లి కిలో రూ.50 వరకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో గిరిజన రైతులకు కలిసివస్తోంది. జీసీసీ అధికారులు కొనుగోలు చేసేవరకూ వేచి చూడకుండా వ్యాపారులకు చింతపండును విక్రయిస్తున్నారు.
ఆశించినస్థాయిలో దిగుబడి లేక..
పలాస మండలం పొత్రియ, బాపనూరు, గట్టూరు, కొఠారింగి తాళభద్ర గిరిజన గ్రామాల్లో చింతచెట్లు అధికంగా ఉన్నాయి. ఆయా గ్రామాల రైతుల చింత పంటపై ఆధారపడుతుంటారు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల కారణంగా ఆశించిన స్థాయిలో దిగుబడి రాలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. మార్కెట్‌లో ధర బాగున్నా.. తమకు ఫలితం లేకపోతోందని పేర్కొంటున్నారు. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లాలోని జిరాంగో, లంజిభద్ర వంటి గిరిజన ప్రాంతాలతోపాటు కాశీనగర్, గురండి, గుసాని ప్రాంతాలలో చింతచెట్లు అధికంగా ఉన్నాయి. అక్కడి నుంచి చింతపండును కొనుగోలు చేసి జిల్లాలోని సంతల్లో విక్రయిస్తుంటారు. ఈ ఏడాది స్థానికంగా పంట లేకపోవడంతో వ్యాపారులు ధర పెంచి విక్రయిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఒడిశా నుంచి చింతపండును కొనుగోలు చేయాల్సి వస్తోందని పలువురు పేర్కొంటున్నారు.
లక్ష్యానికి మించి కొనుగోలు
ఈ ఏడాది గిరిజన ఉత్పత్తులు లక్ష్యానికి మించి కొనుగోలు చేశాం. రూ.31.50 కోట్ల గిరిజన ఉత్పత్తులు కొనుగోలు చేయాలని నిర్ణయించాం. ఎన్నడూ లేనివిధంగా ఈ ఏడాది రూ.43.97 కోట్ల వరకు ఉత్పత్తులు కొనుగోలు చేశాం. ఇప్పటివరకూ 200 క్వింటాళ్ల చింతపండు కొనుగోలు చేశాం. దిగుబడి తగ్గడం వల్ల ధర పెరిగింది.
- నర్శింహులు, జీసీసీ మేనేజర్, పాతపట్నం