Maoists: మావోయిస్టులతో చర్చించాలి
ABN , Publish Date - May 24 , 2025 | 11:45 PM
Maoists Peace talks సీపీఐ(మావోయిస్టు పార్టీ)తో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని పౌరసంఘాల నేతలు డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలోని ఏపీఎన్జీవో భవన్‌లో శనివారం సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, సీపీఐ, సీపీఎం, సీపీఐ లిబరేషన్, సీపీఐ జనశక్తి, ప్రగతిశీల మహిళా శక్తి సంఘం.. ఇలా పలు ప్రజాసంఘాల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి వివిధ తీర్మానాలు చేశారు.
రౌండ్‌టేబుల్ సమావేశంలో పౌరసంఘాల డిమాండ్
శ్రీకాకుళం, మే 24(ఆంధ్రజ్యోతి): సీపీఐ(మావోయిస్టు పార్టీ)తో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలని పౌరసంఘాల నేతలు డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలోని ఏపీఎన్జీవో భవన్‌లో శనివారం సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ, సీపీఐ, సీపీఎం, సీపీఐ లిబరేషన్, సీపీఐ జనశక్తి, ప్రగతిశీల మహిళా శక్తి సంఘం.. ఇలా పలు ప్రజాసంఘాల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి వివిధ తీర్మానాలు చేశారు. ప్రజాసంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ ‘సీపీఐ మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ నంబాల కేశవరావుతోసహా అనేక మందిని మోదీ ప్రభుత్వం హత్య చేసింది. ఇది ఫాసిస్టు చర్య. మృతదేహాలను వారి బంధువులకు అప్పగించాలని కోరుతూ .. శాంతి చర్చలకు సిద్ధమైన మావోయిస్టు పార్టీతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరపాలి. కేశవరావుతో సహా మృతుల భౌతికకాయాలను వారి బంధువులకు అప్పగించాలి. నారాయణపూర్ మారణకాండతో సహా అడవుల్లో సాగిస్తున్న మారణ హోమంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ చేయాలి. ఆపరేషన్ కగార్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలి’ అని డిమాండ్ చేశారు. బూటకపు ఎదురు కాల్పుల పేరిట జరిగే మారణకాండపై నిరసన వ్యక్తం చేసే ప్రజాస్వామిక హక్కును కాలరాస్తున్న కూటమి ప్రభుత్వానిది నిరంకుశ విధానమని ఆరోపించారు. ఖనిజ సంపదలు, ప్రకృతి వనరులతో కూడిన అడవులను బడా కార్పొరేటర్లకు అప్పగించే ఆపరేషన్‌కు వ్యతిరేకంగా సాగుతున్న ప్రజాస్వామ్య ఉద్యమానికి సంఘీభావం ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. సమావేశంలో సీపీఐ ఎంఎల్ న్యూడెమొక్రసీ జిల్లా కమిటీ కార్యదర్శి తాండ్ర ప్రకాష్, జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు, రాష్ట్ర అధికార ప్రతినిధి పి.ప్రసాద్, చిట్టిపాటి వెంకటేశ్వర్లు, సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, సీపీఎం జిల్లా కార్యదర్శి దుప్పల గోవిందరావు, లిబరేషన్ జిల్లా నాయకులు రామారావు, గురవయ్య, ఎం.లక్ష్మి, మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేవీ జగన్నాథరావు, అమరవీరుల బంధుమిత్రుల కమిటీ సభ్యుడు కోదండం, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.