తీరప్రాంత భద్రతకు పటిష్ట చర్యలు తీసుకోండి
ABN , Publish Date - Aug 01 , 2025 | 12:12 AM
జిల్లాలోని బారువ, కళింగపట్నం, భావనపాడు తదితర తీరప్రాంతాల భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు.
- అనుమతి లేని బోట్లను పోర్టులోకి అనుమతించొద్దు
- కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
శ్రీకాకుళం కలెక్టరేట్, జూలై 31(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని బారువ, కళింగపట్నం, భావనపాడు తదితర తీరప్రాంతాల భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన జిల్లా స్థాయి సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ‘సముద్రంపై పనిచేసే ప్రతీ మత్స్యకారుడు భద్రతతో కూడిన లైఫ్ జాకెట్ విధిగా ధరించేలా చర్యలు తీసుకోవాలి. మత్స్యకారులకు లైఫ్ జాకెట్లను రాయితీపై అందిస్తాం. అవి లేకుండా సముద్రంలోకి వెళ్లే వారిపై చర్యలు తప్పవు. సబ్‌మిత్రా యాప్ ద్వారా ఫిషింగ్ బోట్ల ట్రాకింగ్ చేయాలి. కొన్ని తీరప్రాంతాల్లో నెట్ కనెక్టివిటీ కోసం ఎన్‌ఐసీ జిల్లా సమాచార అధికారితో సమన్వయం చేసుకోవాలి. ఇతర పోర్టుల నుంచి బోట్లు మానవీయ కారణాలతో వచ్చినా సరే, నిర్వాహక అనుమతి లేనిదే పోర్టులోకి అనుమతించరాదు. బీచ్‌ల వద్ద ప్రమాదాల నివారణకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి. ఆదివారాలు, సెలవు దినాల్లో గజ ఈతగాళ్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. గ్రామీణ మత్స్యకార ప్రాంతాల్లో వాలీబాల్, నెట్ తదితర క్రీడాసామగ్రిని అందించాలి. మెడికల్ క్యాంపులు నిర్వహించాలి. మెరైన్ పోలీసు స్టేషన్‌లకు బయో ఫెన్సింగ్ విధానంలో రక్షణ గోడ ఏర్పాటు చేసుకోవాలి. తీర ప్రాంతాల్లో వాచ్ టవర్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించాలి.’ అని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి, మెరైన్ ఎస్సీ ఇండియన్ నేవీ స్టాఫ్ ఆఫీసర్ ఆదిత్య పాండే, డీఆర్వో ఎం.వెంకటేశ్వరరావు, శ్రీకాకుళం ఆర్డీవో సాయి ప్రత్యూష, విపత్తుల నిర్వహణ శాఖ డీపీఎం రాము, మత్స్యశాఖ డీడీ సత్యనారాయణ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.