Share News

సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి

ABN , Publish Date - Sep 06 , 2025 | 11:55 PM

ప్రజల నుంచి వచ్చిన అర్జీలపై అధికారులు తక్షణం స్పందించి వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు.

 సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలి
ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు

-మంత్రి అచ్చెన్నాయుడు

టెక్కలి, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): ప్రజల నుంచి వచ్చిన అర్జీలపై అధికారులు తక్షణం స్పందించి వారి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. శనివారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ప్రజా దర్బార్‌ కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గం నుంచి పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చి తమ సమస్యలపై మంత్రి అచ్చెన్నకు అర్జీలు అందజేశారు. టెక్కలి వెంకటేశ్వరకాలనీ మూడోలైన్‌తో పాటు కొత్తమ్మతల్లి వీధికి సీసీ రోడ్లు, కుళాయిలు లేవని బెండి కవిత, ఎస్‌.అరుణ, అక్కవరం-చింతలగార మధ్య రోడ్డు పూర్తిచేయాలని పొన్నాడ నాగు, మంచాల సింహాచలం వినతులు అందజేశారు. తమ గ్రామానికి యూరియా సరఫరా చేయాలని నందిగాం మండలం తమలాపురం రైతులు, నౌపడా-మెళియాపుట్టి రోడ్డులో వంశధార కాలువ పక్కనున్న విద్యుత్‌ స్తంభాలన్నీ వాలిపోయాయని, వాటిని సరిచేయాలని టెక్కలికి చెందిన లైసెట్టి దుర్గారావు, రావివలస చెరువు వద్ద నిర్మాణం జరుగుతున్న డ్రైనేజ్‌ పనులు సాంకేతికత పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఎల్‌ఎల్‌ నాయుడు మంత్రిని కోరారు. నందిగాం మండలం కల్లాడ గ్రామంలో కొండపోరంపోగు పట్టాలు మంజూరు చేయాలని పలువురు అర్జీ అందజేశారు. రావివలస పంచాయతీ చిన్ననారాయణపురంలో స్టాక్‌పాయింట్‌ ఏర్పాటు చేయాలని మాజీ సర్పంచ్‌ బడే జగదీష్‌, స్థానిక పోలీస్‌స్టేషన్‌ వెనుక ఎన్టీఆర్‌ కాలనీకి వెళ్లే రహదారికి సీసీ రోడ్లు మంజూరు చేయాలని పలు వురు అర్జీ అందజేశారు. ఆ అర్జీలను ఆయా శాఖల అధికారులకు వెంటవెంటనే మంత్రి అందజేస్తూ సమస్యలు పరిష్కారానికి చొరవ చూపాలని దిశ నిర్దేశించారు. ఆయనతో పాటు నాయకులు బగాది శేషగిరి, పినకాన అజయ్‌కుమార్‌, ఎల్‌ఎల్‌ నాయుడు, హనుమంతు రామకృష్ణ, లవకుమార్‌, కామేసు, సుందరమ్మ, ప్రసాద్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Updated Date - Sep 06 , 2025 | 11:55 PM