Share News

ఆమెను చంపేశారా?

ABN , Publish Date - Dec 03 , 2025 | 11:39 PM

married woman death ఎచ్చెర్ల మండలం కేశవరావుపేట పరిధిలోని జాతీయ రహదారి పక్కన బుధవారం ఉదయం వివాహిత గురుగుబెల్లి తులసీరత్నం(42) మృతదేహం అనుమానాస్పద స్థితిలో పడి ఉంది.

ఆమెను చంపేశారా?
గురుగుబెల్లి తులసీరత్నం (ఫైల్‌)

  • వివాహిత అనుమానాస్పద మృతి

  • మెడకు తాడు బిగించినట్లు ఆనవాళ్లు

  • జాతీయ రహదారి పక్కన మృతదేహం

  • ఎచ్చెర్ల, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి): ఎచ్చెర్ల మండలం కేశవరావుపేట పరిధిలోని జాతీయ రహదారి పక్కన బుధవారం ఉదయం వివాహిత గురుగుబెల్లి తులసీరత్నం(42) మృతదేహం అనుమానాస్పద స్థితిలో పడి ఉంది. పొందూరు మండలం పిల్లలవలస గ్రామానికి చెందిన తులసీరత్నానికి ఆమదాలవలస మండలం కొత్తవలసకి చెందిన కూర్మారావుతో కొన్నేళ్ల కిందట వివాహమైంది. వీరు కుమారుడు వెంకటరమణ, కుమార్తె సంధ్యారాణితో కలిసి శ్రీకాకుళం నగరం ఏఎస్‌ఎన్‌ కాలనీలో 14 ఏళ్లుగా అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. కూర్మారావు ఫినాయిల్‌ వ్యాపారం చేసేవారు. ఇటీవల అనారోగ్యం కారణంగా ఇంటి వద్దనే ఉంటున్నారు. మంగళవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో సీతారత్నం వైద్యుడి వద్దకు వెళ్తానని చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చారు. రాత్రి 8.30 గంటలైనా ఆమె ఇంటికీ చేరలేదు. ఆమెకు ఫోన్‌ చేసినా సమాధానం లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఆమె ఆచూకీ కోసం బంధువులను ఆరా తీశారు. అయినా సమాచారం లేదు. దీంతో శ్రీకాకుళంలో రెండో పట్టణ పోలీసుస్టేషన్‌కు ఆమె కుమారుడు వెంకటరమణ సమాచారం ఇచ్చారు.

  • ఇదిలా ఉండగా, బుధవారం ఉదయం తులసీరత్నం మృతదేహం ఎచ్చెర్ల మండలం కేశవరావుపేట సమీపంలోని జాతీయ రహదారి సర్వీసు రోడ్డు పక్కన పడి ఉంది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఎచ్చెర్ల, జేఆర్‌ పురం, జి.సిగడాం ఎస్‌ఐలు జి.లక్ష్మణరావు, ఎం.చిరంజీవి, వి.సందీప్‌కుమార్‌ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. క్లూస్‌ టీమ్‌ వివరాలు సేకరించింది. పోలీసు జాగిలాలు కూడా స్థలాన్ని పరిశీలించి.. కింతలి మిల్లు జంక్షన్‌ వరకు వచ్చి ఆగాయి. మృతురాలి మెడపై తాడు బిగించినట్టు ఆనవాళ్లు స్పష్టంగా కన్పిస్తున్నాయి. శ్రీకాకుళం సర్వజనాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈమెది హత్యగా ప్రాథమికంగా భావిస్తున్నా పోస్టుమార్టం నివేదికలో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ లక్ష్మణరావు తెలిపారు.

Updated Date - Dec 03 , 2025 | 11:39 PM