Share News

గర్భిణులకు అండగా..

ABN , Publish Date - Dec 14 , 2025 | 11:39 PM

Benefits of PM Matru Vandana Yojana గర్భిణులకు ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం కింద ఆర్థికసాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ప్రస్తుతం అంగన్‌వాడీ సిబ్బంది గ్రామాలతోపాటు పట్టణాల్లో సర్వే చేపడుతున్నారు.

గర్భిణులకు అండగా..

ప్రధానమంత్రి మాతృవందన యోజనతో లబ్ధి

వివరాలు నమోదు చేసుకుంటే నగదు ప్రోత్సాహకాలు

జిల్లావ్యాప్తంగా కొనసాగుతున్న సర్వే

కాశీబుగ్గ, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): గర్భిణులకు ప్రధానమంత్రి మాతృవందన యోజన పథకం కింద ఆర్థికసాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ప్రస్తుతం అంగన్‌వాడీ సిబ్బంది గ్రామాలతోపాటు పట్టణాల్లో సర్వే చేపడుతున్నారు. గర్భిణులు ఈ పథకంలో నమోదయితే తొలి కాన్పులో రూ.5వేలు, రెండో కాన్పులో రూ.6వేలు అందే అవకాశం ఉంది. జిల్లాలో 16 ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 3,358 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో మెయిన్‌ కేంద్రాలు 2,759 కాగా.. మినీకేంద్రాలు 599 ఉన్నాయి. 3,319 మంది కార్యకర్తలు, 2,690 మంది సహాయకులు పనిచేస్తున్నారు. వీరంతా ప్రధానమంత్రి మాతృత్వ యోజన పథకం కింద వివరాలు నమోదు చేస్తున్నారు. పథకం కింద గర్భిణీలు వివరాలు నమోదు చేసుకున్న ఐదు నెలల లోపు రూ.2వేలు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం సూచించిన సమయానికి టీకాలు వేయించుకొని వైద్య పరీక్షలు పూర్తిచేస్తే మరో రూ.2 వేలు, ప్రసవ సమయంలో మరో రూ.1000 అందిస్తారు. రెండో కాన్పులో ఆడబిడ్డ జన్మనిస్తే పుట్టిన మూడున్నరేళ్ల తరువాత రూ.6వేలను తల్లుల ఖాతాలో జమ చేస్తారు. గర్భిణులు ఈ పథకంలో నమోదు కావాలంటే ఆధార్‌, రేషన్‌ కార్డులతోపాటు బ్యాంకు ఖాతా పుస్తకం తప్పనిసరి. గర్భం దాల్చిన ప్రతిఒక్కరూ దగ్గర్లోని అంగన్‌వాడీ కేంద్రాలకు సంప్రదించి, పేర్లు నమోదు చేసుకోవాలని ఐసీడీఎస్‌ అధికారులు సూచిస్తున్నారు.

సరైన పత్రాలు ఇస్తేనే..

జిల్లావ్యాప్తంగా గర్భిణుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. అక్టోబరు 31 వరకూ 23,464 దరఖాస్తులు వచ్చాయి. కానీ నవంబరు నాటికి 22,486 దరఖాస్తులు మాత్రమే నమోదయ్యాయి. అయితే సరైన సమాచారం, పత్రాలు ఇవ్వకపోవడంతో మిగిలిన దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. దరఖాస్తుదారులు సరైన పత్రాలు పొందుపరచాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

వినియోగించుకోవాలి...

ప్రధానమంత్రి మాతృత్వ యోజన పథకాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలి. ఇందులో నమోదైన వెంటనే నిబంధనల మేరకు అన్నిరకాల గుర్తింపులు లభిస్తాయి. ట్రీకాలతోపాటు నగదు ప్రోత్సాహకాలు అందుతాయి. దీనిని గర్భిణులు వినియోగించుకోవాలి. దగ్గరలో ఉన్న అంగన్‌ వాడీ కేంద్రాల్లో పేర్లు నమోదు చేయించుకోవాలి.

- విమల, ఐసీడీఎస్‌ పీడీ, శ్రీకాకుళం

Updated Date - Dec 14 , 2025 | 11:39 PM