Share News

దివ్యాంగులకు అండగా ఉంటాం

ABN , Publish Date - Jun 28 , 2025 | 12:14 AM

Disability welfare programs దివ్యాంగులను అన్ని విధాలా ఆదుకుంటామని, ఎల్లప్పుడూ అండగా ఉంటామని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాల్‌లో దివ్యాంగులకు పరికరాలను పంపిణీ చేశారు.

దివ్యాంగులకు అండగా ఉంటాం
దివ్యాంగురాలికి బ్యాటరీ ట్రై సైకిల్‌, హెల్మెట్‌ను అందజేస్తున్న కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు

  • కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు

  • 803 మందికి 1,238 పరికరాల పంపిణీ

  • శ్రీకాకుళం కలెక్టరేట్‌, జూన్‌ 27(ఆంధ్రజ్యోతి): దివ్యాంగులను అన్ని విధాలా ఆదుకుంటామని, ఎల్లప్పుడూ అండగా ఉంటామని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాల్‌లో దివ్యాంగులకు పరికరాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఎయిర్‌ పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ) ఆధ్వర్యంలో ఆలింకో సంస్థ సహకారంతో జిల్లాలో 803 మంది దివ్యాంగులకు రూ.3.20కోట్ల విలువైన 1,238 పరికరాలను పంపిణీ చేస్తున్నాం. జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించి.. దివ్యాంగులకు ఏయే ఉపకరణాలు అవసరమో గుర్తించాం. అందుకు అనుగుణంగా 353 బ్యాటరీ సైకిళ్లతోపాటు వీల్‌ చైర్‌లు, వినికిడి పరికరాలు, కృత్రిమ అవయవాలు తదితరవి పంపిణీ చేయడం ఆనందంగా ఉంది. మీ కష్టం నాకు తెలుసు. మీ సంకల్ప బలానికి సెల్యూట్‌. మీకు ఏ సమస్య వచ్చినా.. వెంటనే స్పందిస్తా. మీరు ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాల’ని పిలుపునిచ్చారు. దివ్యాంగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రతీనెలా మూడో శుక్రవారం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ‘స్వాభిమాన్‌’ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని సూచించారు. దివ్యాంగుల పరికరాలను బాగు చేసేందుకు శ్రీకాకుళంలో త్వరలోనే ఒక సర్వీసింగ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ మాట్లాడుతూ.. దివ్యాంగులు సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని.. జీవితంలో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. సమస్యలపై ప్రతీనెలా మూడో శుక్రవారం నిర్వహిస్తున్న గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేస్తే.. వాటి పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు. ఎమ్మెల్యే గొండు శంకర్‌ మాట్లాడుతూ.. దివ్యాంగుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, పౌరవిమానయాన సంస్థ ఛైర్మన్‌ విపిన్‌కుమార్‌, హెచ్‌ సభ్యుడు శ్రీనివాస్‌, జనరల్‌ మేనేజర్‌ సంజయ్‌సింగ్‌, జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, ఇండియా టర్న్స్‌ పింక్‌ సంస్థ షౌండర్‌ ఆనంద్‌ కుమార్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ చౌదరి అవినాష్‌, డీసీసీబీ చైర్మన్‌ ఎస్‌.సూర్యం, వంశధార చైర్మన్‌ అరవల రవీంద్ర, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పీఎంజే బాబు, నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 28 , 2025 | 12:14 AM