Share News

ఉద్యాన పంటలకు ఊతం

ABN , Publish Date - May 13 , 2025 | 12:16 AM

Horticulture crops Government subsidy ఉద్యాన సాగును విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుతం ప్రత్యేక దృష్టి సారించింది. ఉద్యాన పంటలు పండించే రైతులకు భారీగా రాయితీలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వంతో కలిసి చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రం 40 శాతం, కేంద్రం 60 శాతం మేర ఆర్థికసాయం అందించి రైతులను ప్రోత్సహిస్తున్నాయి.

ఉద్యాన పంటలకు ఊతం
దీనబందుపురంలో సాగు చేస్తున్న డ్రాగన్‌ ఫ్రూట్‌

  • భారీగా రాయితీలు పెంచిన ప్రభుత్వం

  • సాగు విస్తీర్ణం పెంపునకు చర్యలు

  • జిల్లాకు రూ.2.62 కోట్లు కేటాయింపు

  • రైతుల్లో ఆనందం

  • మెళియాపుట్టి మండలం నందవ గ్రామానికి చెందిన ఎస్‌.సూర్యనారాయణ అనే గిరిజన రైతు గతేడాది అర ఎకరా పొలంలో టమాట, రెండు ఎకరాల్లో తీపి గుమ్మడి పంట వేశాడు. ఈ పంటలకు గతంలో రూ.20వేలు రాయితీ అందేది. ఈ ఏడాది ప్రభుత్వం రాయితీని రూ.30వేలకు పెంచింది. దీంతో ఈ ఏడాది అదనంగా ఉద్యాన పంటలను సాగు చేయడానికి సూర్యనారాయణ సన్నద్ధమవుతున్నాడు.

  • మెళియాపుట్టి మండలం దీనబంధుపురంలో జగన్‌ అనే రైతు గత ఏడాది ఎకరా భూమిలో డ్రాగన్‌ ఫ్రూట్‌ పండించాడు. గతంలో దీనికి రూ.30వేలు రాయితీ ఇచ్చారు. ఈ ఏడాది నుంచి రూ.1.62లక్షలకు రాయితీని పెంచారు. దీంతో ఈ ఏడాది అదనంగా డ్రాగన్‌ ఫ్రూట్‌ను సాగు చేసేందుకు పొలాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. (9ఎంఎల్‌పి2)

  • మెళియాపుట్టి మండలం మర్రిపాడు గ్రామానికి చెందిన నక్క వాసు అనే రైతు ఈ ఏడాది రెండు ఎకరాల్లో డ్రాగన్‌ ఫ్రూట్‌తో పాటు పూల మొక్కలు పెంచడానికి సిద్ధమవున్నాడు. ప్రభుత్వం ఉద్యాన పంటలకు గిట్టుబాటు కల్పించడంతో పాటు రాయితీ పెంచడమే దీనికి కారణమని వాసు చెబుతున్నాడు.

  • కంచిలి/మెళియాపుట్టి, మే 12(ఆంధ్రజ్యోతి): ఉద్యాన సాగును విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుతం ప్రత్యేక దృష్టి సారించింది. ఉద్యాన పంటలు పండించే రైతులకు భారీగా రాయితీలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వంతో కలిసి చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రం 40 శాతం, కేంద్రం 60 శాతం మేర ఆర్థికసాయం అందించి రైతులను ప్రోత్సహిస్తున్నాయి. పంటలను బట్టి రాయితీలను వేర్వేరుగా అందించనున్నారు. దీంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. జిల్లాలో ప్రస్తుతం 1.10లక్షల ఎకరాల్లో ఉద్యానవన పంటలను రైతులు సాగు చేస్తున్నారు. వీటిద్వారా ఏటా 1.55 మెట్రిక్‌ టన్నుల దిగుబడి వస్తున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 14,195 ఎకరాల్లో ఉద్యాన పంటల విస్తీర్ణం పెంచడానికి రూ.2.62 కోట్లు కేటాయించారు. ఉద్యాన రైతులకు సహాయం అందజేసి సాగు విస్తీర్ణం పెంచాలని అవగాహన కల్పిస్తున్నారు. వారికి అవసరమైన మొక్కలను నర్సరీల నుంచి తెప్పించి సబ్సిడీపై అందిస్తున్నారు. సాగుపై రైతులకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో డిమాండ్‌ అధికంగా ఉన్న పూలు, పండ్ల సాగుకు భారీ రాయితీలు ఇస్తూ, ప్రోత్సాహం అందిస్తున్నారు. ఇటీవల ప్రజలు ఎక్కువగా ఉపయోగిస్తున్న డ్రాగన్‌ఫ్రూట్‌కు గతంలో ఎకరాకు రూ.30వేలు రాయితీ అందించగా, ఈ ఏడాది భారీగా రూ.1.62లక్షలకు పెంచారు. ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును సద్వినియోగం చేసుకుంటే రైతులు అధిక లాభాలను అర్జించవచ్చు.

  • డ్రిప్‌ పరికరాలు కూడా..

  • ఉద్యాన పంటల సాగుకు అవసరమైన డ్రిప్‌ పరికరాలను కూడా రాయితీపై అందించనున్నారు. ఐదు ఎకరాల్లోపు భూమి ఉన్న ఎస్సీ, ఎస్టీ రైతులకు 100శాతం, బీసీ, ఓసీ రైతులకు 90శాతం రాయితీ కల్పించనున్నారు. ఐదు దాటించి పది ఎకరాల వరకు ఉంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులకు 70శాతం, పది ఎకరాలు పైబడి ఉంటే 50 శాతం రాయితీ ఇవ్వనున్నారు.

  • సాగు విస్తీర్ణం లక్ష్యం ఇలా..

  • ప్రభుత్వం వివిధ శాఖల ద్వారా ఉద్యాన సాగు పెంపునకు వేర్వేరు పథకాలను రూపొందించింది. జిల్లాలో 14,195 ఎకరాల్లో విస్తీర్ణం పెంచాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. సమగ్ర ఉద్యాన అభివృద్ధి మిషన్‌ ఆధ్వర్యంలో 995 ఎకరాలు, రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన ద్వారా 150ఎకరాలు, కేంద్ర ఆయిల్‌పామ్‌ మిషన్‌ ద్వారా 2వేల ఎకరాలు, జాతీయ వెదురు మిషన్‌ పథకం ద్వారా 25 ఎకరాలు, పంటల వైవిద్యీకరణ పథకం ద్వారా 150 ఎకరాలు, ఉపాధి హామీ పథకం ద్వారా తోటల విస్తరణ కింద 3,150 ఎకరాలు, కొబ్బరి విస్తరణలో భాగంగా 750 ఎకరాలకు రాయితీ అందించనున్నారు. సాగు చేసేందుకు అనువైన 8,875 ఎకరాల బీడు భూములను గుర్తించనున్నారు. వాటిని సాగు చేసే రైతులకు ఆర్థికసాయాన్ని అందించనున్నారు.

  • దరఖాస్తులు ఇలా..

  • ఉద్యానవన పంటల రాయితీ పొందాలంటే రైతులకు ఐదు ఎకరాల్లోపు భూమి తప్పనిసరిగా ఉండాలి. రైతులు తమ పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్‌, బ్యాంకు ఖాతా జిరాక్స్‌, ఒక పాస్‌ ఫొటోతో సమీప రైతు సేవా కేంద్రాల్లో గానీ, ఉద్యానవన శాఖ, వ్యవసాయ శాఖ కార్యాలయాల్లో గానీ దరఖాస్తు చేసుకోవాలి. వాటిని క్షేత్రస్థాయిలో సిబ్బంది పరిశీలిస్తారు. అనంతరం అర్హులైన రైతుల ఖాతాకు నేరుగా రాయితీ సొమ్ము జమ చేస్తారు.

  • రాయితీ ఇలా..

  • -------------------------------------------------------------------------------

  • పంట రకం గత ఏడాది(రూ.) ప్రస్తుతం(రూ.)

  • -------------------------------------------------------------------------------

  • డ్రాగన్‌ ఫ్రూట్‌ 30 వేలు 1,62,000

  • జీడి 12 వేలు 18 వేలు

  • మామిడి 7,980 30 వేలు

  • జామ 17,599 48 వేలు

  • కొబ్బరి 12వేలు 18 వేలు

  • అరటి 30 వేలు 42 వేలు

  • పూల తోటలు 16 వేలు 20 వేలు

  • (బంతి, చేమంతి, కనకాంబరం)

  • కూరగాయలు 20 వేలు 24 వేలు

  • (సంకరజాతి)

  • నిమ్మ 9,602 30 వేలు

  • పైనాపిల్‌ 26 వేలు 26 వేలు

  • బొప్పాయి 18 వేలు 18 వేలు

    .................................................

  • రైతులకు మేలు

    ప్రస్తుతం ఉద్దాన రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ సమయంలో ప్రభుత్వాలు ఉద్యానవన సాగు పెంపుపై దృష్టి సారించడం ఎంతో సంతోషం. రాయితీలు అందించి, సాగుకు సహాయం చేయడం వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుంది.

    - బొడ్డ వైకుంఠరావు, రైతు, పెద్దకొజ్జిరియా

    ......................

  • ఆనందంగా ఉంది

    గతంలో ఉద్యానవన పంటలు సాగు చేసినా రాయితీలు సరిపోక అప్పులు పాలయ్యాం. ఇప్పుడు ప్రభుత్వం రాయితీ పెంచడం ఆనందంగా ఉంది. నేను ఏటా వివిధ పూలను సాగు చేస్తుంటా. పెంచిన రాయితీతో ప్రయోజనం కలుగనుంది.

    - ఎస్‌.నారాయణరావు, బందపల్లి, గిరిజన రైతు, మెళియాపుట్టి

    ......................

  • ఎంతో ఉపయోగం

    రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం నూతన పథకాలు తీసుకురావడం సంతోషంగా ఉంది. గిరిజనులకు అధికంగా మెట్టు భూములే ఉన్నాయి. అటువంటి రైతులకు రాయితీల వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది.

    - బి.దినకర్‌రావు, మాజీ వైస్‌ ఎంపీపీ, మెళియాపుట్టి

    ......................

  • అవగాహన కల్పిస్తున్నాం

    గతంలో ఎప్పుడూ లేనంతగా ఉద్యాన పంటలకు రాయితీలు ఇస్తున్నాం. నీటి సౌకర్యం ఏర్పాటు చేసుకొని, ఉద్యాన పంటలను సాగు చేస్తే అధికంగా లాభాలు పొందవచ్చు. ప్రస్తుతం డ్రాగన్‌ఫ్రూట్‌ సాగుతో మంచి లాభాలు వస్తున్నాయి. వీటిపై రైతులు దృష్టి సారించాలి. సాగు విస్తీర్ణం పెంచేందుకు రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.

    - దుక్క శరత్‌రెడ్డి, ఉద్యానవనశాఖ అధికారి, మెళియాపుట్టి


boppai.gif

Updated Date - May 13 , 2025 | 12:16 AM