భర్త దూరమవుతున్నాడని...
ABN , Publish Date - Sep 18 , 2025 | 11:43 PM
lady Suicide attempt విభేదాల కారణంగా భర్త తనకు దూరమవుతాన్నడనే మనస్తాపంతో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. మార్కెట్‌లో పురుగుల మందు తాగారు. న్యాయం కోసం కాశీబుగ్గ పోలీసుస్టేషన్‌కు వెళ్లి.. అక్కడ ఆవరణలో కుప్పకూలిపోయారు.
మనస్తాపంతో మహిళ ఆత్మహత్యాయత్నం
పోలీసుస్టేషన్ ఆవరణలో పురుగుల మందు తాగి..
ఆస్పత్రికి తరలింపు.. పరిస్థితి విషమం
పలాస, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): విభేదాల కారణంగా భర్త తనకు దూరమవుతాన్నడనే మనస్తాపంతో ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. మార్కెట్‌లో పురుగుల మందు తాగారు. న్యాయం కోసం కాశీబుగ్గ పోలీసుస్టేషన్‌కు వెళ్లి.. అక్కడ ఆవరణలో కుప్పకూలిపోయారు. పోలీసులు, కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం పరిస్థితి విషమంగా ఉంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పలాస మండలం గొల్లమాకనపల్లికి చెందిన రాపాక రూపవతికి మందస మండలం లింబుగాం గ్రామానికి చెందిన ప్రైవేటు ఉపాధ్యాయుడు భానుతేజతో రెండున్నరేళ్ల కిందట వివాహమైంది. వీరికి ఏడాది వయసున్న ఓ బాబు ఉన్నాడు. కొన్నాళ్లుగా భార్యాభర్తల మధ్య విభేదాలు ఏర్పడి తరచూ ఘర్షణ పడుతున్నారు. కాశీబుగ్గ పోలీస్‌స్టేషన్‌లో నెలరోజుల కిందట రూపవతి తన భర్తపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆ దంపతులిద్దరికీ పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి.. కాపురంగా సక్రమంగా చేసుకోవాలని సర్దిచెప్పారు. కాగా.. గురువారం మధ్యాహ్నం రూపవతి మళ్లీ కాశీబుగ్గ పోలీసులను ఆశ్రయించారు. భర్తతో పాటు అత్త, మామ తనను వేధిస్తున్నారని, దాడి కూడా చేశారని ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. దీంతో సీఐ పి.సూర్యనారాయణ.. భానుతేజతో ఫోన్‌లో మాట్లాడారు. భార్యను వేధించడమేంటని ప్రశ్నించారు. సమస్య పరిష్కరించుకోకుంటే కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. దీంతో భానుతేజ నుంచి వ్యతిరేక సమాధానం రావడంతో రూపవతికి ఈ విషయాన్ని సీఐ వెల్లడించారు. చట్టపరంగా కేసు నమోదు చేసి ఫ్యామిలీ కోర్టులో హాజరుపరుస్తామని, మీకు న్యాయం జరుగుతుందని రూపవతికి తెలిపారు.
సాయంత్రం నాలుగు గంటల సమయంలో రూపవతి తన కుమారుడ్ని పోలీస్‌స్టేషన్‌లో ఉంచి.. బిస్కెట్లు కొనుగోలు చేసి వస్తాని చెప్పి బయటకు వెళ్లారు. భర్త తనకు దూరమవుతున్నాడని మనస్తాపంతో మార్కెట్‌కు వెళ్లి పురుగుల మందు కొనుగోలు చేసి అక్కడే తాగారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు వచ్చి బయటే కుప్పకూలిపోయారు. పోలీసులు వెంటనే ఆమెను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు కాశీబుగ్గలో ఓ ప్రైవేటు ఆసుపత్రికి ఆమెను తరలించి వైద్యం అందించారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో శ్రీకాకుళం తరలించాలని వైద్యాధికారి చెప్పారు. గురువారం రాత్రి ఆమెను శ్రీకాకుళంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా.. ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ సూర్యనారాయణ తెలిపారు.