Share News

Vinayaka idols: మనుషులు చేసిన దేవుడు!

ABN , Publish Date - Aug 26 , 2025 | 12:32 AM

Ganesh idols making at meliyaputti మట్టి వినాయక విగ్రహాల తయారీకి మెళియాపుట్టి కేరాఫ్‌గా నిలుస్తోంది. ఈ గ్రామంలో బూరగాన రాములు, రేకాన దాలయ్య, వంజరాపు రమణ, వంజరాపు కృష్ణ ఇలా.. సుమారు పది కుమ్మరి కుటుంబాలు వినాయకుడు, దుర్గాదేవి విగ్రహాలు తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నాయి.

Vinayaka idols: మనుషులు చేసిన దేవుడు!
మెళియాపుట్టిలో మట్టి వినాయక విగ్రహాలు తయారు చేస్తున్న సవరయ్య

వినాయక విగ్రహాల తయారీలో వారసులు

మట్టి ప్రతిమలకు కేరాఫ్‌ మెళియాపుట్టి

మెళియాపుట్టి గ్రామానికి చెందిన బూరగాన రాములు గత 30ఏళ్ల నుంచి మట్టిని నమ్ముకుని వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నారు. వినాయకచవితి, దసరా పండుల సమయాల్లో మట్టితో దేవుడి ప్రతిమలు చేసి విక్రయిస్తున్నారు. సాధారణ రోజుల్లో ప్రమిదలు, కుండలు తయారు చేసి.. వాటిని విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. కొంతమంది గిట్టుబాటు కాక కులవృత్తిని వీడి వివిధ వ్యాపారాలు చేస్తున్నా.. రాములు మాత్రం కులవృత్తిని వదలలేదు. తన వారసులు సైతం మట్టి విగ్రహాల తయారీ కొనసాగిస్తున్నారు.

మెళియాపుట్టి, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): మట్టి వినాయక విగ్రహాల తయారీకి మెళియాపుట్టి కేరాఫ్‌గా నిలుస్తోంది. ఈ గ్రామంలో బూరగాన రాములు, రేకాన దాలయ్య, వంజరాపు రమణ, వంజరాపు కృష్ణ ఇలా.. సుమారు పది కుమ్మరి కుటుంబాలు వినాయకుడు, దుర్గాదేవి విగ్రహాలు తయారు చేస్తూ జీవనం సాగిస్తున్నాయి. పర్యావరణహితం కోరేలా.. మట్టితో ఆకర్షనీయంగా వినాయక విగ్రహాలు రూపొందిస్తున్నాయి. వినాయకచవితి వస్తే ఆ కుటుంబాలకు పండుగే. మట్టి ప్రతిమలకు డిమాండ్‌ ఉండడంతో చాలామంది విగ్రహాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. విగ్రహాలు ఆకర్షనీయంగా ఉండడంతో ఒడిశా రాష్ట్రం నుంచి కూడా కొంతమంది వచ్చి కొనుగోళ్లు చేస్తున్నారు. విగ్రహం సైజును బట్టి రూ.3వేల నుంచి రూ.10వేల వరకు విక్రయిస్తున్నారు. సాధారణ రోజుల్లో కులవృత్తి గిట్టుబాటుకాకపోయినా పండుగల సమయంలో తమకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆ దేవుడే ఆదుకుంటున్నాడని ఆయా కుటుంబాలు పేర్కొంటున్నాయి. మట్టి విగ్రహాల తయారీ కష్టమైనా.. దేవుడిపై ఇష్టంతో విగ్రహాలు తయారీ చేస్తున్నామని బూరగాన సవరయ్య తెలిపారు. కులవృత్తిని వదలకూడదనే ఉద్దేశంతో తన తండ్రి రాములు నేర్పిన విగ్రహాల తయారీ విద్యను కొనసాగిస్తున్నానని వెల్లడించారు.

40 ఏళ్లుగా.. ఈ వృత్తిలోనే..

కాశీబుగ్గ, ఆగస్టు 25(ఆంధ్రజ్యోతి): పలాస-కాశీబుగ్గలోని 11వవార్డు పూజారి వీధికి చెందిన రామ్‌కుమార్‌ పండా, బాబురామ్‌ పండా, సంతోష్‌ పండా 40 ఏళ్లుగా మట్టి వినాయక విగ్రహాల తయారీ సాగిస్తున్నారు. దేవుడి ప్రతిమలు చేయడమే తమ జీవనాధారమని వారు తెలిపారు. వినాయకచవితికి మూడు నెలల ముందు నుంచీ విగ్రహాల తయారీ ప్రారంభించామన్నారు. పర్యావరణానికి హాని కలుగకుండా వాటర్‌ రంగలు వేస్తామని తెలిపారు. ఏటా వినాయకచవితికి సుమారు 80 విగ్రహాలు విక్రయిస్తామన్నారు. దుర్గాదేవి, సరస్వతి దేవి, రాధాకృష్ణ, విశ్వకర్మ ప్రతిమలు కూడా తయారు చేస్తామని తెలిపారు.

Updated Date - Aug 26 , 2025 | 12:32 AM