Share News

Student suicide: ఏమైందో?

ABN , Publish Date - Nov 13 , 2025 | 12:12 AM

Student suicide: మండలంలోని ఎస్‌ఎంపురం కొండపై ఉన్న ఆర్జీయూకేటీ, శ్రీకాకుళం క్యాంపస్‌ విద్యార్థి ప్రత్తిపాటి సృజన్‌ (20) బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు.

Student suicide: ఏమైందో?
సృజన్‌ (ఫైల్‌)

- ఆర్జీయూకేటీ శ్రీకాకుళం క్యాంపస్‌ విద్యార్థి ఆత్మహత్య

- హాస్టల్‌ గదిలోనే ఫ్యాన్‌కు ఉరేసుకున్న వైనం

- మిడ్‌ పరీక్షలు జరుగుతుండగానే ఘటన

- అనుమానాస్పద మృతిగా కేసు నమోదు

ఎచ్చెర్ల, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఎస్‌ఎంపురం కొండపై ఉన్న ఆర్జీయూకేటీ, శ్రీకాకుళం క్యాంపస్‌ విద్యార్థి ప్రత్తిపాటి సృజన్‌ (20) బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. హాస్టల్‌ గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎచ్చెర్ల పోలీసులు, తోటి విద్యార్థులు వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా పాత గుంటూరు పట్టణంలో ఏటీ అగ్రహారం నాలుగో లైన్‌కు చెందిన సృజన్‌ 2021-22 విద్యా సంవత్సరంలో శ్రీకాకుళం క్యాంపస్‌లో చేరాడు. ప్రస్తుతం ఇంజనీరింగ్‌ ఈఈఈ బ్రాంచ్‌లో తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. గత రెండు రోజులుగా క్యాంపస్‌లో ఇంజనీరింగ్‌ విద్యార్థులకు షిఫ్ట్‌ల వారీగా మిడ్‌ ఎగ్జామ్స్‌ జరుగుతున్నాయి. బుధవారంతో ఈ పరీక్షలు ముగియనున్నాయి. తోటి విద్యార్థులంతా మిడ్‌ పరీక్షలు రాసేందుకు వెళ్లగా.. సృజన్‌ మాత్రం బాలుర హాస్టల్‌లో తాను ఉంటున్న నాలుగో అంతస్థు నుంచి మొదటి అంతస్థుకు దిగి తన స్నేహితుని గదిలో ఫ్యాన్‌కు తాడు బిగించి ఉరిపోసుకున్నాడు. ఉదయం 11 గంటల సమయంలో హాస్టల్‌ గదికి వచ్చి తోటి విద్యార్థులు చూసే సరికి తలుపులు మూసి ఉన్నాయి. దీంతో కిటికిలోంచి చూడగా సృజన్‌ ఫ్యాన్‌కు వేలాడి ఉన్నట్టు గుర్తించారు. ఈ విషయాన్ని క్యాంపస్‌ అధికారులకు చెప్పారు. వారు వచ్చి తలుపులు పగలుగొట్టి చూశారు. సృజన్‌ను క్యాంపస్‌కు చెందిన అంబులెన్స్‌లో శ్రీకాకుళం సర్వజనాసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఎస్‌ఐ వి.సందీప్‌కుమార్‌, పోలీసు సిబ్బంది సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పరీక్షలతో అంతా బిజీగా ఉన్న సమయంలో సృజన్‌ ఆత్మహత్యతో కలకలంరేగింది. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కన్నవారికి కడుపుకోత..

సృజన్‌ తండ్రి కృష్ణప్రసాద్‌ ఆటో డ్రైవర్‌ కాగా, తల్లి జ్యోతి గృహిణి. సృజన్‌కు సోదరి ఉంది. చేతికి అందివస్తాడనుకున్న కుమారుడు అర్ధాంతరంగా తనువు చాలించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

కారణమేంటో?

సృజన్‌ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తృతీయ సంవత్సరం చదువుతున్న ఈ విద్యార్థికి బ్లాక్‌లాగ్స్‌ ఉన్నాయి. ఫిల్మ్‌ మేకింగ్‌పై ఆసక్తి చూపేవాడని తోటి విద్యార్థులు చెబుతున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై పూర్తిస్థాయి పోలీసులు దర్యాప్తు చేస్తే వాస్తవాలు వెల్లడవుతాయి. విద్యార్థి ఆత్మహత్యకు ఒత్తిడి లేదా మరియేతర కారణం ఉందానన్న విషయం తేలాల్సి ఉంది. ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు క్యాంపస్‌ను సందర్శించారు. విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న గదిని పరిశీలించి విద్యార్థులతో మాట్లాడి వివరాలను ఆరా తీశారు. విద్యార్థుల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని పర్యవేక్షణ పెంచాలని అధికారులకు సూచించారు. ఆయన వెంట క్యాంపస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కేవీజీడీ బాలాజీ, ఏవో డాక్టర్‌ ముని రామకృష్ణ ఉన్నారు.

వరుసగా ఘటనలు..

శ్రీకాకుళం క్యాంపస్‌లో గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. మూడేళ్ల కిందట ఓ విద్యార్థిని ఫ్యాన్‌కు ఉరిపోసుకోగా, గతేడాది మరో విద్యార్థి హాస్టల్‌ భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు సృజన్‌ ఆత్మహత్యకు పాల్పడడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించి ఆత్మస్థైర్యం నింపేలా మానసిక నిపుణులతో అవగాహన కార్యక్రమాలను నిర్వహించాల్సి ఉంది. విద్యార్థుల పర్యవేక్షణకు అధికారులు మరింత అప్రమత్తంగా వ్యహరించాల్సి ఉంది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Updated Date - Nov 13 , 2025 | 12:12 AM