IIIT Student suside: నాన్నా.. ఎందుకిలా చేశావు?
ABN , Publish Date - Aug 22 , 2025 | 12:26 AM
Student suside ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో శ్రీకా కుళం జిల్లాకు చెందిన విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలిసి.. ‘ఎందుకిలా చేశావు నాన్నా’.. అంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విల పించారు.
ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో విద్యార్థి ఆత్మహత్య
ఫరీదుపేటలో విషాదఛాయలు
విలపించిన కుటుంబ సభ్యులు
ఎచ్చెర్ల/ వేంపల్లె, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో శ్రీకా కుళం జిల్లాకు చెందిన విద్యార్థి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం తెలిసి.. ‘ఎందుకిలా చేశావు నాన్నా’.. అంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విల పించారు. గురువారం ఉదయం జరిగిన ఈ విషాదకర సంఘటనకు సంబంధించి ట్రిపుల్‌ఐటీ అధికారులు, విద్యార్థులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఎచ్చెర్ల మండలం ఫరీద్ పేట గ్రామానికి చెందిన జి.అప్పలనాయుడు, జి.రాజులమ్మ దంపతుల కుమారుడు గురుగుబెల్లి నరసింహనాయుడు(17) ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. నరసింహనాయుడుకు గత ఏడాది ఒంగోలు ట్రిపుల్‌ఐటీలో సీటు వచ్చింది. ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీ క్యాంపస్‌లో ఉంటూ చదువుకుంటున్నాడు. పీయూసీ మొదటి సంవత్సరంలో మంచి మార్కులు సాధించాడు. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కొద్దిరోజులుగా ముభావంగా ఉన్నట్లు సహచర విద్యార్థులు చెబుతున్నారు. ట్రిపుల్‌ఐటీలో చదువుకోవడం ఇష్టం లేదని, బైపీసీ చేసి తల్లిలాగా నర్సింగ్ కోర్సు చదవాలని ఉంది అంటూ అప్పుడప్పుడు విద్యార్థులతో చెప్పేవాడని అంటున్నారు. భవనంపై నుంచి దూకితే మనిషి చనిపోతాడా? అని కొద్దిరోజుల కిందట మాటల సందర్భంలో స్నేహితులతో అన్నాడని తెలిసింది. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున నిద్రలేచి బాత్‌రూములోకెళ్లి బట్టలు ఆరేసుకునే తాడుతో కిటికీ ద్వారా ఉరేసుకున్నాడు. 7.30గంటల ప్రాంతంలో నరసింహనాయుడు ఉరివేసుకున్నట్లు గుర్తించారు. కాగా అప్పటికే విద్యార్థి మృతిచెందాడు. మృతదేహాన్ని అంబులెన్స్ ద్వారా వేంపల్లె వైద్యశాలకు తరలించారు. డైరెక్టర్ కుమారస్వామి గుప్త, పరిపాలన అధికారి పెనుగొండ రవికుమార్ ఇతర అధికారులు మృతదేహాన్ని పరిశీలించారు. తల్లి రాజులమ్మకు సమాచారం అందించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆర్కేవ్యాలీ ఏఎస్‌ఐ నాగరాజ తెలిపారు. మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. కాగా.. ట్రిపుల్‌ఐటీలో విద్యార్థి మృతిచెందడం బాధాకరమని ఎమ్మెల్సీ రామగోపాల్‌రెడ్డి తెలిపారు. వేంపల్లె ప్రభుత్వ వైద్యశాలలో ఉన్న విద్యార్థి మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ట్రిపుల్‌ఐటీ అధికారులకు ఎమ్మెల్సీ సూచించారు.
కుటుంబ సభ్యుల్లో విషాదం
నర్శింహనాయుడు మృతి చెందినట్టు గురువారం ఉదయం కుటుంబ సభ్యులకు సమాచారం అందడంతో లబోదిబోమంటూ ఇడుపులపాయకు బయలుదేరారు. విద్యార్థి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. నర్సింహనాయుడు తండ్రి అప్పలనాయుడు కొన్నేళ్ల కిందట మృతిచెందాడు. తల్లి రాజు శ్రీకాకుళంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. నర్సింహనాయుడు సోదరి సాయి ఎచ్చెర్ల మండలంలోని కుప్పిలి మోడల్ స్కూల్‌లో 9వ తరగతి చదువుతోంది. కుమారుడుపైనే ఆశలు పెంచుకుని జీవనం సాగిస్తున్న ఆ తల్లికి ఈ సంఘటన మరింత కృంగదీసింది. తన కుమారుడికి చదువుపైనే ధ్యాస అని, ఇటీవల రెండు నెలల సెలవులకు ఇంటికి కూడా వచ్చాడని, పీయూసీ ప్రధమ సంవత్సరంలో కూడా మంచి మార్కులు సాధించాడని తల్లి రాజు పేర్కొంది. ఎందుకిలా చేశాడో తమకు అర్థం కావడం లేదని కన్నీటిపర్యంతమైంది.