రైతు సేవలపై రగడ
ABN , Publish Date - Nov 28 , 2025 | 11:43 PM
కూటమి ప్రభుత్వం అదికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులకు సేవా పథకాలు సక్రమంగా అమలు కావడంలేదని వైసీపీ ప్రజా ప్రతినిధులు అధికారులను నిలదీశారు.
-గ్రామసభలు లేకుండా ఉపాధి పనులు ఆమోదమా?
- మండల సమావేశంలో వైసీపీ-టీడీపీ నాయకుల తీవ్ర వాగ్వాదం
ఇచ్ఛాపురం, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం అదికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులకు సేవా పథకాలు సక్రమంగా అమలు కావడంలేదని వైసీపీ ప్రజా ప్రతినిధులు అధికారులను నిలదీశారు. దీంతో వైసీపీ-టీడీపీ సర్పంచ్‌లు, ఎంపీటీసీల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బోర పుష్ప అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వ్యవసాయశాఖ అధికారి అజయ్‌కుమార్ ప్రభుత్వం రైతు లకు అందిస్తున్న పథకాలను వివరించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జడ్పీ చైర్‌పర్సన్ పిరియా విజయా మాట్లాడుతూ.. మొంథా తుఫాన్ కారణంగా తులసిగాం, ధర్మపురం గ్రామాల్లో ఎంత పంట నష్టం జరిగింది, ఎంత శాతం నమోదు చేశారని ఏవోను ప్రశ్నించగా.. 96హెక్టార్లు అని ఆయన సమాధానం చెప్పారు. ఈరెండు గ్రామాల్లో ఈ క్రాప్ సక్రమంగా జరగలేదని, కూటమి నాయకులు చెప్పిన వారి పేర్లు మాత్రమే ఈ క్రాప్‌లో నమోదు చేసి మిగిలిన వారిని వదిలేశారని, అందువల్లే పంట నష్టం నమోదు పూర్తిస్థాయిలో జరగలేదని, యూరియా కూడా రైతులకు ఇవ్వలేదని వైసీపీ సర్పంచ్‌లు తులసీరావు, నర్తు ప్రసాద్ అన్నారు. దీనిపై టీడీపీకి చెందిన పీఏసీఎస్ అధ్యక్షుడు పెదిని బాబ్జీ స్పందిస్తూ.. వైసీపీ నాయకుల మాటలు అవాస్తవమని అన్నారు. దీంతో ఇరు పార్టీల ప్రతినిధుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. గ్రామ సభలు నిర్వహించకుండా ఉపాధి హామీ పనులకు ఆమోదం తెలపడంపై కేశుపుర, తులసిగాం, లొద్దపుట్టి, ఈదుపురం గ్రామ సర్పం చ్‌లు ఏపీవోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ నర్తు రామరావు, ఏఎంసీ చైర్మన్ మణిచంద్రప్రకాష్, ఎంపీడీవో ప్రభాకర రావు, తహసీల్దార్ ఎన్.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.