Share News

Application Negligence: అర్జీలను నిర్లక్ష్యం చేస్తే కఠినచర్యలు

ABN , Publish Date - Jun 24 , 2025 | 11:30 PM

Public Services Administrative Action ప్రజల నుంచి స్వీకరించే అర్జీలను నిర్లక్ష్యం చేస్తే కఠినచర్యలు తప్పవని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను హెచ్చరించారు. పౌరసేవల బాధ్యతను నిర్వర్తించడంలో ప్రతీ అధికారి సమర్థంగా పనిచేయాలని స్పష్టం చేశారు.

Application Negligence: అర్జీలను నిర్లక్ష్యం చేస్తే కఠినచర్యలు
మాట్లాడుతున్న కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

  • రెవెన్యూ విభాగంలోనే అత్యధికంగా ఫిర్యాదుల పెండింగ్‌

  • 27న పరిష్కారానికి సదస్సు

  • కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

  • శ్రీకాకుళం కలెక్టరేట్‌, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): ప్రజల నుంచి స్వీకరించే అర్జీలను నిర్లక్ష్యం చేస్తే కఠినచర్యలు తప్పవని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అధికారులను హెచ్చరించారు. పౌరసేవల బాధ్యతను నిర్వర్తించడంలో ప్రతీ అధికారి సమర్థంగా పనిచేయాలని స్పష్టం చేశారు. మంగళవారం కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కారం(పీజీఆర్‌ఎస్‌)పై జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌తో కలిసి ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో పలు శాఖల పరిధిలో ఫిర్యాదులు పెండింగ్‌పై అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా రెవెన్యూ శాఖలో కాలపరిమితి దాటి పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులపై సుదీర్ఘంగా సమీక్షించారు. ‘జిల్లాలో నమోదైన మొత్తం 31,037 ఫిర్యాదుల్లో 1,318 ఎస్‌ఎల్‌ఏ దాటి పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో 188 కేసులు రీఓపెన్‌ అయ్యాయి. పెండింగ్‌ కేసుల్లో ఎక్కువ శాతం రెవెన్యూ, సర్వే, పంచాయతీ శాఖలకు చెందినవే. టెక్కలి, గార, నందిగాం, రణస్థలం వంటి గ్రామీణ మండలాల్లో ఎస్‌ఎల్‌ఏ దాటిన పెండింగ్‌ కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఆడిట్‌ ఫిర్యాదుల పరిష్కారంలో ఇప్పటికీ 149 కేసులు పెండింగ్‌లో ఉన్నాయ’ని కలెక్టర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. పెండింగ్‌ కేసుల పరిష్కారానికిగానూ ఈ నెల 27న రెవెన్యూ సదస్సును నిర్వహిస్తామని తెలిపారు. ఈ సదస్సులో కేసుల పరిష్కారానికి ఒక సమయం నిర్దేశిస్తామని, అధికారులు ఆడిట్‌కు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రజల్లో విశ్వాసం పెంచేలా పనిచేయాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వేంకటేశ్వరరావు, ఉప కలెక్టర్‌ బి.పద్మావతి, ఇతర జిల్లా, మండలస్థాయి అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 24 , 2025 | 11:30 PM