Share News

తుఫాన్‌.. అలజడి

ABN , Publish Date - Oct 28 , 2025 | 12:38 AM

Rain across the district due to Montha మొంథా తుఫాన్‌ ప్రభావంతో సోమవారం జిల్లావ్యాప్తంగా వర్షాలు కురిశాయి. సోమవారం సాయంత్రం నుంచి ఈదురుగాలుల కూడా వీచాయి. బంగాళాఖాతం సముద్రానికి ఆనుకుని జిల్లా ఉండటంతో తుఫాన్‌ ప్రభా వం కనిపించింది. జిల్లాలో అత్యధికంగా పలాస, సరుబుజ్జిలి, పోలాకి, గార, ఇచ్ఛాపురం మండలాల్లో వర్షం కురిసింది.

తుఫాన్‌.. అలజడి
శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఆవరణలో నిలిచిన వర్షపునీరు

మొంథా ప్రభావంతో జిల్లా అంతటా వర్షం

నేడు, రేపు భారీ వర్షాలు

అల్లకల్లోలంగా సముద్రం

తీరప్రాంతాల్లో అధికారుల మకాం..

కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటు

శ్రీకాకుళం, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్‌ ప్రభావంతో సోమవారం జిల్లావ్యాప్తంగా వర్షాలు కురిశాయి. సోమవారం సాయంత్రం నుంచి ఈదురుగాలుల కూడా వీచాయి. బంగాళాఖాతం సముద్రానికి ఆనుకుని జిల్లా ఉండటంతో తుఫాన్‌ ప్రభా వం కనిపించింది. జిల్లాలో అత్యధికంగా పలాస, సరుబుజ్జిలి, పోలాకి, గార, ఇచ్ఛాపురం మండలాల్లో వర్షం కురిసింది. శ్రీకాకుళంలో ప్రజలు అవస్థలకు గురయ్యారు. కాంప్లెక్స్‌ ఆవరణలో ఎప్పటిలాగే నీరు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. అలాగే గొర్లవానిపేట తదితర ప్రాంతాల్లో వరిపంట నేలకొరిగింది. ఒప్పంగి స్కూల్‌ వద్ద వర్షపు నీరు చేరింది. ఇలా పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

జిల్లా అంతటా రెడ్‌ అలర్ట్‌ కొనసాగుతోంది. తుఫాన్‌ తీరం దాటనున్న వేళ.. మం గళ, బుధవారాల్లో మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతా వరణశాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో అధికారులు జిల్లావాసులను అప్రమత్తం చేశారు. తీరప్రాంతాల్లో పర్యటించి తుఫాన్‌ను ఎదుర్కోవడంపై అవగాహన కల్పిం చారు. తుఫాన్‌ ప్రత్యేకాధికారి చక్రధరబాబు సోమవారం టెక్కలి, సంతబొమ్మాళి, పోలాకి తదితర మండలాల్లో పర్యటించారు. తుఫాన్‌ కారణంగా తీసుకుంటున్న ముం దస్తు చర్యలను పరిశీలించారు. తీరప్రాంతాల ప్రజలు ఈదురుగాలులకు చిక్కకుండా రక్షిత భవనాల్లో ఉండా లని.. అవసరమైన ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఇదిలా ఉండగా.. శ్రీకాకుళం కలెక్టరేట్‌లో ప్రజలకు అత్యవసర సహాయం అందించేందుకు కంట్రోల్‌ రూమ్‌ (08942 240557)ను ఏర్పాటు చేశారు. మంగళవారం ఈదురుగాలులు బలంగా వీయనున్నాయని.. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడితే తక్షణమే చర్యలు చేపట్టేలా యంత్రాంగం సిద్ధమైంది. ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు తీరప్రాంతమంతటా చేరుకున్నాయి. రోడ్లపై చెట్లు కూలితే తక్షణ అవసరం కోసం సహాయ సామగ్రిని సిద్ధం చేశాయి. రాష్ట్రస్థాయి అధికారులు కూడా నిరంతరం సమీక్షలు నిర్వహిస్తుండటంతో జిల్లా యంత్రాంగం తుఫాన్‌ నిర్వహణ పనుల్లో నిమగ్నమయ్యారు. మరో రెండు రోజులపాటు తుఫాన్‌ ప్రభావం ఉండనుండడంతో ఇప్పటికే పాఠశాలలకు, కళాశాలలకు అధికారులు సెలవులు ప్రకటించారు.

కడలి కల్లోలం

మొంథా తుఫాన్‌ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. కళింగపట్నం, బందరువాని పేట, బారువ, కళ్లేపల్లి తీరాల వద్ద కొన్ని మీటర్ల ఎత్తున కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. మత్స్యకారుల శాలలు వద్దకు సముద్రపు నీరు వచ్చేసింది. గార మండలం బందరువానిపేటలో కూడా కొన్ని ఇళ్లల్లోకి నీరు చేరడంతో ప్రజలు ఆందోళన చెందారు. తీరప్రాంత మంతటా ఈదురు గాలులు నిరంతరంగా వీయడంతో.. ఇళ్లకే జనం పరిమిత మైపోయారు. మత్స్యకారులు వేటకు వెళ్లనీయకుండా హెచ్చరికలు జారీచేయడంతో.. ఒడ్డున పడవలు లంగరు వేసేశారు. తుఫాన్‌ ఏ ప్రమాదం మిగుల్చుతుందోనని ఆందోళన చెందుతున్నారు.

తుఫాన్‌ ప్రభావంతో పలు రైళ్లు రద్దు

టెక్కలి/ పలాస, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్‌ ప్రభావంతో ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే పలు రైళ్లు రద్దు చేస్తున్నట్లు సీనియర్‌ డివిజినల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ కె.పవన్‌కుమార్‌, రైల్వేశాఖ చీఫ్‌ పాసింజర్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ మేనేజర్‌ సందీప్‌కుమార్‌ సోమవారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. 43 కోచింగ్‌ ట్రైన్లతోపాటు భువనేశ్వర్‌-బెంగుళూరు ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌(18463), భువనేశ్వర్‌-సికింద్రాబాద్‌ వెళ్లే విశాఖ ఎక్స్‌ప్రెస్‌(17015), భువనేశ్వర్‌ - పాండిచ్ఛేరి వీక్లీ ఎక్స్‌ప్రెస్‌(20851) వంటి రైళ్లను మంగళవారం రద్దు చేసినట్లు వెల్లడించారు. అలాగే 28న కటక్‌-గుణుపూర్‌ మెమూ రైలు(68433), 29న గుణుపూర్‌-కటక్‌ మెమూ రైలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. విశాఖ-గుణుపూర్‌ పాసింజర్‌(58506), గుణుపూర్‌-విశాఖ పాసింజర్‌(58505) మంగళవారం రద్దయిందన్నారు. టాటానగర్‌-ఎర్నాకులం ఎక్స్‌ప్రెస్‌(18189) రైలును దారిమళ్లించారు. ఈ రైలు టిట్లాఘర్‌, రాయపూర్‌, నాగపూర్‌ మీదుగా వెళ్తుంది. 18447 భువనేశ్వర్‌-జగదల్‌పూర్‌, 18017 రూల్‌కెలా-జగదల్‌పూర్‌ రైలు రాయఘడ వరకు చేరుకొని తిరిగి అక్కడ నుంచే వెనుదిరుగుతుంది. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని కోరారు.

జిల్లాలో సోమవారం నమోదైన వర్షపాతం(మిల్లీ మీటర్లలో)

------------------------------

పోలాకి 65.0

పలాస 65.0

సరబుజ్జిలి 58.5

గార 48.5

ఇచ్ఛాపురం 40.0

సంతబొమ్మాళి 38.75

సోంపేట 38.75

నరసన్నపేట 32.75

వజ్రపుకొత్తూరు 30.5

కోటబొమ్మాళి 30.5

కంచిలి 28.25

నందిగాం 24.25

శ్రీకాకుళం 22.75

రణస్థలం 21.0

మందస 27.0

ఆమదాలవలస 25.75

టెక్కలి 21.0

బూర్జ 16.5

జలుమూరు 16.0

మెళియాపుట్టి 14.5

లావేరు 13.75

ఎల్‌.ఎన్‌.పేట 13.5

కవిటి 13.0

సారవకోట 8.75

హిరమండలం 5.25

పాతపట్టణం 1.75

Updated Date - Oct 28 , 2025 | 12:38 AM