Share News

తుఫాన్‌ అలజడి

ABN , Publish Date - Nov 25 , 2025 | 11:44 PM

foemers tenson అన్నదాతల్లో తుఫాన్‌ అలజడి రేగుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగండంగా మారునుంది. శుక్రవారం నాటికి ఇది తుఫాన్‌గా మారి జిల్లాలో ఈ నెల 29, 30 తేదీల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావారణ శాఖ ప్రకటించింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

తుఫాన్‌ అలజడి
టెక్కలిపాడు - జమ్ము గ్రామాల మధ్య వరికుప్పలు పెడుతున్న రైతులు

జిల్లాకు 29, 30 తేదీల్లో భారీ వర్షసూచన

ఆందోళనలో రైతులు

వరిపంటను కాపాడుకునేందుకు పాట్లు

నరసన్నపేట/ కోటబొమ్మాళి, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): అన్నదాతల్లో తుఫాన్‌ అలజడి రేగుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగండంగా మారునుంది. శుక్రవారం నాటికి ఇది తుఫాన్‌గా మారి జిల్లాలో ఈ నెల 29, 30 తేదీల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావారణ శాఖ ప్రకటించింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో 3.80 లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. ఇప్పటికే 1.5 లక్షల ఎకరాల్లో వరి కోతలు పూర్తి కాగా, సుమారు 60వేల ఎకరాల్లో నూర్పులు కూడా చేపట్టారు. ధాన్యం రోడ్లమీద.. కళ్లాల్లో ఉన్నాయి. జిల్లాలో గార, శ్రీకాకుళం రూరల్‌, ఆమదాలవలస, సరుబుజ్జిలి, ఎల్‌.ఎన్‌.పేట, హిరమండలం, కొత్తూరు, పాతపట్నం, సారవకోట, టెక్కలి, జలుమూరు, నరసన్నపేట, పోలాకి మండలాల్లో వరికోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ సమయంలో తుఫాన్‌ హెచ్చరికలతో రైతులు దిగులు చెందుతున్నారు. వాతావరణంలో మార్పుల కారణంగా మంగళవారం మబ్బులు వేయడంతో కోతలు నిలిపేశారు. వరిపనలు కుప్పలుగా వేసి భద్రపరిచే పనిలో నిమగ్నమయ్యారు.

అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అచ్చెన్నాయుడు

తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. మంగళవారం నిమ్మాడలోని క్యాంపు కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. ‘తుఫాన్‌ ప్రభావం తీవ్రత రానున్న 48గంటల్లో పెరిగే అవకాశం ఉంది. రైతులు అప్రమత్తంగా ఉండాలి. క్షేత్ర స్థాయిలో వ్యవసాయశాఖ అధికారులు పర్యటించి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలి. కోత కోసిన వరి పంటను భద్రం చేసేందుకు వ్యవసాయశాఖ కార్యాలయాల్లో టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలి. అవసరమైతే రైతులు వాటిని వినియోగించుకోవాలి. సముద్రం అలజడిగా మారుతున్న నేపఽథ్యంలో మత్య్సకారులు వేటకు వెళ్లరాదు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు, రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాల’ని మంత్రి అచ్చెన్న ఆదేశించారు. ఈ మేరకు వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. వరి పంట కోతలు కోయొద్దని, కోసిన పంటను కళ్లాల్లో భద్రపరచుకోవాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని ఆంక్షలు విధించారు.

Updated Date - Nov 25 , 2025 | 11:44 PM