Share News

GOld business: రాళ్లు.. బంగారం ఒక్కటేనంట!

ABN , Publish Date - Apr 11 , 2025 | 11:46 PM

Stones and Gold Equality బంగారం ఆభరణాల దుకాణాల్లో మోసాలు పెరిగిపోతున్నాయి. రాళ్లతో ఉన్న బంగారం నగలను కొనుగోలు చేస్తే షాపు నిర్వాహకుడు రాళ్లు, బంగారాన్ని వేర్వేరుగా తూకం వేసి, ధర లెక్కకట్టాలి. ఎందుకంటే బంగారం, రాళ్ల ధరకు చాలా వ్యత్యాసం ఉంటుంది. కానీ చాలా దుకాణాల్లో అలా చేయట్లేదు. ఆభరణం(నగ) మొత్తంగా తూకం వేసి బంగారంతో సమానంగా రాళ్లకూ ధర కట్టి వినియోగదారులకు కుచ్చుటోపి పెడుతున్నారు.

GOld business: రాళ్లు.. బంగారం ఒక్కటేనంట!

  • రెండింటికీ సమానంగా రేటుకట్టి వసూలు

  • బంగారు దుకాణాల్లో పెరుగుతున్న మోసాలు

  • తూకాల్లోనూ తేడాలు.. కనిపించని హాల్‌మార్క్‌

  • వేయింగ్‌ మిషన్లు రెన్యువల్‌ చేయించని వైనం

  • నరసన్నపేటలోని ఒక బంగారం దుకాణంలో గతేడాది జనవరిలో ఓ వ్యక్తి 12 గ్రాముల బరువైన నల్లపూసల బ్రాస్‌లెట్‌ కొనుగోలు చేశాడు. రెండు రోజుల తర్వాత దానిని మార్చేందుకు అదే దుకాణానికి వెళ్లాడు. కాగా.. నల్లపూసలు విడిచిపెట్టి సంబంధిత బ్రాస్‌లేట్‌ 10 గ్రాములు మాత్రమే ఉంటుందని.. ఆ మేరకే కొనుగోలు చేస్తామని షాపు యాజమాని చెప్పాడు. బంగారు ఆభరణాలు అమ్మే సమయంలో 12 గ్రాములకు తూకం వేసి.. నేడు 10 గ్రాములకు తీసుకోవడం సరికాదని ఆ వ్యక్తి నిలదీశాడు. తరుగు ఉంటుందని. నల్లపూసల్లో మట్టి చేరుతుందని యాజమాని బుకాయించాడు.

  • నరసన్నపేట, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): బంగారం ఆభరణాల దుకాణాల్లో మోసాలు పెరిగిపోతున్నాయి. రాళ్లతో ఉన్న బంగారం నగలను కొనుగోలు చేస్తే షాపు నిర్వాహకుడు రాళ్లు, బంగారాన్ని వేర్వేరుగా తూకం వేసి, ధర లెక్కకట్టాలి. ఎందుకంటే బంగారం, రాళ్ల ధరకు చాలా వ్యత్యాసం ఉంటుంది. కానీ చాలా దుకాణాల్లో అలా చేయట్లేదు. ఆభరణం(నగ) మొత్తంగా తూకం వేసి బంగారంతో సమానంగా రాళ్లకూ ధర కట్టి వినియోగదారులకు కుచ్చుటోపి పెడుతున్నారు. అర్హత లేని వేయింగ్‌ మిషన్లతో మోసం చేస్తున్నారు. వాటిని కనీసం రెన్యూవల్‌ చేయడం లేదు. దీంతో జిల్లాలోని కొన్ని షాపుల్లో నిర్వాహకులు చెప్పిందే తూకంగా, ఇచ్చిందే బంగారంగా మారిపోయింది. కొంతమంది వ్యాపారులు హాల్‌మార్క్‌ వేసి బంగారు ఆభరణాలను విక్రయించకుండా మోసాలకు పాల్పడుతున్నారు. తరచూ తనిఖీలు చేస్తూ ఈ మోసాలకు చెక్‌ పెట్టాల్సిన తూనికలు, కొలతలు అధికారులు కన్నెత్తి చూసే దాఖలాలు కనిపించడం లేదు. ఆ శాఖకు తగిన సిబ్బంది లేకపోవడంకూడా ఒక కారణమని సమాచారం.

  • జిల్లాలో శ్రీకాకుళం, నరసన్నపేట, పలాస-కాశీబుగ్గ ,పాతపట్నం, టెక్కలి, ఆమదాలవలస, సోంపేట, బ్రాహ్మణతర్ల, రణస్థలం, మందస, ఇచ్ఛాపురం తదితర పట్టణాల్లో సుమారు 600 బంగారం దుకాణాలు ఉన్నాయి. శ్రీకాకుళం, నరసన్నపేట, పలాస-కాశీబుగ్గ పట్టణాల్లో బంగారం షాపులు 400 పైగా ఉన్నాయి. నరసన్నపేటలోనే ఎనిమిది హోల్‌సేల్‌ వ్యాపార సంస్థలు ఉన్నాయి. జిల్లాలో ఇతర పట్టణాలతోపాటు ఇతర రాష్ట్రాలకు నరసన్నపేట నుంచే బంగారం ఆభరణాలు లావాదేవీలు జరుగుతుంటాయి. బంగారం వ్యాపారానికి బ్రాండ్‌గా ఉన్న నరసన్నపేటతోపాటు ఇతర పట్టణాల్లో కొందరు వ్యాపారులు వినియోగదారులకు మోసాలకు పాల్పడుతూ కుచ్టుటోపీ పెడుతున్నారు.

  • స్వచ్ఛత సంగతేంటో..?

  • బంగారం ఆభరణాలు కొనుగోలు చేసేందుకు వెళ్తే దుకాణ నిర్వాహకుడు చెప్పిన మేరకే స్వచ్ఛత అని వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు. అది 22 క్యారెట్లా, 24 క్యారెట్లా అని వినియోగదారులు గుర్తించలేకపోతున్నారు. పలు బంగారం షాపుల యాజమానులు తూకాల్లో చేస్తున్న మోసాన్ని గ్రహించలేకపోతున్నారు. వినియోగదారులకు బంగారంపై ఉన్న మక్కువను కొంతమంది వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు.

  • చాలా మంది.. రాళ్ల బంగారంపై ఎక్కువ మక్కువ చూపుతుంటారు. చేతి ఉంగరాలు, చైన్‌లాకెట్‌లు, నక్లెస్‌ తదితరాలను రాళ్లతో తయారు చేయించికుంటారు. బంగారం ధర, స్టోన్‌ ధరల్లో చాలా వ్యత్యాసాలున్నాయి. కొంతమంది బంగారు దుకాణదారులు వీటి విక్రయాల సమయంలో వినియోగదారులను మోసం చేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఎవరైనా రాళ్లతో ముడిపడిన బంగారం ఆభరణాలు కొనుగోలు చేస్తే బంగారం, రాళ్లను వేర్వేరుగా తూకం వేయాలి. వాటి ధరలను బిల్లుల్లో సైతం వేర్వేరుగా చూపించాలి. 10 గ్రాములు స్టోన్‌ కలిగిన ఉంగరం తీసుకుంటే.. అందులో దాదాపు ఒక మిల్లీ గ్రాము స్టోన్‌ ఉంటే కొందరు కేటుగాళ్లు మొత్తం 10 గ్రాములు బంగారం ధరకే అమ్మేస్తున్నారు. మరికొంతమంది కేటుగాళ్లుకు 30 మి.ల్లీ గ్రాములు స్టోన్‌ ఉంటే.. 10 మిల్లీ గ్రాములు స్టోన్‌ ఉంటుందని చెప్పి.. 20 మిల్లీగ్రాములు రాళ్ల ధరను బంగారం ధరకే తీసుకుంటారు. కొన్ని బంగారం ఆభరణాలకు ఉన్న రాళ్లను కొనుగోలు చేసే సమయంలో వాటిని తీసేందుకు అవకాశం ఉండుదు. షాపు నిర్వాహుకుడు ఎంత చెబితే అంతే. దీంతో రాళ్లు బరువు మినహాయించి కొందరు బంగారం ఆభరణాలు విక్రయించి దోచుకుంటున్నారు.

  • వేయింగ్‌ మిషన్ల రెన్యువల్‌ ఏదీ?

  • సాధారణంగా బంగారం దుకాణాల వ్యాపారులు తమ వద్ద ఉన్న వేయింగ్‌ మిషన్లకు తూనికలు, కొలతల శాఖ నుంచి రెన్యువల్‌ సర్టిఫికెట్లు తీసుకోవాలి. కానీ చాలామంది ఈ సర్టిఫికెట్లు లేకుండానే వ్యాపారాలు సాగిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఎన్ని బంగారం దుకాణాలు ఉన్నాయి. ఎంతమంది రెన్యువల్‌ సర్టిఫికెట్లు తీసుకున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. కొన్ని బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థల విషయానికొస్తే వారు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్న చందగా తయారైంది. పైనాన్స్‌ సంస్థల్లోకి బంగారం నగలను తాకట్లు పెట్టుకునేందుకు వెళ్తే.. వారు వేసిన తూకం.. ఇచ్చే డబ్బు తీసుకుని రావాల్సిందేనన్న బాధితులు వాపోతున్నారు. కొందరు ఫైనాన్స్‌ సంస్థలు, బ్యాంకు నిర్వాహాకులు వేయింగ్‌ మిషన్లలో తక్కువ తూకాలు నమోదు చేసుకుని, వినియోగదారులను మోసం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. పైనాన్స్‌ సంస్థలు, బ్యాంకులు, బంగారు దుకాణాల్లో వేయింగ్‌ మిషన్లకు రెన్యువల్‌ సర్టిఫికెట్లు తీసుకున్నారా.. లేదా అని పరిశీలించాల్సిన తూనికలు, కొలతల శాఖాధికారులు పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో మోసాలు పెరుగుతూనే ఉన్నాయని వినియోగదారులు వాపోతున్నారు.

  • నిఘా పెడతాం

  • జిల్లాలో బంగారం దుకాణాల్లోని తుకాల్లో తేడాలపై నిఘా పెంచుతాం. ప్రతీ షాపు యాజమాని తప్పనిసరిగా వేయింగ్‌ మిషన్లు రెన్యూవల్‌ చేయించుకోవాలి. రాళ్లతో కలిసి బంగారం ఆభరణాలు తూకాలు వేయరాదు. బంగారం, రాళ్ల వేర్వేరుగా తుకాలు వేసి బిల్లులు ఇవ్వాలి. ఫిర్యాదులు వస్తే షాపు యాజమానులపై చర్యలు తీసుకుంటాం.

    - ఎస్‌.విశ్వేశ్వరరావు, సహాయక నియంత్రకులు, తూనికలు, కొలతలశాఖ, శ్రీకాకుళం

Updated Date - Apr 11 , 2025 | 11:46 PM