Chits fraud: దోచింది రూ.5.86 కోట్లు.. దొరికింది రూ.15.84లక్షలు
ABN , Publish Date - Mar 12 , 2025 | 12:11 AM
Theft recovery నాలుగేళ్ల కిందట నరసన్నపేటలో సుమారు రూ.ఆరుకోట్లు టోకరా పెట్టి.. పరారీ అయిన చిట్‌ఫండ్ వ్యాపారి కోరాడ గణేశ్వరరావు అలియాస్ గణేష్ చరాస్తులను జప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక కలివరపుపేటకు చెందిన కోరాడ గణేశ్వరరావు పట్టణంలో లక్ష్మీ గణేష్ చిట్స్ పేరుతో 17 ఏళ్లుగా వడ్డీ వ్యాపారం నిర్వహించేవాడు.

పరారైన చిట్ వ్యాపారి ఆస్తుల జప్తు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు జారీ
నాలుగేళ్ల కిందట మోసం చేసి.. ఉడాయించిన వైనం
కేసు విచారించి నివేదిక అందజేసిన సీఐడీ
నరసన్నపేట, మార్చి 11(ఆంధ్రజ్యోతి): నాలుగేళ్ల కిందట నరసన్నపేటలో సుమారు రూ.ఆరుకోట్లు టోకరా పెట్టి.. పరారీ అయిన చిట్‌ఫండ్ వ్యాపారి కోరాడ గణేశ్వరరావు అలియాస్ గణేష్ చరాస్తులను జప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక కలివరపుపేటకు చెందిన కోరాడ గణేశ్వరరావు పట్టణంలో లక్ష్మీ గణేష్ చిట్స్ పేరుతో 17 ఏళ్లుగా వడ్డీ వ్యాపారం నిర్వహించేవాడు. అధిక వడ్డీ ఆశ చూపి ప్రజలను నమ్మించేవాడు. ఈ క్రమంలో 2021 నాటికి 48మంది బాఽధితుల నుంచి రూ.2.50లక్షలు, రూ.5లక్షలు, రూ.10లక్షలు చొప్పున చీటీల పేరుతో.. రూ.3,26,62,950 సేకరించాడు. అలాగే మరో 26 మంది బాధితుల నుంచి రూ.2,59,90,000 వసూలు చేసి కుటుంబంతో ఉడాయించాడు. దీంతో తాము మోసపోయామని గ్రహించి బాధితులు లబోదిబోమన్నారు. అప్పట్లో ఈ వ్యవహారంపై నరసన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేసి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈ మేరకు అప్పుడు పోలీసులు దర్యాప్తు చేశారు. గణేష్.. చీటీలు, డిపాజిట్ల రూపంలో రూ.5.86కోట్లు వసూలు చేసి పరారైనట్టు అప్పట్లో గుర్తించారు. ఈ కేసును ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. అప్పటి సీఐడీ అడిషనల్ ఎస్పీ రవివర్మ ఈ కేసును పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి.. బాధితులు ఇచ్చిన వాంగ్మూలం మేరకు సమగ్ర నివేదికను సిద్ధం చేశారు. అలాగే ఈ వ్యవహారంలో ఏ-1 గా ఉన్న కోరాడ గణేశ్వరరావు, అతని భార్య లక్ష్మీ, గణేశ్వరరావు వియ్యంకులు అంధవరపు సూర్యనారాయణ, భారతిపై కేసులు నమోదు చేశారు. చీటీల పేరిట మోసాలకు పాల్పడినట్టు నిర్ధారించి.. వారిని అరెస్టు చేశారు. అయితే నమ్మించి ఖాతాదారులను నట్టేట ముంచిన గణేష్ చర, స్థిరాస్తులపై కూడా సీఐడీ అధికారులు నిఘా పెట్టారు. ఎల్‌ఐసీ, పోస్టల్, ఇతర ప్రైవేటు బీమా సంస్థల్లో ఉన్న రూ.15.84లక్షలు చరాస్తులు జప్తునకుగానూ ప్రభుత్వానికి నివేదించారు. ఈ ఆస్తులు జప్తు చేయాలని ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ తరహా కేసు నరసన్నపేట పట్టణంలో ఇదే మొదటిది కావడం గమనార్హం. కాగా.. గణేష్ చీటీలు, డిపాజిట్ల రూపంలో రూ.5.86కోట్లు వరకూ దోచుకోగా.. ఈ వ్యవహారంలో నిందితులుగా ఉన్న నలుగురు పేరిట కేవలం రూ.15.84లక్షలు మాత్రమే చరాస్తులు గుర్తించారు. మిగతా సొమ్మును గణేష్ ఎక్కడ దాచాడో ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఏఏ ప్రాంతాల్లో స్థిరాస్తులు ఉన్నాయో.. వాటి విలువ ఎంతనేది తేలాల్సి ఉంది. అప్పట్లో గణేష్ ఈ డబ్బులతో ఎక్కువగా బంగారం కొనుగోలు చేశాడనే ఆరోపణలు ఉన్నాయి.