ఎస్సీలకు రుణ సదుపాయం కల్పించేందుకు చర్యలు
ABN , Publish Date - Nov 14 , 2025 | 12:16 AM
జిల్లాలో ఎస్సీలందరికీ కార్పొరేషన్ ద్వారా రుణ సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మాదిగ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ డా.ఉండవల్లి శ్రీదేవి పేర్కొన్నారు.
శ్రీకాకుళం కలెక్టరేట్, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎస్సీలందరికీ కార్పొరేషన్ ద్వారా రుణ సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మాదిగ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్‌పర్సన్ డా.ఉండవల్లి శ్రీదేవి పేర్కొన్నారు. ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్సీ కార్పొరేషన్ రుణాలు, ఉపాధి హామీ పథకం తదితర అంశాలపై ఆరా తీశారు. సబ్‌ప్లాన్ అమలులో భాగంగా జిల్లా లో ఎన్‌ఎస్ ఎఫ్‌సీ పథకం కింద 450 రుణాలకు గాను 3 వేల దరఖాస్తులు వచ్చాయని, వీటి కోసం రూ.1.80 కోట్లు ఖర్చవుతుందన్నారు. ఎవరికి ఎటువంటి రుణాలివ్వాలో నిర్ణయిస్తున్నామన్నారు. 10 మందికి డ్రైవింగ్‌లో శిక్షణ ఇచ్చి వారికి హెవీ వెహికల్ లైసెన్సు అందజేసి ఆదుకోవాలని నిర్ణయించా మన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌కు సంబంధించి సోంపేటలో 5 షాపులు, మందస లో 5 షాపుల మరమ్మతులకు రూ.18.50 లక్షలు మంజూరయ్యాయన్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో మాదిగ నాయకులు, ప్రజలతో సమావేశం నిర్వ హించి, వారి నుంచి వినతులను స్వీకరించారు. అనంతరం స్థానిక మహిళా కళాశాల పక్కన ఉన్న ఎస్సీ కార్పొరేషన్ షాపింగ్ కాంప్లెక్స్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గడ్డెమ్మ, ఉత్తరాంధ్ర మాదిగ డైరెక్టర్ సుజాత, మాల కార్పొరేషన్ డైరెక్టర్ బోనెల అప్పారావు, ఎల్‌డీఎం పేడాడ శ్రీనివాసరావు, నాగభూషణరావు, ఎంఆర్ పీఎస్, ఎంఎస్‌ఎఫ్ నాయకులు పాల్గొన్నారు.