Shining stars awards: విద్యతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం
ABN , Publish Date - Jun 10 , 2025 | 12:24 AM
Education and development విద్యతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని కేంద్రపౌరవిమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. శ్రీకాకుళంలోని ఆనందమయి ఫంక్షన్ హాల్‌లో సోమవారం ఘనంగా షైనింగ్ స్టార్స్ అవార్డుల కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తో కలిసి కేంద్రమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు
షైనింగ్ స్టార్స్ విద్యార్థులకు అవార్డుల పంపిణీ
ప్రతిభను గుర్తించి.. ప్రోత్సహించాలి
జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్
శ్రీకాకుళం, జూన్ 9(ఆంధ్రజ్యోతి): విద్యతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని కేంద్రపౌరవిమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. శ్రీకాకుళంలోని ఆనందమయి ఫంక్షన్ హాల్‌లో సోమవారం ఘనంగా షైనింగ్ స్టార్స్ అవార్డుల కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తో కలిసి కేంద్రమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదోతరగతి, ఇంటర్‌లో అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులను సత్కరించారు. రూ.20వేలు చొప్పున నగదు బహుమతితోపాటు ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ ‘ప్రభుత్వం విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి పెట్టింది. విద్యార్థుల అభ్యున్నతిని గుర్తించి వారికి మరింత ప్రోత్సాహం అందించే బాధ్యత మనందరిపై ఉంది. భవిష్యత్తులో లక్ష్యాలు చేరుకునేలా సహాయ సహకారాన్ని అందించాలి. దేశాన్ని ముందుకు నడిపించే బాధ్యత యువతదే. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే విద్యతోనే సాధ్యమని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గుర్తించి ఇటువంటి కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ సహాయ సహకారాలతో విద్యార్థులంతా మంచి భవిష్యత్తు పొందాల’ని స్పష్టం చేశారు.
జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ‘పదో తరగతి, ఇంటర్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ‘షైనింగ్ స్టార్’ అవార్డులు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. విద్యార్థుల్లో ఉత్సాహం పెంపొందించేలా ఈ కార్యక్రమం జరుగుతోంది. విద్యార్థులకు మెరుగైన విద్యను ప్రభుత్వం అందిస్తోంది. చాలెంజ్డ్ విద్యార్థులకు విద్యనందించేందుకు ప్రత్యేక చర్యలు చేపడతాం. భవిష్యత్ కార్యాచరణ దృష్టిలో ఉంచుకుని విజన్ 2047 ప్రణాళికలు రూపొందించాం. బాగా చదువుకొని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకే కాకుండా సొంత గ్రామానికి, జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాల’ని కోరారు. గెలుపు దిశగా అడుగులు వేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ విద్యార్థుల ప్రతిభను గుర్తించి.. ప్రోత్సహించాలని స్పష్టం చేశారు.
అనంతరం షైనింగ్ స్టార్స్‌కు ఎంపికైన కొండములగాం ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థిని ఝాన్సీ, లావేరు మండలం మురపాక జడ్పీహెచ్ స్కూల్ విద్యార్థి రోహన్, ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి దామోదర స్వప్న, పొందూరు హైస్కూల్ విద్యార్థిని ఫాతిమా తదితరులు మాట్లాడారు. ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల విద్యార్థులందరికీ ఎంతగానో ప్రేరణ కల్పిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, శ్రీకాకుళం, నరసన్నపేట ఎమ్మెల్యేలు గొండు శంకర్, బగ్గు రమణమూర్తి, డీఈవో తిరుమల చైతన్య, ఆర్‌ఐఓ దుర్గారావు, ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.